
తగ్గిన నక్సలైట్ల ప్రాబల్యం
నక్సలిజం అంతమైతే కేంద్ర నిధులు బంద్!
ఇంతవరకు నక్సల్ ప్రభావిత జిల్లాలకు బోలెడు నిధులు వచ్చేవి
నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా గుర్తించి వాటి అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రకటించిన కేంద్రం, ఇప్పుడు అదే జిల్లాల్లో నక్సల్స్ ప్రభావమే లేదని తేల్చడం వివాదాస్పదమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14 జిల్లాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వవాఖ కేవలం రెండేళ్ల పాటు ఒక్కో రాష్ట్రానికి రూ.25 కోట్ల చొప్పున మాత్రమే విడుదల చేసింది. అనంతరం “ఆపరేషన్ కగార్” విజయవంతమైందని, ఇక నక్సల్స్ ముప్పు లేదని ప్రకటించడం కేంద్రం వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అభివృద్ధి పూర్తి కాకముందే ప్రభావం తగ్గిందని చెప్పడం వెనుక అసలు కథేమిటన్న చర్చ మొదలైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు కేంద్రం మొండి చేయి చూపించింది. తెలంగాణ రాష్ట్రంలో 8, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నక్సల్స్ ప్రభావిత జిల్లాలను గుర్తించిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ, ఆయా జిల్లాల అభివృద్ధికి నిధులిస్తామని ప్రకటించింది. కానీ కేవలం రెండేళ్ల పాటు ఒక్కో రాష్ట్రానికి రూ.25 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. నక్సల్స్ ప్రభావిత జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను రెండు తెలుగు రాష్ట్రాలు కోరినా, అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు సరికదా నక్సల్స్ ప్రభావం లేదని తాజాగా తేల్చేశారు. ఆపరేషన్ కగార్ కింద నక్సల్స్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేశామని, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావం లేదని తాజాగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
ఏడు జిల్లాల్లోనే నక్సల్స్ ప్రభావం ఉందట...
కేంద్ర ప్రభుత్వం దేశంలో వామపక్ష తీవ్రవాదం ప్రభావిత జిల్లాల సంఖ్యను ఏడుకి తగ్గించింది. 2026 మార్చి నాటికి కగార్ ఆపరేషన్ కింద నక్సలైట్ల ముప్పును అంతం చేయాలనే లక్ష్యంతో దాడులు చేస్తున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ నక్సల్స్ పీడిత జిల్లాల సంఖ్యను కూడా తగ్గించింది.మార్చి 2026 నాటికి నక్సల్ ముప్పును అంతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు అనుగుణంగా ఉంటుంది. ఫిబ్రవరి నుండి అమలులోకి వచ్చేలా అన్ని నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల కొత్త వర్గీకరణను జారీ చేసింది. గతంలో దేశంలో 90 నక్సల్స్ ప్రభావిత జిల్లాలుండగా, వీటి గతంలో 61 జిల్లాలకు తగ్గించారు. ఆపై వీటి సంఖ్యను ఈ ఏడాది ఫిబ్రవరి 9వతేదీ నాటికి ఏడుకు తగ్గించింది. ఈ ఏడు జిల్లాలు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, కాంకేర్, దంతేవాడ; జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్, ఒడిశాలోని కంధమాల్ గా కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తించింది. నక్సలైట్ల హింస వల్ల దేశంలో ఇప్పటివరకు 17వేలమంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.
వచ్చే నెల మార్చినాటికి నక్సలిజం అంతం అవుతుందా?
2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ విజయం సాధించినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశంలోని ఛత్తీస్ ఘడ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర పది రాస్ట్రాల్లోని 61 జిల్లాలు నక్స్ ల్స్ ప్రభావిత జిల్లాలుగా 2019లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తించింది. ఆయా జిల్లాల్లోని 245 పోలీసుస్టేషన్ల పరిధిలో నక్సల్స్ ప్రాబల్యం ఉందని తేలింది. అడవుల్లో కేంద్ర బలగాల బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి నక్సల్స్ ప్రాబల్యాన్ని తగ్గించారు. 61 జిల్లాల నుంచి నక్సల్స్ ప్రాబల్యం కేవలం ఏడు జిల్లాలకు తగ్గిందని తాజాగా పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక వెల్లడించింది. అడవుల్లో గత ఆరేళ్లలో సీఆర్ పీఎఫ్, కోబ్రా, డీఆర్ జీ, ఐటీబీసీ కేంద్ర బలగాలతో 379 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు.అధికారులు అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు ఇచ్చి కేంద్రబలగాలతో నక్సల్స్ ప్రాబల్యాన్ని తగ్గించారు. ఆరేళ్లలో ఎన్ కౌంటర్లలో 1158 మంది మావోయిస్టులు మరణించగా, 7,530 మందిని కేంద్ర బలగాలు అరెస్టు చేశాయి. మరో 5,881 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టుల హింసలో మరణించిన వారి కుటుంబాలకు, భద్రతా బలగాల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కింద రూ.3523.48 కోట్లను కేంద్రం వెచ్చించింది.
తెలుగు రాష్ట్రాల్లో గతంలో నక్సల్స్ ప్రభావమున్న జిల్లాలివి...
తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలను నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, వరంగల్ రూరల్ జిల్లాను నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలను నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ప్రకటించినా ఆయా జిల్లాలకు నిధులు విడుదల చేయలేదు.
అరకొర నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యం ?
మావోయిస్టుల ప్రభావమున్న జిల్లాల్లో రోడ్ల నిర్మాణం, కమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయడం, మొబైల్ టవర్ల నిర్మాణం, బ్యాంకులు, తపాలాకార్యాలయాలు, వైద్య, విద్యా సౌకర్యాలను మెరుగుపర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,2755 కోట్లను కేటాయించింది. 2017- 18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని ఒకే ఒక్క జిల్లాకే కేవలం రూ.5కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2018-19 సంవత్సరంలో ఒక జిల్లాకే రూ. 20కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద కేంద్రం కేవలం రూ.25 కోట్లను విడుదల చేసింది.ఇతర రాష్ట్రాల్లో రూ.775 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేసినా, తెలంగాణకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆశించిన మేర నిధులు కేటాయించలేదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2017-18, 20218-19 సంవత్సరాల్లో కేవలం రూ.25కోట్లనే కేంద్రం విడుదల చేసింది. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపించిందని, దీనిపై తెలంగాణ ఎంపీ పోరాడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి కోరారు.
నక్సలిజం ప్రభావం తగ్గిందని కేంద్రం ప్రకటించడం ఒకవైపు సానుకూల పరిణామమే అయినా, అభివృద్ధి వాగ్దానాలు పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా జిల్లాలను జాబితా నుంచి తొలగించడం సరైన విధానమా అన్న ప్రశ్న మిగిలిపోతోంది. భద్రతా చర్యలతో పరిస్థితి అదుపులోకి రావొచ్చు గానీ, స్థిరమైన శాంతి కోసం సామాజిక–ఆర్థిక అభివృద్ధి తప్పనిసరి. రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చేరినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. కాబట్టి నక్సలిజం అంతమైందనే ప్రకటనతో పాటు, అభివృద్ధి పథకాలు కూడా నిలకడగా కొనసాగితేనే కేంద్రం విజయానికి సంపూర్ణ అర్థం ఉంటుంది.
Next Story

