
సిఎం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి: కేటీఆర్
‘మీడియా హెడ్లైన్ల కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పైన దృష్టి సారించి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి’
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగుల ఆందోళనను గౌరవించి వారిని పిలుచుకొని, ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలు రైతులు రైతు కూలీలు కౌలుదారులు విద్యార్థులు మహిళలు వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగులను సిఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గా మోసగించాడని ఆయన అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి కొంత మంది ఈ రోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలి. తూతూ మంత్రంగా కేవలం మీడియా హెడ్లైన్ల కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పైన దృష్టి సారించి దాన్ని అమలు చేయాలి. వరుసగా దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ తోపాటు అనేకచోట్ల విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి పోయిన రేవంత్ రెడ్డి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్ కి ఎందుకు పోలేకపోయిండు. బిఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తాము ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి తనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారు. హామీలను అమలు చేయమన్నందుకు ప్రతిపక్షాలను ప్రజలను ప్రతి ఒక్కరిని బూతులతో తిడుతున్నారు,” అని అన్నారు.
బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తు తెచ్చుకుంటున్నారని, కేటీఆర్ అభిప్రాయపడ్డారు. “రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితులు దిగజారిపోయాయి, వ్యాపారాలు తగ్గిపోయాయి, ఉపాధి దొరకకుండా పోయింది. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హైదరాబాద్ నగరంలో పది సంవత్సరాలలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చుకోవాలి. పది సంవత్సరాల కింద హైదరాబాదులో కరెంటు కోతలు, తాగునీటి తిప్పలు, అస్తవ్యస్తపు రోడ్లు ఉండేవి. మిషన్ భగీరథ తో పాటు హైదరాబాద్ మరియు ఇతర పట్టణాల్లో విస్తృతమైన తాగునీటి ప్రాజెక్టులతో తాగునీటి సమస్యలు 90 శాతం కి పైగా పరిష్కరించాము. కరోనా సమయంలోను హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశాము,” అని తెలిపారు.

