
మావోయిస్టు మాజీ చీఫ్ గణపతి ఎక్కడ ?
సీనియర్ నేతలు సుమారు 300 మంది దాకా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు
ఆపరేషన్ కగార్ దెబ్బకు దేశంలో మావోయిస్టుపార్టీ ప్రాభవం క్షీణదశకు చేరుకున్నదనే చెప్పాలి. మంగళవారం మధ్యాహ్నం మావోయిస్టుపార్టీలోని కీలక నేతలు ముగ్గురు తెలంగాణ డీజీపీ ఎం శివధరరెడ్డి ముందు లొంగిపోతున్నారు. మావోయిస్టుపార్టీలో అత్యున్నత స్ధానమైన కేంద్ర కమిటి ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్రకమిటి సభ్యులు మల్లారాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహారెడ్డితో పాటు ఇంకా చాలామంది మావోయిస్టులు డీజీపీ ముందు లొంగిపోతున్నారు. లొంగిపోయే మావోయిస్టుల సంఖ్య 16 అని కాదు కాదు 40 అని రకరకాలుగా వినబడుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లొంగిపోతున్న వారంతా తమ ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. ఇక్కడే పార్టీకి రెండు విధాలుగా దెబ్బలు పడుతున్నాయి. ఒకటి మావోయిస్టులు లొంగిపోవటమే దెబ్బ అనుకుంటే, ఆయుధాలతో సహా లొంగిపోవటం ఇంకా పెద్ద దెబ్బ. మార్చి 31వ తేదీ తర్వాత దేశంలో మావోయిస్టు అన్న పదమే వినిపించకూడదన్నది నరేంద్రమోదీ, అమిత్ షా పట్టుదల. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో సుమారు 2లక్షల మందితో ఆపరేషన్ కగార్ ను కేంద్రహోంశాఖ ప్రారంభించింది. సీఆర్ఎపీఎఫ్, కోబ్రా, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, గ్రేహౌండ్స లోని మెరికల్లాంటి పోలీసులు, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా పోలీసులతో కలిపి కేంద్రహోంశాఖ ఆపరేషన్ కగార్ ను ప్రారంభించింది.
ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకు సుమారు 450 మంది లొంగిపోతే అంతేసంఖ్యలో ఎన్ కౌంటర్లలో చనిపోయారు. దశాబ్దాలుగా మావోయిస్టులకు అత్యంత సురక్షిత ప్రాంతాలుగా, షెల్టర్ జోన్లుగా భావించే దండకారణ్యంలోకి కూడా భద్రతాదళాలు అత్యంత ఆధునిక ఆయుధాలు, ద్రోన్లు, హెలికాప్టర్లతో చొచ్చుకునిపోతున్నాయి. మావోయిస్టుల షెల్టర్ జోన్లను బద్దలు కొట్టాయి. దాంతో దాదాపు ఏడాదిగా మావోయిస్టుపార్టీలోని కీలకనేతలు బాగా ఇబ్బందిపడుతున్నారు. దానికితోడు భద్రతదాళాలు దండకారణ్యం అడవులను రాత్రనక, పగలనక జల్లెడపట్టి మావోయిస్టులను ఏరేస్తుండటంతో నేతలకు దిక్కుతోచటంలేదు. అందుకనే ఒకవైపు లొంగుబాట్లు మరోవైపు ఎన్ కౌంటర్లు పెరిగిపోతున్నాయి. ఇందులోభాగంగానే ఈరోజు మావోయిస్టుపార్టీలోని టాప్ ర్యాకింగ్ నేతలు లొంగిపోతున్నారు.
గణపతి ఎక్కడ
సరిగ్గా ఈ సమయంలోనే చాలామంది దృష్టి మావోయిస్టుపార్టీ మాజీ చీఫ్ గణపతి మీదకు మళ్ళింది. ఎన్ కౌంటర్లలో చనిపోయి, లొంగిపోయిన మావోయిస్టులు కాకుండా మరికొందరు సీనియర్ నేతలు సుమారు 300 మంది దాకా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసుల ముందు లొంగిపోవటానికి ఇష్టపడని అతికొద్దిమంది కీలకనేతల్లో మాజీ చీఫ్ గణపతి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరికి పోలీసులకు ఎదురుపడి పోరాడే శక్తి లేకపోవటంతో పాటు అనేకమంది తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం ఉంది. అందుకనే పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా, కేంద్రకమిటి సభ్యుడు పసునూరి నరహరి, మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న పాపారావు, దమోదర్ తో పాటు మరికొందరు దేశంలోని అనేక ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని సమాచారం. గణపతి నేపాల్ లో షెల్టర్ తీసుకుంటున్నట్లు పోలీసుల దగ్గర సమాచారముంది.
ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కొద్దిమంది కీలకనేతలతో పాటు గణపతి కూడా లొంగిపోతే మావోయిస్టుపార్టీ చరిత్రలో మిగిలిపోవటం ఖాయం.
ఎస్ఐబీ కీలకపాత్ర
మావోయిస్టుపార్టీపై పోలీసులది పై చేయి అవటంలో ఎస్ఐబీ కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. మావోయిస్టుల ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచార సేకరణ, విశ్లేషణలో అత్యాధునిక పద్దతులను ఉపయోగించింది. ఇప్పటివరకు 14,078 మంది దళసభ్యులను పోలీసులు అరెస్టుచేశారు. 5865మంది కీలకనేతలు, దళసభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, పీజీఎల్ఏ కార్యదర్శి మాడ్వీ హిడ్మా లాంటి కీలకనేతలతో పాటు 1289 మందిఎన్ కౌంటర్లలో చనిపోయారు. మొత్తంమీద 1057 ఎన్ కౌంటర్లు జరిగాయి.
ఎస్ఐబీ ప్రధానంగా మావోయిస్టుపార్టీలోని కీలకనేతలు, అత్యున్నతస్ధాయి నేతలు సుమారు 23మందికి సంబంధించిన సమాచార సేకరణలో సక్సెస్ అయ్యింది. ఏదో పద్దతిలో కీలకనేతలతో టచ్ లోకి వెళ్ళి కొందరిని లొంగుబాట్లకు ఒప్పించింటంలో విజయంసాధించింది. వీరిలో 7 మంది కేంద్రకమిటి సభ్యులు అరెస్టవ్వగా, 7మంది లొంగిపోయారు. మరో9మంది ఎన్ కౌంటర్లలో చనిపోయారు. 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో ఎస్ఐబీ కీలకపాత్ర పోషించినట్లే చెప్పాలి. ఈరోజు లొంగిపోతున్న ముగ్గురు కీలక నేతల విషయంలో కూడా ఎస్ఐబీనే కీలకపాత్ర పోషించిందని చెప్పాలి.

