అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లిన అతిథులకు ఏం ఇచ్చారంటే..
x

అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లిన అతిథులకు ఏం ఇచ్చారంటే..

అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న అతిథులకు ట్రస్టు సభ్యులు బహుమతిగా ఏం ఇచ్చారో చూద్దాం..


అయోధ్య రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన బాలరాముడి (రామ్‌లల్లా) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీనటుడు హాజరయ్యారు. ప్రధాని మోదీ విగ్రహ ప్రతిష్ఠోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు ఆలయ ట్రస్టు 7,000 మందికి పైగా అతిథులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఎవరెవరు వెళ్లారు?..

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, నటులు అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌, అరుణ్‌ గోవిల్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నటులు అనుపమ్‌ ఖేర్‌, మనోజ్‌ జోషి, గాయకులు కైలాష్‌ ఖేర్‌, జుబిన్‌ నౌటియల్‌, గీత రచయిత ప్రసూన్‌ జోషి కూడా ముందుగానే ఇక్కడకు వచ్చిన అతిథులలో ఉన్నారు. హేమమాలిని, కంగనా రనౌత్‌, శ్రీశ్రీ రవిశంకర్‌, మొరారీ బాపు, రజనీకాంత్‌, పవన్‌ కళ్యాణ్‌, మధుర్‌ భండార్కర్‌, సుభాష్‌ ఘాయ్‌, షెఫాలీ షా, సోనూ నిగమ్‌ ఆదివారం అయోధ్య చేరుకున్నారు.వీరికి ఆలయం వద్ద ఘన స్వాగతం లభించింది.

అతిథులకు ఇచ్చినవేంటి..

రామ్‌లల్లాను దర్శించుకున్న అతిథులకు ఆలయ ట్రస్టు అప్పటికే సిద్ధంగా ఉంచిన కొన్ని వస్తువులను బహుమతిగా ఇచ్చింది.

అయోధ్య రామాలయంపై ప్రచురించిన పుస్తకం, లోహపు ‘దియా’, తులసి ‘మాల’, శ్రీరాముడి పేరు ఉన్న కండువాను అందజేశారు.

పుస్తకానికి ‘అయోధ్య ధామ్‌ - ది లార్డ్స్‌ అబోడ్‌’ అని పేరు పెట్టారు. ముఖచిత్రంగా రామ్‌లల్లా పాత విగ్రహం ఫొటోను ముద్రించారు.

‘ఉత్తరప్రదేశ్‌ టూరిజం’ పేరిట ముద్రించిన చిన్నపాటి సంచిలో తులసీ మాలాతో పాటు నాలుగు లడ్డూలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష ఉన్న బాక్స్‌ను అందజేశారు.

రామాలయం గురించి..

సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామాలయం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు. వెడల్పు 250 అడుగులు. ఎత్తు 161 అడుగులు. 392 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయానికి 44 తలుపులు అమర్చారు. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవతలను ప్రదర్శించారు. రామ్‌లల్లా కొత్త విగ్రహం ఆలయ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని గర్భగుడిలో ఉంచారు.

Read More
Next Story