అల్పాన్యూమరిక్ నంబర్ అంత కీలకమా?
సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 18) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై విరుచుకుపడింది. గురువారం (మార్చి 21) లోపు ఎలక్టోరల్ బాండ్లపై అన్ని వివరాలను అందించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 18) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై విరుచుకుపడింది. గురువారం (మార్చి 21) లోపు ఎలక్టోరల్ బాండ్లపై అన్ని వివరాలను అందించాలని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేజీ పర్దివాలా, మనోజ్ మిశ్రా ప్రతి బాండ్‌పై ఉన్న ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ నంబర్ల వివరాలను తమ ముందు ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించారు.
ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే ఏమిటి?
ప్రతి ఎలక్టోరల్ బాండ్ ఒక ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ కోడ్ సాధారణ కంటికి కనిపించదు. నిర్దిష్ట కాంతిలో మాత్రమే చూడగలుగుతాం. కొనుగోలుదారుడెవరు? గ్రహీత ఎవరు? రాజకీయ పార్టీ పేరు తదితర వివరాలు ఈ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.
కోడ్ ఉనికి ఎలా వెలుగులోకి వచ్చింది?
ప్రతి బాండ్‌పై ఇలాంటి ఓ ప్రత్యేక కోడ్ ఒకటి ఉంటుందని మొదటిసారిగా ఏప్రిల్ 2018లో ది క్వింట్ నివేదికలో వెల్లడైంది.
ఈ ప్రత్యేకమైన కోడ్ బాండ్ కొన్న వ్యక్తి , గ్రహీత, వారిద్దరి మధ్య సంబంధాన్ని బయటపెడుతుంది. అయితే ఈ కోడ్ కేవలం సెక్యూరిటీ ఫీచర్ మాత్రమేనని, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్ చేయడం అసాధ్యమని ఎస్‌బీఐ తెలిపింది.
ఎలక్టోరల్ బాండ్లపై ఉన్న "రాండమ్ సీరియల్ నంబర్" విరాళాలు లేదా కొనుగోలుదారులను ట్రాక్ చేయలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే కొనుగోలుదారు లేదా రాజకీయ పార్టీ బాండ్‌ను డిపాజిట్ చేయడానికి సంబంధించి ఈ కోడ్ రికార్డులను SBI తన వద్ద ఉంచుకోదని కూడా పేర్కొంది.
నవంబర్ 2019లో హఫ్‌పోస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్‌ల కొనుగోలుదారులందరినీ బ్యాంక్ ట్రాక్ చేస్తోంది. ఈ బాండ్ల ద్వారా విరాళాలు అందుకుంటున్న పార్టీలను కూడా బ్యాంక్ పర్యవేక్షిస్తోంది. ఈ ట్రాకింగ్ ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ల ద్వారా జరిగిందని చెబుతుంది.
SBI ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇచ్చింది?
బాండ్లను కొనుగోలు చేసిన దాతలు, వాటిని ఎన్‌క్యాష్ చేసిన రాజకీయ పార్టీల వివరాలను మాత్రమే SBI రెండు వేర్వేరుగా అందించింది.
ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఎస్‌బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మునుపటి తీర్పులో తేదీలు, పేర్లు, డినామినేషన్‌లతో సహా బాండ్ కొనుగోళ్ల గురించి అన్ని వివరాలను వెల్లడించాలని కోర్టు స్పష్టంగా బ్యాంక్‌ను ఆదేశించింది. అలాగే తమ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని వెల్లడించామని, ఏదీ రహస్యంగా ఉంచలేదని ధృవీకరిస్తూ గురువారం (మార్చి 21)లోగా ప్రమాణస్వీకార ప్రకటన సమర్పించాలని బ్యాంకు చీఫ్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరింది.
SBI ఏమి చెప్పింది?
బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల నంబర్లను కోరితే వాటిని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.