
వెలుగుమట్ల భూదాన వినోబా నవోదయ కాలనీలో ఏమిజరిగింది?
12 సంవత్సరాలుగా ఉంటున్న వాళ్లని తరిమేసి ఇళ్లు కూల్చారు...
ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూముల్లోని వినోబా నవోదయ కాలనీలో ఫిబ్రవరి 24న ఏమి జరిగింది?
12 సంవత్స రాలుగా నివసిస్తున్న వేలాది మంది పేద ప్రజల ఇళ్లను ధ్వంసం చేసి వీధుల పాలు జేసిన చర్య మీద ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపిడిఆర్ ) తెలంగాణ నేతలు డి . విజయేందర్ రావ్ (రాష్ట్ర కార్యదర్శి) డాక్టర్. యస్. జతిన్ కుమార్ (ఉపాధ్యక్షులు) వెల్లడిస్తున్న విషయాలు:
నవోదయ కాలనీలోని ఇళ్లను కూల్చివేయడంతో నిరాశ్రయులైన ప్రజలకు రాజకీయ పక్షాలు, పత్రికా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు తమ సంఘీభావం తెలుపుతున్నారు మరో వైపు కొంతమంది అక్కడ “అసలేమి జరుగుతోంది” అనే పేర అనేక రకాల కథనాలు వినిపిస్తున్నారు.
వారిలో కొందరికి పూర్వాపరాలు తెలియక, కొందరు తెలిసీ, కొందరు ప్రభుత్వ పక్షాలు విపరీతంగా చేస్తున్న దుష్ప్రచారానికి లోనయి కొన్ని అవాస్తవాలను వాస్తవాల పేరిట ప్రచారం చేస్తున్నారు. కొందరు దిక్కుతోచకుండా నిస్సహాయ స్థితిలో వున్న బాధితులు ఆక్రోశంలో పలికే మాటలకు విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజలు ఎవరో మధ్యవర్తుల మాటలు నమ్మి అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, కొందరు వాటిని దళారు లనుండి కొన్నారని కూడా చెబుతున్నారు. అప్రతిష్ట పాలయిన మంత్రులు, ప్రభుత్వం చెబుతున్నట్లే అచ్చంగా అలాగే వీరు కూడా కోరుతున్నారు. అలాంటివారికి కొన్ని నిజాలు తెలియాలి.
భూముల చరిత్ర
వెలుగుమట్ల భూదాన భూముల స్వభావాన్ని చరిత్రను వారు విస్మరిస్తున్నారు. ఎక్కువ మంది నమ్ముతున్న ట్లుగా ఆభూముల పరిధి 31 ఎకరాలు కాదు మొత్తం 62 ఎకరాల 7 కుంటలు. 1954 నుండి ( దానం పొందిన ) వినోబా భూములుగా రికార్డులలో నమోదైవున్నాయి. అయితే కాలక్రమంలో సుమారు ముప్పై ఎకరాలు అన్యాక్రాంతానికి గురిఅయ్యింది. 2014 లో అప్పటి భూదాన బోర్డు మొత్తం 62 ఎకరాలను తన ఆస్తిగానే ప్రకటించి ఇళ్లు లేని పేదలకు నివాసాలు ఏర్పరచుకోవడానికి 100 గజాల చొప్పున కేటాయించి లేఔట్ చేసి ఇచ్చింది. అలా న్యాయ పరంగానే ఈ పేదలు ఆ భూమీపై హక్కులు సాధించుకుని, గ్రామీణ [పట్టణ] పేదల సంఘం ఆధ్వర్యంలో అందుబాటులో వున్న కేవలం 31 ఎకరాలలోనే నివాసాలు ఏర్పర్చుకున్నారు. మిగతా 31 ఎకరాలకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు దీనికి సహకరించలేదు.
