
మూసీ, మెట్రోలకు నిధులెక్కడ రేవంతూ......
మూసీనది సుందీరకరణ, మెట్రో రెండోదశ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీకి రేవంత్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు
ఈమధ్య ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని పదేపదే చెబుతున్నారు. ఫ్యూచర్ సిటి నిర్మాణం, మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు, మెట్రో రెండోదశ ప్రాజెక్టులను పూర్తిచేయటం ద్వారా నగరానికి కొత్త హంగులు వస్తాయని, అంతర్జాతీయంగా హైదరాబాద్ వెలిగిపోతుందని ఎన్నిసార్లు చెప్పుంటారో లెక్కేలేదు. అయితే ఇప్పటివరకు చేసిన ప్రకటనలను బట్టిచూస్తే బడ్జెట్లో పై మూడు ప్రిస్టేజియస్ ప్రాజెక్టులకు ఎన్నివేల కోట్లరూపాయలు కేటాయిస్తారో అని చాలామంది ఎదురుచూశారు. ఎదురుచూసిన వారిలో ప్రతిపక్షాల నేతలు కూడా ఉన్నారు. అయితే శుక్రవారం ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీని చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మూసీనది సుందీరకరణ, మెట్రో రెండోదశ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీకి రేవంత్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు.
బడ్జెట్ కాపీలో ఏముందంటే ‘‘ హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్ధనుండి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం రాష్ట్రచరిత్రలో ఒక సాహసోపేతమైన, ప్రజానుకూలమైన నిర్ణయం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాతబస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటి దాటి ఇతర ప్రాంతాలకు విస్తరణ(ఫేజ్-2, ఫేజ్-3)అత్యవసరంగా మారింది’’ అని ఉంది. కాపీలో చెప్పింది నూరుశాతం నిజమే అనటంలో సందేహంలేదు. మరలాంటపుడు మెట్రో ప్రాజెక్టు 2వ దశ విస్తరణకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేయదలచుకున్నది ? ప్రాజెక్టు కాస్ట్ ఎంత ? నిధులను సమకూర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లాంటి వివరాలను చెప్పాలి కదా. మచ్చుకి ఒక్క వివరం కూడా ప్రస్తావించలేదు.
మెట్రోకు రు. 47 వేల కోట్లు కావాలి
అందుబాటులోని సమాచారం ప్రకారం మెట్రో రెండోదశ విస్తరణకు సుమారు 47 వేల కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనావేసింది. ఆర్ధికసాయం చేయాలని రేవంత్ ఇప్పటికే చాలాసార్లు కేంద్రప్రభుత్వాన్ని రిక్వెస్టు చేశారు. అయితే కేంద్రం నుండి సానుకూల సంకేతాలు రాలేదు. అవసరమైన నిధుల కోసం బ్యాంకులతో పాటు ఇతర ఆర్ధిక సంస్ధలతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఎల్ అండ్ టీ సంస్ధ నుండి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును టేకప్ చేయాలంటే రు. 15 వేల కోట్ల అప్పులున్నాయి. ఇందులో రు. 2 వేల కోట్లను నేరుగా ఎల్ అండ్ టీ యాజమాన్యానికి చెల్లించి మిగిలిన రు. 13 వేల కోట్లను సంస్ధ నుండి ప్రభుత్వం బదిలీ చేసుకోవాలి. అలాగే ఇపుడు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను కూడా ప్రభుత్వం తిరిగి తీసేసుకోవాలి.
ఈనేపధ్యంలో రు. 2 వేల కోట్లు ఎల్ అండ్ టీకి చెల్లించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి ? బదిలీ చేయించుకోవాల్సిన రు. 13 వేల కోట్ల మాటేమిటి ? ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులను నెత్తిమీదకు తీసుకుంటు మళ్ళీ అదనంగా 2వ దశ ప్రాజెక్టుకు అవసరమైన రు. 47 వేల కోట్ల రుణసమీకరణకు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి ? అన్నవివరాలను బడ్జెట్ కాపీలో ప్రభుత్వం చెప్పాలి కదా. పై వివరాల్లో దేన్నీ ప్రభుత్వం బడ్జెట్ కాపీలో ప్రస్తావించకపోవటంలో ఉద్దేశ్యంఏమిటో అర్ధంకావటంలేదు. ఇక, రెండోదశ మెట్రో ప్రాజెక్టు లో ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిందే రు. 2 వేల కోట్లయినపుడు మొత్తం ప్రాజెక్టుకే రు. 600 కోట్లు కేటాయించటంలో అర్ధమేమిటి ?
