
రేవంత్ చెప్పిన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ నేపధ్యం ఇదే
బాపూఘాట్ ను ప్రపంచస్ధాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు కూడా రేవంత్ చెప్పారు
ఢిల్లీలో కేంద్రమంత్రుల భేటీలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు. గురువారం ఉదయం రక్షణశాఖ మంత్రి (Rajnath Singh)రాజ్ నాథ్ సింగ్ తో భేటీ సందర్భంగా(Revanth) రేవంత్ మాట్లాడుతు ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించబోయే ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ శంకుస్ధాపనకు హాజరవ్వాలని ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్ధలంలో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వివరించారు. మూసీనది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. (Bapu Ghat)బాపూఘాట్ ను ప్రపంచస్ధాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు కూడా రేవంత్ చెప్పారు.
రేవంత్ నోట గాంధీ సరోవర్ ప్రాజెక్టు అన్న మాట వినగానే చాలామందికి గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏమిటి అనే సందేహాలు రావటం సహజం. ఈసా, మూసీ నదీ సంగమప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్టును రివర్ ఫ్రంట్ అండ్ రిజర్వాయర్ డెవలప్మెంట్ రెజువనేషన్ పద్దతిలో ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. మూసీనది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగానే గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టును ముఖ్యంగా మంచినీటి ప్రాజెక్టుగానే ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. మూసీనది ప్రక్షాళలన తర్వాత మంచినీటి నదిగా మార్చిన తర్వాత మాత్రమే ఈ సరోవర్ ప్రాజెక్టు మొదలవుతుంది. దీనిలో టూరిజం ఎట్రాక్షన్, రిక్రియేషన్ జోన్ తదితర ఆకర్షణలు ఉండబోతున్నాయి.
ప్రస్తుతం మూసీనది దగ్గరకు వెళితే చాలు ఎంద కంపుకొడుతుందో అందరికీ తెలిసిందే. నదికి రెండువైపులా జరిగిన ఆక్రమణలతో నది వైశాల్యం కుచించుకుపోయింది. ఫలితంగా సహజ ప్రవాహం కూడా తగ్గిపోయింది. భారీవర్షాల సమయంలో నదికి రెండువైపులా ఉంటున్న వారికి ఇబ్బందులు తప్పటంలేదు. అందుకనే మూసీనది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా అక్కడ ఉంటున్న వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూముల ఇళ్ళు కేటాయించి, ఆక్రమణలను తొలగించి నదిని వెడల్పు చేస్తుంది ప్రభుత్వం. నదిలోకి వ్యర్ధాలు, రశాయనాలు కలవకుండా అడ్డుకుంటుంది. తర్వాత నదిలో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేసి నీటిని శుద్ధిచేస్తుంది. ఆ తర్వాత గోదావరి నీటిని తరలించటంతో మూసీనదిలోని నీరు పరిశుభ్రంగా మారుతుందని రేవంత్ చెబుతున్నాడు.
మూసీ ప్రక్షాళన తర్వాత ఈసా-మూసీ నదుల సంగమప్రాంతంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఈ ప్రాజెక్టులో పెద్ద చెరువులాంటిది ఏర్పడటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భజలాల మట్టం పెరుగుతుందని ప్రభుత్వం అంచనావేసింది. అలాగే దీన్ని పర్యాటక ప్రాంతంగా కూడా డెవలప్ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయం లాంటి వివరాలను ప్రభుత్వం ఇంకా బయటకు ప్రకటించలేదు.