అనేక సంవత్సరాలు వివిధ రకాలుగా ఉన్నత అధికారులను కలుస్తూ, ప్రాధేయపడుతూ, విజ్ఞాపనలు ఇస్తూ, ఆందోళనలు చేస్తూ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, కిరాయి గూండాల, పోలీసుల దాడులను ఎదుర్కొంటూ, సుమారు 600 కుటుంబాలకు చెందిన వేలాడి మంది పేదలు తమ ఇంటి స్థలాలను కాపాడుకుంటూ, అక్కడే నివసిస్తున్నారు. చెప్పలేని కష్టాల నడుమ, నీళ్ళు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు లేని చోట తమకు చేతనయిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ, తమ కొద్దిపాటి ఆదా యాల నుండే ఖర్చుపెట్టుకుంటూ పేదల సంఘం ఆధ్వర్యంలో తమ ఇళ్ళ స్థలాల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ స్థలాలు రియల్ ఎస్టేట్ లో కొనుక్కున్న జాగాలు కావు, పోరాడి నిలబెట్టు కుంటున్న జాగాలు. ఈ సుదీర్ఘ పోరాటం లో కొందరు జారిపోయినవారు, అనిశ్చిత పరిస్థితులలో అక్కడ జీవించలేక తమ స్థలాలను ఇతరులకు బదలాయించిన వారు వున్నారు. ఈ క్రమంలో ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడటం సర్వ సాధారణ విషయమే. నాయకత్వం ఈ సమస్యలను పరిష్కరించి ప్రజల మధ్య ఐక్యతను నెలకొలపటానికి ప్రయత్నించింది. కొందరు స్వార్ధపరులు చేసిన అక్రమాలను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకున్నది. ఈ మొత్తం ప్రక్రియను వ్యతిరేకించిన కొందరు తమ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి విచ్చిన్నశక్తులుగా మారి అసత్య ప్రచారాలను సాగించి ప్రజల ఐక్యతను, పోరాటాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నించారు.
వెలుగుమట్ల భూదాన కాలనీ పోరాటం కూడా ఈ దశాబ్ద కాలంలో ఇలాటి అనేక ఆటుపోట్లకు గురయ్యింది. అంతేకాదు ఇంతకుముందే ప్రభుత్వం కనీసం రెండుసార్లు పెద్దఎత్తున కాలనీని కూల్చివేయటానికి సిబ్బందిని, జెసిబిలను పోలీసులను మోహరించినపుడు ఈ సంఘ నాయకత్వంలోనే ప్రజలు ఆ ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టారు. దానితో ఇక ఉద్యమాన్నిలోపలినుండే విచ్చిన్నం చేయటంకోసం గత నాలుగు సంవత్సరాలుగా ఈ దుష్ప్రచారాలను తీవ్రం చేశారు. . కొన్ని చానెళ్లు, పత్రికలు ముఖ్యంగా స్థానిక స్తాయి మీడియాలో ఒక పథకం ప్రకారం అవాస్తవాలను. అభూత కల్పనలను, నిరాధార ఆరోపణలను గోరంతలు కొండంతలుగా ప్రచారం చేస్తూ, కొందరు కార్యకర్తలపై, నాయకుల పై అభాండాలు వేసి వాటికి తగినట్లు సాక్ష్యాలు సృష్టిస్తూ, పలుమార్లు అరెస్టులు చేస్తూ, అక్రమ నిర్బంధాలు చేస్తూ, వారిని కరుడుగట్టిన నేరస్థులుగా చిత్రించటం కోసం పోలీసు రికార్డులు తయారు చేస్తూ వచ్చారు. నివాసతులలోనూ, పట్టణ ప్రజలలోనూ కొంత అనుమానాలు , అపనమ్మకo కల్గించటానికి ప్రయత్నించారు. ఉద్యమ సంఘీభావానికి చేటు కలిగించటమే వీరి లక్ష్యం.
