గుజరాత్‌లో చిన్నారుల మరణానికి కారణమేంటి?
గుజరాత్ రాష్ట్రంలో జూలై 10 నుంచి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులు చనిపోయారు. వీరి మరణానికి కారణమేంటో తెలియలేదు. వైద్యులు ఏం చెబుతున్నారు?
గుజరాత్‌లో ఆరురోజుల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. వీరంతా చండీపురా వైరస్‌తో మరణించి ఉంటారని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇదే లక్షణాలతో 12 మంది చిన్నారులు చికిత్స పొందారని, వీరిలో సబర్‌కాంత జిల్లాకు చెందిన వారు 4, ఆరావళికి చెందిన వారు 3, గుజరాత్‌లోని మహిసాగర్, ఖేడా నుంచి ఒకరు చొప్పున, రాజస్థాన్ నుంచి 2, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక చిన్నారి ఉన్నారని మంత్రి రుషికేష్ పటేల్ చెప్పారు. గుజరాత్‌లో చికిత్స పొందిన వీరి నుంచి రక్త నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపామని చెబుతున్నారు. శ్యాంపిల్స్ ఫలితాల తర్వాత మాత్రమే చిన్నారుల మరణాలకు స్పష్టమైన కారణం తెలుస్తుందన్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
"చండీపురా వైరస్ అంటువ్యాధి కాదు. ఇప్పటికే వైద్య సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 4,487 ఇళ్లలో 18,646 మందిని పరీక్షించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది" అని పటేల్ చెప్పారు.
అంటువ్యాధి కాదు..
‘‘రాబ్డోవిరిడే కుటుంబం వెసిక్యులో వైరస్ జాతికి చెందిన ఈ వైరస్ దోమలు, పేలు, ఇసుక ఈగలు ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. జ్వరం, జలుబు ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు. వ్యాధి ముదిరితే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని వైద్యులు చెబుతున్నారు.