అరుణ్ గోయల్ ఎవరూ? ఎన్నికల ముందే ఎందుకు తప్పుకున్నారు?
x

అరుణ్ గోయల్ ఎవరూ? ఎన్నికల ముందే ఎందుకు తప్పుకున్నారు?

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ ఎందుకు తప్పుకున్నారు? అసలు ఆయన నేపథ్యం ఏంటీ? తరువాత ఏం జరగనుంది..


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేశాడు. ఆ వెంటనే రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు. ఈ విషయాన్ని న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఎందుకు రాజీనామా చేశారో కారణం తెలియదు. కానీ రాజీనామాకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

గోయెల్ పదవీకాలం 2027 వరకు ఉంది, ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నాడు. తరువాత అరుణ్ గోయెల్ మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉంటారు. అయినప్పటికీ ఆయన రాజీనామా చేశారు. ఇంతకుముందే ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. వీరిద్దరి రాజీనామాతో ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏకసభ్య కమిషన్ గా మారింది.
బ్యూరోక్రాట్‌గా కెరీర్ ఎలా సాగిందంటే..
గోయెల్, రిటైర్డ్ బ్యూరోక్రాట్, పంజాబ్ కేడర్‌కు చెందిన 1985-బ్యాచ్ IAS అధికారి. పంజాబ్‌లోని పాటియాలాలో డిసెంబర్ 7, 1962న జన్మించిన గోయెల్, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేశారు. 'ఛాన్సలర్స్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్' ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అనే అవార్డు అందుకున్నారు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని చర్చిల్ కాలేజీ నుంచి డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత USAలోని హార్వర్డ్ యూనివర్సిటీలోని జాన్ ఎఫ్ కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో కూడా శిక్షణ పొందాడు.
37 సంవత్సరాలకు పైగా సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన గోయెల్ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గోయెల్ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఈ-వాహన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారు. దీని వల్ల లక్ష్యాన్ని మించి రూ. 67,609 కోట్ల పెట్టుబడిని సాధించింది. ఇందులో ప్రభుత్వ టార్గెట్ కేవలం రూ. 42 వేల కోట్ల మాత్రమే. అయితే ఆయన అంచనాలు మించి పని చేశారని ప్రశంసలు అందుకున్నారు.
పంజాబ్‌లోని లూథియానా (1995-2000) భటిండా (1993-94) జిల్లాల జిల్లా ఎన్నికల అధికారిగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. తరువాత ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి , ఆర్థిక సలహాదారు, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు.
ఎన్నికల కమిషనర్‌గా.
నవంబర్ 2022లో గోయెల్ ECలో చేరారు. ఎన్నికల కమిషనర్‌గా నియామకం కావడానికి కేవలం ఒక రోజు ముందు, నవంబర్ 18న కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా తన సర్వీస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇది తరువాత వివాదంలో చిక్కుకుంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ ఉన్నత న్యాయస్థానం ఆగష్టు 3, 2023న క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తాజాగా ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయకుండా ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు ప్రయత్నించినట్లు సమాచారం. కానీ ఆయన వ్యక్తిగత సమస్యలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది.
తర్వాత ఏంటి?
గోయల్ నిష్క్రమణతో రెండు ఎన్నికల కమిషన్‌ పదవులు ఖాళీ అయ్యాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నియంత్రించే కొత్త చట్టం ప్రకారం, న్యాయమంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానల్ ను సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తరువాత ప్రధాన మంత్రి, కేంద్రమంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా కొత్త గా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించాల్సి ఉంటుంది. తరువాత దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు.
Read More
Next Story