ఓపిడిఆర్ రాష్ట్ర నాయకత్వం పలుమార్లు ఉన్నతాధికారులను కలిసినప్పుడు తమపై రాజకీయ ఒత్తిడి వున్నదని, సంఘ నాయకులను ఎప్పుడైనా అరెస్టు చేసే రంగం సిద్ధంగా వుందని బాహాటం గానే చెప్పారు. ఈ విపత్కర స్థితిలో కూడా కాలనీ వాసులు తమ ఆందోళనలు వీడలేదు. కొద్దిమందిని మినహాయించి వందలమంది కనీస సదుపాయాలు కూడా లేని ఆ చీకటిలో మగ్గుతూ అక్కడే కాపురాలు చేస్తున్నారు. ఓపిడిఆర్ తన స్వంత పరిశీలనలతోపాటు అనేక ప్రజా సంఘాల నాయకులతో కూడిన రెండు నిజనిర్ధారణ కమిటీలు నియమించి వాస్తవ పరిస్థితిపై నివేదికలు తయారు చేసింది. ఆ కమిటీల లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు, జస్టిస్ చంద్రకుమార్ వంటి విశ్రాంత న్యాయమూర్తులు, ప్రముఖ జర్నలిస్టులు, ఇతర ప్రజానాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం చట్ట వ్యతి రేకంగాను, మానవ హక్కులకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నదని ఆ కమిటీలు నిర్ధారించాయి. భూదాన బోర్డునుండి సక్రమoగా పొందిన అనుమతి పత్రాల ఆధారంగానే పేదలు తమ నివాసాలు ఏర్పరచుకున్నారు. వాటి ఆధారoగానే ఆకాలనీ కి నీరు, కరెంటు ఇవ్వాలని, ఆ ఇళ్లను కూల్చకూడదని, అధికారులు జోక్యం చేసుకోకూడదని, ఉన్నస్థితిని కాపాడాలని హైకోర్టు వివిధ సందర్భాలలో ప్రజలకు అనుకూలంగా అర్థర్లు ఇచ్చిoది. భూదాన బోర్డు పత్రాలు చెల్లవని ఎప్పుడూ కోర్టు చెప్పలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత ఈ తీర్పులను లెక్క చేయకుండా సిసిఎల్ఏ సెక్రటరీ పేర భూదాన పత్రాలు తప్పుడువని, వాటిని ఆఫీస్ జారీ చేసినట్లు రికార్డులు లేవని ప్రకటించి, ఆభూములను కొందరు అక్రమo గా ఆక్రమించుకున్నారని ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిర్ణయించి వారి ఇళ్లను కూల్చివేయటం ఎంత బరి తెగించిన తనం. ఎంత చట్టవిరుద్ధం. సహజ న్యాయానికి ఎంత భంగకరం!
ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్లు కూడా పూర్తయ్యాక, తనకు అనుకూలమైన సమయం చూసుకుని వేలమంది పోలీసులు వందలమంది సిబ్బంది, ఆధునిక కూల్చివేత యంత్రాలతో- తక్కువ సంఖ్యలో వున్న ప్రజలను చుట్టుముట్టి వాళ్ళ ఇళ్లను నేలమట్టం చేసింది. పైపెచ్చు పేదలకు, అర్హులకు ఇళ్లు ఇస్తామని ప్రకటిస్తున్నది. ఎంత సిగ్గుమాలిన తనం! తాగునీరుకూడా లేనిచోట 10 సంవత్సరాలుగా నివాసం వుంటున్నవాళ్ళు పేదలు కారా? కరెంటుకూడ లేనిచోట వుంటూ చదువులు సాగక, వృత్తులు నిర్వహించుకోలేక పలు బాధలకు గురవుతున్న వాళ్ళు ధనికులా? ఎప్పటికప్పుడు తమ ఉనికిక వస్తున్న ముప్పు నుంచి తమ ఇళ్లను కాపాడుకుంటున్న వాళ్ళు ఆ ఇళ్లకు అర్హులు కారా? పొట్ట చేత పట్టుకుని వచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటున్న వారిని స్థానికులు, కానివారు అంటూ విభజించటం కాలనీ వాసుల ఐక్యతను దెబ్బతీయటం కాదా? పేదలకు దక్కవలసిన భూదాన భూమిని ప్రభుత్వ భూమిగా స్వాధీనం చేసుకుని 250 కోట్లు విలువైన భూమిని ప్రభుత్వానికి కాపాడి పెట్టామని చెప్పుకుంటున్న అధికారులు ఇప్పుడు అ భూమిని ఏ ఘనకార్యాలకు, ఏ ధనవంతులకు కట్టబెట్ట పూనుకున్నారో అందరికీ అర్ధమవుతూనే వున్నది. ఇది భూదానభూమి ప్రయోజనాన్నే కాలదన్నటం కాదా?
ఇళ్లను కూల్చివేసిన వారందరికీ తిరిగి ప్రభుత్వమే అదే కాలనీలో పునరావాసం కల్పిస్తూ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని వారు ఆలోగా నివాసయోగ్యమైన తక్షణ పునరావాసం కల్పించాలి. ఇప్పటికే జరిగిన వస్తునష్టానికి, క్షోభకు సముచితమైన నష్ట పరిహారం చెల్లించాలి. ఈ సందర్భంలో జరిగిన అన్ని అరెస్టులను రద్దుచేయాలి. ప్రజలపై దౌర్జన్యాలను నిలిపివేయాలి అక్రమ ఆరోపణలు చేసి అరెస్టు చేసిన కార్యకర్తలు, నాయకులపై కేసులు ఎత్తివేసి, ఇళ్ల కూల్చి వేతకరు కారకులైన వారి మీద చర్యలు తీసుకోవాలి.