మూసీకి వేల కోట్లు అవసరం
అలాగే మూసీనది సుందీకరణ ప్రాజెక్టు విషయంలో కూడా ఎలాంటి వివరాలను ఇవ్వలేదు. బడ్జెట్ కాపీలో ఏముందంటే ‘‘మూసీనది పునరుద్ధరణ కోసం 55 కిలోమీటర్ల పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళికను చేపడుతున్నాము. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీరు మూసీకి అందించబడుతుంది. 45 సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లు ఇప్పటికే పనిచేస్తుండగా, అదనంగా మరో 39 ప్లాంట్ లు మంజూరు చేయగా, అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈసీ మరియు మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇందులో నదిని శుభ్రపరిచే పనులు, వరద నియంత్రణ, రివరర్ ఫ్రంట్ అభివృద్ధి, ప్రజలకు వినోద సదుపాయాలు ఏర్పాటుచేయటం ఉన్నాయి. మూసీనది బఫర్ జోన్ లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో వారికి పునరావాసం కల్పిస్తాము’’ అని మాత్రమే ఉంది.
మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత ? అన్నది ఎక్కడా చెప్పలేదు. అలాగే ఇప్పటికే 45 సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనిచేస్తుండగా అదనంగా మరో 39 ప్లాంట్లు మంజూరు చేయగా అవి వివిధ దశల్లో నిర్మాల్లో ఉన్నట్లు చెప్పింది ప్రభుత్వం. ఇప్పటికే పనిచేస్తున్న 49 సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎప్పుడు ఏర్పాటయ్యాయి ? బీఆర్ఎస్ హయాంలోనే ఏర్పాటయ్యాయా ? లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఏర్పాటయ్యాయా అన్న క్లారిటిలేదు. వీటి ఏర్పాటుకు అయిన ఖర్చు ఎంతో కూడా చెప్పలేదు. ఇక నిర్మాణంలో ఉన్న 39 ప్లాంట్లు ఎప్పుడు మంజూరయ్యాయి ? వీటికి అవుతున్న వ్యయం ఎంత ? ఎప్పటికి పూర్తవుతాయి ? అన్న వివరాలు చెప్పలేదు. మూసీనది సుందరీకరణ ప్రాజెక్టుకు వేలాది కోట్ల రూపాయలు అవసరమైతే రు. 1500 కోట్లు కేటాయింపు ఏమూలకు సరిపోతాయి ?
గాంధీ సరోవర్ ప్రాజెక్టు వ్యయం ఎంత ?
ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ఈసీ, మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రతిష్టాత్మకమైన గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రభుత్వం టేకప్ చేస్తున్నట్లు మాత్రమే చెప్పింది. ఈ ప్రాజెక్టు ఎంత విస్తీర్ణంలో చేపడుతోంది ? దీనికి అయ్యే వ్యయం ఎంత ? బడ్జెట్ కాపీలో చెప్పిన రివర్ ఫ్రంట్ వివరాలు, వినోద సదుపాయాలకు అయ్యే ఖర్చుల వివరాలను ప్రస్తావించలేదు. ప్రభుత్వం అయినా ప్రైవేటు సంస్ధలైనా ఏదైనా ఒక ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాయి అనగానే ముందుగా అందరికీ వచ్చే ఆలోచన బడ్జెట్ ఎంతనే కదా. బడ్జెట్ ఎంత ? ప్రాజెక్టులో ఏమేమి ఉంటుది ? ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే కదా జనాలు ఆలోచించేది. ఈ విషయాలు తెలిసి కూడా తన బడ్జెట్ కాపీలో ప్రాజెక్టు వ్యయం, ఎప్పుడు మొదలవుతుంది ? ఎప్పటిలోగా పూర్తవుతుందన్న వివరాలు చెప్పలేదంటే అర్ధం ఏమిటో ?
బడ్జెట్ అంతా బోగస్ : హరీష్
ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కీలకనేత తన్నీరు హరీష్ రావు మాట్లాడుతు ప్రభుత్వంపై మండిపడ్డారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, మెట్రో రెండోదశ ప్రాజెక్టుగురించి తరచు మాట్లాడే రేవంత్ రెడ్డి బడ్జెట్ కాపీలో ప్రాజెక్టులకు అయ్యే వ్యయాలగురించి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. నిధుల సమీకరణ గురించి బడ్జెట్ కాపీలో ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. బడ్జెట్ అంతా బోగస్ అని హరీష్ తేల్చేశారు. బీజేపీ నేతలు కూడా ఇదే విధంగా ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.

