ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చదవమన్న పుస్తకమేమిటీ?
ఫిజిక్స్ అంటే బోరని, కష్టమని, లెక్కల కంటే చుక్కలు లెక్కపెట్టడమే సులువనే పిల్లలకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓ చక్కని పుస్తకాన్ని సిఫార్సు చేశారు.
ఫిజిక్స్ అంటే బోరని, బాగా కష్టమని, లెక్కల కంటే చుక్కలు లెక్కపెట్టడమే సులువనే పిల్లలకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓ చక్కని పుస్తకాన్ని సిఫార్సు చేశారు. భౌతిక శాస్త్రమంటే బెంగవద్దని భరోసా ఇచ్చారు. పాఠాలు చెప్పే అయ్యవారు కాస్తంత సులువుగా చెబితే పిల్లలకు బాగా అర్థమవుతుందని నారాయణ మూర్తి అంటున్నారు. ఇంతకీ ఆ పుస్తకం పేరేమిటంటే "కాన్సెప్చువల్ ఫిజిక్స్". పాల్ జి.హెవిట్ అనే టీచర్ రాశారు. ‘కాన్సెప్చువల్ ఫిజిక్స్’ను ప్రతిఒక్కరూ చదవాలన్నారు. ఇదో అద్భుత పుస్తకంగా అభివర్ణించారు. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందని కూడా నారాయణమూర్తి చెబుతున్నారు. తానిప్పుడు "కాన్సెప్చువల్ ఫిజిక్స్" పుస్తకాన్ని చదువుతున్నానని చెప్పారు.
ఈ పుస్తకాన్ని హైస్కూల్ విద్యార్థులను దృష్టిలోఉంచుకొని రాశారు. ఫిజిక్స్‌ను ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారన్నది నారాయణ మూర్తి మాట. రచయిత నుంచి అనుమతి లభిస్తే దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలన్నారు. ఈ పుస్తకంలో అద్భుతమైన ఎక్సర్‌సైజులు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారు. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, మేఘాలయ నుంచి జామ్‌నగర్ వరకు ప్రతిఒక్కరూ దీన్ని చదవాలి అంటున్నారు. ‘సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేథమేటిక్స్ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది’’ అన్నారు ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనేవి కేవలం భయాలేనన్నది నారాయణ మూర్తి వాదన. కొత్త అవకాశాల సృష్టి, మనుషుల ఉత్పాదకతను పెంచే సామర్థ్యం ఏఐకి ఉందని అభిప్రాయపడుతున్నారు నారాయణ మూర్తి. ‘కేస్ టూల్స్’ అనే కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ టూల్స్ వచ్చినప్పుడు అనేక భయాలు గుర్తుచేశారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు ఊడిపోతాయనే ప్రచారం జరిగిందని, ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకే పెద్ద గిరాకీ ఏర్పడిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.
ప్రపంచంలో జరిగే నూతన ఆవిష్కరణలను భారత్ అందిపుచ్చుకోవాలని నారాయణ మూర్తి సలహా ఇచ్చారు. పాత తరాలతో పోలిస్తే ఇప్పటి యువతరం చాలా యాక్టివ్ గా ఉందన్నారు. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆలోచనల నుంచి బయటకు వచ్చి దాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించగలమనే దానిపై దృష్టి సారించాలని నారాయణ మూర్తి యువతకు సలహా ఇచ్చారు.