హసన్ ఎంపీ ప్రజ్వల్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా?అందుకే ఇండియాకు రావట్లేదా?
సెక్స్ స్కాండిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రజ్వల్ దేశం వీడాడు. బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఇక ఇండియాకు తిరిగిరాడేమోనన్న అనుమానం కలుగుతోంది.
సెక్స్ స్కాండిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇంకా పరారీలో ఉన్నారు. ఆయన ఇండియాకు తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఏడు రోజుల్లో భారతదేశానికి తిరిగి వస్తానని ప్రజ్వల్ మే 1న ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మే 5 లేదా 7 న ఇండియాకు తిరిగి వస్తాడన్న సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు సిట్ బృందాలు బెంగళూరు, గోవా, కొచ్చి, మంగళూరు విమానాశ్రయాల్లో వేచి చూసిన ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ప్రజ్వల్ గల్ఫ్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.
పార్లమెంటు ఎన్నికల వేళ దేశాన్ని కుదిపేసిన సెక్స స్కాండిల్ పై దర్యాప్తు చేయడానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.
పెరిగిపోతున్న ఎఫ్‌ఐఆర్‌లు..
ప్రజ్వల్‌పై ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. తనపై ఉన్న కేసుల తీవ్రతను ఊహించి ఉంటాడని, అందుకు అతను ఇండియాకు తిరిగి రావడానికి వెనకాడుతున్నాడని సిట్ అధికారి ఫెడరల్‌కు తెలిపారు. ప్రజ్వల్‌పై మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
"ఎక్కువ మంది బాధితులు తమ స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడానికి వస్తున్నారు. దాంతో ప్రజ్వల్ పై మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే భారత్ కు తిరిగి రావడానికి ఆయన ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు ఉంది. అయితే అతను ఆయన్ను అరెస్టు చేయడం మాత్రం ఖాయం’’ అని ఒక అధికారి తెలిపారు.
మొదటి ఎఫ్‌ఐఆర్‌లో ప్రజ్వల్‌పై సెక్షన్ 354 (మహిళల నిరాడంబరత) కింద కేసు నమోదు చేశారు అయితే తరువాత సెక్షన్లు 376 (2)(n) జోడించారు. (ఒకే మహిళపై పదే పదే అత్యాచారం చేయడం.) ఫలితంగా పదేళ్లకు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఐటీ నిపుణుల సాయం తీసుకుంటారా?
ప్రజ్వల్ మహిళలతో కలిసి ఉన్నవీడియోలను తన మొబైల్ లో రికార్డు చేశాడని, వాటిని తర్వాత గూగుల్ డ్రైవ్‌లో అప్ లోడ్ చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ వీడియోలను తిరిగి బాధితులకు పంపాడా? లేక మరొవరికైనా షేర్ చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం పోలీసులు ఐటీ నిపుణలను సంప్రదించే అవకాశం ఉంది.
ఉచ్చు బిగుస్తోందా?
పరిస్థితులను బట్టి చూస్తే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ చుట్టూ ఉచ్చు బిగ్గుస్తున్నట్లు కనిపిస్తోంది.
"మేము దాదాపు 50 మంది బాధితులతో టచ్‌లో ఉన్నాం. ఇద్దరు బాధితులు ఇప్పటికే న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. మరో తొమ్మిది మంది సిట్ అధికారులకు ముందు ఇచ్చారు. వీళ్లంతా కోర్టుకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు.’’ అని సిట్ అధికారి ఒకరు తెలిపారు.
ఎలా లోబరుచుకున్నాడు?
బదిలీల ఆశ చూపి ప్రజ్వల్ రేవణ్ణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, అధికారులను లొంగదీసుకున్నారని ఆరోపణలున్నాయి. ట్రాన్స్ ఫర్ విషయంలో మాట్లాడాలని చెప్పి బాధితులను తన వద్దకు పిలిపించుకుని పలుమార్లు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సమాచారం. తమ బదిలీ కోసమే ప్రజ్వల్‌ను మొదట కలిశామని ఇద్దరు ప్రభుత్వ అధికారులు సిట్‌కు తెలిపారు. 2019 నుండి 2021 వరకు కోవిడ్ కాలంలో లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. ప్రజ్వల్ రోజూ రాత్రిపూట కాల్ చేసి మాట్లాడమని బలవంతం చేసేవాడని, కొన్నిసార్లు వీడియో కాల్స్ చేసి చిత్రహింసలకు గురిచేసేవాడని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టు పనులు దక్కేలా చూస్తానని కొంతమంది మహిళలను ప్రలోభపెట్టి లోబరుచుకున్నట్లు సమాచారం.
హెచ్‌డి రేవణ్ణ అరెస్టు తర్వాత (ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి రెండు కేసుల్లో నిందితుడు. ఇంట్లో పనిమనిషి నమ్రతపై దౌర్జన్యం చేయడం, ప్రజ్వల్ కేసులో అత్యాచార బాధితురాలిని కిడ్నాప్ చేయడం) బాధితులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్ పోల్ నోటీసు..
ప్రజ్వల్ కోసం ఇప్పటికే పోలీసులు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. దీంతో పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడి బాధితులు అతనిపై ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని సమాచారం.
హెల్ప్‌లైన్‌కు ఫోన్లు..
వీడియోలు బయటకు రావడంతో కొంతమంది బాధితులు ప్రత్యక్షంగా వచ్చి ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. వారు హెల్ప్‌లైన్ (6360-938947)కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. బాధితులను సంప్రదించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Next Story