అసలు ప్రత్యూష మరణ కేసు ఏంటి? ఏం జరిగింది?
x

అసలు ప్రత్యూష మరణ కేసు ఏంటి? ఏం జరిగింది?

23 సంవత్సరాలు సాగిన న్యాయపోరాటం.


తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే తన మార్క్ చూపించుకోవడం స్టార్ట్ చేసిన నటి ప్రత్యూష. చేసింది కొన్ని సినిమాలే అయినా అభిమానుల ఆదరాభిమానులు అందుకుంది. ఆమె అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. అలాంటి ఒక్కసారిగా ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందన్న వార్త. అభిమానులంతా నివ్వెరబోయారు. అసలు ఏమైంది? అన్న ప్రశ్న అందరిలోనూ మెదిలింది. 2002 ఫిబ్రవరిలో ప్రత్యూష అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఆమెతో పాటు ఉన్న ప్రియుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే ఈ కేసుకు ఆరంభం. ఈ కేసు ఒక్క తెలుగునాటే కాదు.. యావత్ దేశంలో సంచలనంగా మారింది. అనేక అనుమానాల నడుమ ఎట్టకేలకు 24ఏళ్ల తర్వాత ఈ కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువరించింది.

2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. పురుగుమందు కలిసిన కూల్‌డ్రింక్ తాగినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి చెందారు. ఆమె వయస్సు కేవలం 20 ఏళ్లు. సిద్ధార్థ రెడ్డి చికిత్స తర్వాత కోలుకున్నాడు. కుటుంబ వ్యతిరేకత కారణంగా ఇద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారని తొలి సమాచారం వచ్చింది. కానీ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఇది పూర్వ ప్రణాళిక హత్య అని ఆరోపించారు. ప్రభావశీలుల ప్రమేయం ఉందని కూడా పేర్కొన్నారు. దీంతో కేసు ఒక్కసారిగా సంచలనమైంది.

దర్యాప్తు ఎలా మారింది?

ప్రజా ఒత్తిడి పెరగడంతో 2002 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. ఇదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదికపై పెద్ద వివాదం చెలరేగింది. గాంధీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ మునిస్వామి మొదటి నివేదికలో గొంతు నులిమి చంపారని, అత్యాచారం జరిగిందని అభిప్రాయపడ్డారు. అయితే తర్వాతి వైద్య బృందాలు ఆ అభిప్రాయాన్ని తిరస్కరించాయి. నారాయణ రెడ్డి నేతృత్వంలోని నిపుణులు, తరువాత ఎయిమ్స్ వైద్యులు, మరణానికి కారణం పురుగుమందు ప్రభావమేనని స్పష్టం చేశారు. ముఖంపై నీలి మచ్చలు లేవని, కడుపులో విషపదార్థం ఉన్నట్లు గుర్తించారని నమోదు చేశారు. లైంగిక దాడి ఆనవాళ్లు లేవని పేర్కొన్నారు. అనంతరం మునిస్వామిని సస్పెండ్ చేశారు.

కోర్టుల్లో ఏం జరిగింది?

  • 2002 నవంబరులో సీబీఐ ఇది ఆత్మహత్యేనని తేల్చింది. సిద్ధార్థ రెడ్డిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం నమోదు చేసింది.
  • 2004లో నాంపల్లి కోర్టు అతడిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో హైకోర్టు శిక్షను రెండు సంవత్సరాలకు తగ్గించింది. జరిమానా 50 వేల రూపాయలకు పెంచింది.
  • 2012లో సరోజినీ దేవి హత్య కోణంలో విచారణ జరపాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు సిద్ధార్థ రెడ్డి తనపై ఉన్న శిక్షను పూర్తిగా రద్దు చేయాలని అప్పీల్ వేశారు.

దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో 2025 నవంబరులో తీర్పు రిజర్వ్ చేశారు. చివరకు 2026 ఫిబ్రవరి 16న న్యాయమూర్తులు రాజేష్ బిందాల్, మన్మోహన్‌ల బెంచ్ తుది తీర్పు వెల్లడించింది.

కోర్టు ప్రకారం వైద్య ఆధారాలు స్పష్టంగా విషప్రయోగమే కారణమని సూచిస్తున్నాయి. హత్య లేదా అత్యాచారం ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని పేర్కొంది. పరస్పర ఆత్మహత్య ప్రయత్నంలో బతికిన వ్యక్తిగా సిద్ధార్థ రెడ్డి చట్టపరమైన బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఎందుకు సంచలనం అయింది?

వైద్య నివేదికల్లో విభేదాలు రావడం, రాజకీయ వర్గాల పేర్లు వినిపించడం, తల్లి సరోజినీ దేవి దీర్ఘకాల పోరాటం చేయడం ఈ కేసును రెండు దశాబ్దాలు వార్తల్లో నిలిపాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో చట్టపరమైన అధ్యాయం ముగిసింది. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన ఈ ఘటనకు అధికారికంగా తెరపడింది.

Read More
Next Story