‘రాయల్ మెజీషియన్’ ఇన్నాళ్లు ఏమయ్యాడు? రాహుల్‌కు చురకలంటించిన మోదీ
x
మధ్యప్రదేశ్ హోషంగాబాద్‌లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

‘రాయల్ మెజీషియన్’ ఇన్నాళ్లు ఏమయ్యాడు? రాహుల్‌కు చురకలంటించిన మోదీ

రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపిన వారు ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా అధికార పగ్గాలు చేపట్టాలని ఉవిళ్లూరుతున్నారని ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.


పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తానన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఏఐసీసీ మాజీ చీఫ్‌ను ’రాయల్ మెజీషియన్‌‘గా అభివర్ణిస్తూ చురకలంటించారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని పిపారియా పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
రాహుల్ గాంధీ ఇటీవల రాజస్థాన్‌లోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తామని అన్నారు. ''మీరు పేదిరికపు రేఖకు దిగువన ఉంటే ఏటా రూ.లక్ష ఇస్తాం. ఆ డబ్బుతో దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తాం'' అని చెప్పారు. 'మహాలక్ష్మి పథకం' కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏటా రూ.లక్ష సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఈ వ్యాఖ్యలపై మోదీ స్పందించారు.
రాయల్ మెజీషియన్ ఇన్నాళ్లు ఏమయ్యాడు?
"దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ షెహజాదా ప్రకటించారు. ఈ ప్రకటన నవ్వు తెప్పిస్తుంది. ఈ రాజ మాంత్రికుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కనిపించకుండా పోయాడు? అతని అమ్మమ్మ (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ) 50 సంవత్సరాల క్రితం 'గరీబీ హఠావో' నినాదాన్ని ఇచ్చారు." అని పేరు చెప్పకుండానే రాహుల్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
2014కి ముందు పదేళ్లు రిమోట్‌ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారని.. ఇప్పుడు ఇన్‌స్టంట్‌ మంత్రం జపించడం నవ్వు తెప్పిస్తుందన్నారు. ఎన్ని రకాల ప్రచారాలు చేసినా దేశం రాహుల్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రధాని అన్నారు.
దేశాన్ని రక్షించగలరా?
సీపీఐ(ఎం) మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ.. పేరు చెప్పకుండానే భారత కూటమిలోని ఓ పార్టీ అణు నిరాయుధీకరణకు హామీ ఇచ్చిందని చెప్పారు. బలపడలేని పార్టీ దేశాన్ని బలపరచగలదా? అని ప్రశ్నించారు. "భారత్ కూటమి భాగస్వాముల మేనిఫెస్టోలలో అనేక ప్రమాదకర వాగ్దానాలున్నాయి. దాని భాగస్వామి ఒకటి.. దేశం అణు నిరాయుధీకరణకు హామీ ఇచ్చింది." అని చెప్పారు. "మన దేశాన్ని రక్షించుకోవడానికి అణ్వాయుధాలు అవసరం. అవి లేకపోతే దేశాన్ని రక్షించలేరు" అని మోదీ పేర్కొన్నారు.
ఎన్నో పుకార్లు..
పేద కుటుంబానికి చెందిన కొడుకు ప్రధాని కాలేరని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని కాంగ్రెస్‌ పార్టీ పుకార్లు పుట్టించిందని మోదీ మండిపడ్డారు. మోడీ మూడోసారి ప్రధాని అయితే జనానికి ఇబ్బందులు తప్పవని రాజకుటుంబం ప్రచారం చేస్తోందన్నారు.
రామమందిరాన్ని నిర్మిస్తే, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తే దేశం మంటల్లో కూరుకుపోతుందని గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.
"ఫిర్ ఏక్ బార్, మోడీ సర్కార్" నినాదం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని, మోదీకి ఎలాంటి కలలు లేవని, మీ కలలే నా ధ్యేయమని సభాముఖంగా అన్నారు మోదీ.
బాబాసాహెబ్ వల్లే..
బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోదీ అన్నారు. "కాంగ్రెస్ ఎల్లప్పుడూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించేది. కాని మేం ఆయనను గౌరవించాం" అని అన్నారు.
ఆదివాసీల (గిరిజనుల) సహకారాన్ని కాంగ్రెస్ ఎన్నడూ గుర్తించలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం వారిని గౌరవించిందన్నారు.
దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అంబేద్కర్ రాజ్యాంగం కారణంగానే ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అయ్యారని చెప్పారు.
మరోసారి ఆశీర్వదించండి..
ఈరోజు అంబేద్కర్‌జీ జయంతి. చరిత్రలో గొప్ప రోజు.. బాబాసాహెబ్ రాజ్యాంగం వల్లనే ఓ గిరిజన కుటుంబానికి చెందిన కూతురు దేశానికి రాష్ట్రపతి అయ్యిందని, మూడోసారి మీకు సేవ చేసేందుకు ఈ పేద మహిళ కొడుకు ఓట్లు అడుగుతున్నాడు.’’ అని మోదీ అభ్యర్థించారు.
మధ్యప్రదేశ్‌లోని మోవ్ పట్టణంలో జన్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్‌తో ముడిపడి ఉన్న 'పంచ తీర్థాన్ని' అభివృద్ధి చేయడానికి బిజెపి ప్రభుత్వానికి అవకాశం లభించిందని అన్నారు.
గిరిజనుల ఐకాన్ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం 2025ని 'జంజాతీయ గౌరవ్ దివస్'గా జరుపుకుంటుందని చెప్పారు.
Read More
Next Story