
శాంతి చర్చలకు ఇస్లామాబాద్ రెడీ
పాకిస్తాన్ ఆతిధ్యంలో జరుగుతున్న శాంతిచర్చల్లో ఎవరెరు పాల్గొంటున్నారు
రేపు జరుగనున్న అమెరికా-ఇరాన్ శాంతిచర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్తాన్ రాజధాని సిద్ధమవుతున్నది. నగరమంతా అందంగా తయారవుతున్నది. ఫుట్‌పాత్‌లకు రంగులు వేస్తున్నారు, భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నారు. ఏందో జరుగుతుందోనన్న నిరీక్షణతో పాటు ఆందోళన కూడా నగరాన్ని ఆవరించింది. చర్చలు ఒక ఫైవ్ స్టార్ హోటెల్ లో జరుగునున్నట్లు ఇప్పటి సమాచారం. అమెరికా నుంచి ఆదేశ ఉపాధ్యక్షుడు వాన్స్, ఇరాన్ నుంచి పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహించనున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై సమన్వయ దాడులు చేసి, ఆదేశ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీని హతమార్చి న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో పలు దేశాల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణ మార్గం హార్ముజ్ జలసంధిని మూసివేసి ఇంధన సంక్షోభం సృష్టిచించింది. చమురు ధరలను ఆకాశాన్నంటించిన సరిగ్గా ఆరు వారాల తర్వాత, శనివారం నాడు ఇస్లామాబాద్ యుద్ధ నివారణకు అమెరికా, ఇరాన్ ఉన్నతాధికారుల చర్చలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సమావేశం ఏర్పాట్లగురించి పాక్ అధికారులు పెదవి విప్పడం లేదు. శాంతి చర్చలు సాఫీగా, స్నేహ పూర్వక వాతావరణం లో జరగాలన్నదే ముఖ్యం అని పాక్ అధికారులు చెబుతున్నారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు వారాల కాల్పుల విరమణకు వాషింగ్టన్, టెహ్రాన్‌లు అంగీకరించడంతో ఈ సమావేశం సుగమం అయింది. మరొక వైపు పోరాట విరామ నిబంధనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేయడంతో అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్నది. ఈ తరుణంలో ఈ సమావేశం జరుగుతున్నది.
మార్గల్లా కొండల (Margalla Hills) దిగువ ప్రాంతంలోని, ఆహ్లాదకరమయిన పచ్చని రాజధాని ఇస్లామాబాద్ ఇరుదేశాలకు నాయకులకు స్వాగతం పలుకుతున్నది.
యుద్ధానికి పూర్తి పరిష్కారం దిశగా చర్చలు జరపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇరుపక్షాలను లాంఛనంగా ఆహ్వానించారు. దీని వెనక చైనా, రష్యాల పాత్ర కూడా ఉందనిచెబుతారు. శనివారం ఉదయం అధికారిక చర్చలు ప్రారంభమవుతాయని వైట్ హౌస్ ధృవీకరించింది. చర్చలు 15 రోజుల వరకు కొనసాగవచ్చని ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి ఏప్రిల్ 8న తెలిపింది. దీనిని బట్టి, ప్రతినిధి బృందాలలోని కనీసం కొంతమంది సభ్యులు15 రోజులు అక్కడే ఉండాలి.లేదా తమ దేశాలకు వెళ్లిపోయి మళ్లీ రావాలి.
ఇస్లామాబాద్‌లోని సెరీనా ఫైవ్ స్టార్ హోటల్ ప్రతినిధి బృందాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ హోటెల్ నుంచి అతిధులను ఖాళీ చేయించారు. హోటల్ కు మూడు కి.మీ పరిధిలో సెక్యూరిటీ ఆంక్షలు విధించారు. రాజధానిలోని రెడ్ జోన్‌లో, కీలకమైన ప్రభుత్వ భవనాలు, రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ పక్కన ఉన్న ఈ హోటల్‌ను బుధవారం సాయంత్రం నుండి ఆదివారం వరకు స్వాధీనం చేసుకున్నారు. అతిథులను ఖాళీ చేయమని కోరారు. చర్చలకు అనువైన వాతావరణం కల్పిస్తూ ఏప్రిల్ 9,10 తేదీలను ఇస్లామాబాద్ లో శెలవు ప్రకటించారు.
నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రెడ్ జోన్‌ను మూసివేయడంతో పాటు, ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించే కీలక మార్గాలను కూడా మూసివేశారు. ఇప్పటికీ సెరీనా హోటల్ లోనే చర్చలు జరుగుతాయని భావిస్తున్నా స్థలం మారే అవకాశం కూడా ఉంది. ప్రధాని కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు.
చర్చలకు ఎవరు హాజరవుతారు?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య దూత హాజరవుతున్నారు. ఆయనతో పాటు స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జారెడ్ కుష్నర్‌లు అమెరికన్ ప్రతినిధి బృందంలో ఉంటారు.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు.
యుద్ధంలో టెహ్రాన్ సైనిక ప్రతిస్పందనకు నాయకత్వం వహిస్తున్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుండి ఎవరైనా చర్చలకు హాజరవుతారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయితే, ప్రతినిధి బృందాలు వచ్చేవరకు ఏదీ ఖచ్చితం కాదని పాకిస్తానీ అధికారులు హెచ్చరించారు.
పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమీరి మొఘాదం, ఇరాన్ ప్రతినిధి బృందం ఏప్రిల్ 9న వస్తుందని X ఛానెల్‌లో క్లుప్తంగా ప్రకటించారు. "దౌత్యపరమైన చొరవను దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటం వల్ల ఇరాన్ ప్రజల అభిప్రాయంలో సందేహాలు ఉన్నప్పటికీ," ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ఆధారంగా "తీవ్రమైన చర్చల" కోసం ఈ ప్రతినిధి బృందం వచ్చిందని ఆయన రాశారు.
యుద్ధంలో బాగా నష్టపోయిన సౌదీ అరేబియా,ఖతర్ వంటి దేశాల ప్రతినిధులు కూడా ఇస్లామా బాద్ వస్తున్నట్లు తెలిసింది. వాళ్లు సమావేశం బయట ఇతర అధికారులతో చర్చలు జరపవచ్చని తెలిసింది.

