ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రధాని సందేశం ఏమిటి?
ప్రధాని మోదీ కుటుంబ పార్టీలకు ఓటు వేస్తే ప్రమాదకరమని ఎందుకు అన్నారు? ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఎందుకు కోప్పడ్డారు?
జాతీయ ఓటరు నమోదు దినోత్సవం సందర్భంగా బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ వర్చువల్‌గా మాట్టాడారు. యువ ఓటర్లు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని చెబుతూ..స్వాతంత్రానికి ముందు యువతరానికి స్వేచ్ఛ లభించినట్లే..రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమపై ఉందన్నారు.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శిస్తూ.. కుటుంబ పాలన పార్టీలు యువతను ప్రోత్సహించవని, అలాంటి పార్టీలకు అధికారం కట్టబెట్టకూడదని ప్రజలను కోరారు. 10-12 ఏళ్ల క్రితం దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి ఉండేదని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని అన్నారు.
2014కి ముందు ఆశలు వదులుకున్న యువత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాల గురించి ఇప్పుడు దేశం మాట్లాడుతోందని అన్నారు. అప్పట్లో అవినీతి, కుంభకోణాలు ముఖ్యాంశాలని, అయితే ఇప్పుడు విశ్వసనీయత, విజయగాథలు గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
మౌలిక సదుపాయాలను పెంచడం, డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతూ యువతకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఆర్టికల్ 370 తొలగింపు, జిఎస్‌టి రోల్ అవుట్, పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లను ఉదహరిస్తూ.. గత 10 ఏళ్లలో కేంద్రంలో స్థిరమైన, బలమైన మెజారిటీ గల ప్రభుత్వం ఉండటం వల్ల సాహసోపేత నిర్ణయాలను తీసుకుందని, అలాగే దశాబ్దాలుగా పెండిరగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కనుగొందని మోదీ వివరించారు.
ఖర్గే మండిపాటు..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కమలం పార్టీ విజయంపై అనుమానం వ్యక్తం చేసిన ఇండియా కూటమి సభ్యులు వీవీపీఏటీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓటరు దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. వీవీపీఏటీ విధానం అమలు చేయాలని ఈసీని కోరుతున్న పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా భారత ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టారు. వీవీపీఏటీ విధానంపై ఈసీ నిరంతర తిరస్కరణ మన ప్రజాస్వామ్యం దాడిగా అభివర్ణించారు.