
కవిత కొత్తపార్టీ టార్గెట్ ఎవరు ?
పార్టీ నిలదొక్కుకోవటానికి, ప్రజల మన్ననలు అందుకోవటానికి పడాల్సిన కష్టం అంతా ఇంతాకాదు
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతానని ప్రకటించగానే అనుమానాలు, అంచనాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకు ? అంచనాలు ఏమిటి ? అనే విషయాలను డీటైల్డ్ గా మాట్లాడుకుందాము. 2028 ఎన్నికలనాటికి తాను కొత్తపార్టీ పెడతానని స్వయంగా శాసనమండలి సాక్షిగా (Kavitha)కవితే ప్రకటించారు. (Telangana Jagruthi)జాగృతినే పూర్తిస్ధాయి రాజకీయపార్టీగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగానే తెలంగాణలో జనంబాట పేరుతో వివిధ జిల్లాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. కవిత ఆలోచనల ప్రకారం మహిళలు, యువతకు తన పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు అర్ధమవుతోంది.
బీఆర్ఎస్ లో తనది ఆస్తుల తగాదా కాదు ఆత్మగౌరవ తగాదా అని కవిత చేసిన ప్రకటన చాలామందిని ఆకట్టుకున్నది. అయితే మాటలతో ఆకట్టుకోవటం వేరు రంగంలోకి దిగి కార్యచరణను ప్రకటించటం వేరు. కొత్తపార్టీ పెడతానని ప్రకటించటం చాలా సులభం. అయితే పార్టీ నిలదొక్కుకోవటానికి, ప్రజల మన్ననలు అందుకోవటానికి పడాల్సిన కష్టం అంతా ఇంతాకాదు. గతంలో పార్టీ పెట్టిన కొందరు కొంతకాలం తర్వాత వివిధ కారణాలతో తమ పార్టీలను రద్దుచేసుకున్నారు లేదా ఇతర పార్టీల్లో కలిపేశారు. నారా చంద్రబాబునాయుడుతో పడక నందమూరి తారకరామారావు కొడుకు నందమూరి హరికృష్ణ అన్న టీడీపీ అని పెట్టారు. ఎన్టీఆర్ వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ టీడీపీ అని పెట్టారు. ఈ రెండుపార్టీలు తర్వాత ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలీదు.
కాంగ్రెస్ లో విలీనమైన పీఆర్పీ, షర్మిల పార్టీలు
అలాగే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సాఆర్ టీపీ అని పెట్టి కొంతకాలం తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అంతకన్నా ముందే లోక్ సత్తా, పీఆర్పీ, తెలంగాణ ప్రజాఫ్రంట్(గద్దర్) మందకృష్ణ నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ, ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో టీజేఎస్ ఏర్పాటైనా మనుగడ సాధించలేక చతికిలపడ్డాయి. ముందే చెప్పుకున్నట్లు పార్టీలు పెట్టడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు కాని వాటిని నడపాలంటేనే చాలా కష్టం. ముందు పార్టీలు పెట్టేవారికి జనాల మద్దతు ఉండాలి. పార్టీ నిర్వహణకు అపారమైన ఆర్ధికవనరులు ఉండాలి. ఈ రెండు ఉండి కూడా ఫెయిలైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక మరో కోణం చూస్తే కవిత కొత్తపార్టీ టార్గెట్ ఎవరు ? అన్నది కీలకంగా మారింది. కవిత పెట్టబోయే కొత్తపార్టీకి ఓటుబ్యాంకు ఎక్కడినుండి వస్తుంది ? మామూలుగా ప్రతిపార్టీకి ఒక ఓటుబ్యాంకు అన్నది ఏర్పాటై ఉంటుంది. ఓటు బ్యాంకు అంటే కాంగ్రెస్ కు దళితులు, ముస్లింలు, గిరిజనులు, రెడ్డి సామాజికవర్గం, బీసీలు, కాపులు తదితర సామాజికవర్గాల వారుండేవారు. అయితే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో బీసీలు, కాపులు, కమ్మలు, దళితులు, రెడ్డి, ముస్లింల్లో చీలికవర్గాలు ఓటుబ్యాంకుగా మారిపోయాయి. టీడీపీకి ఏర్పడిన ఓటుబ్యాంకులో అత్యధికం కాంగ్రెస్ నుండే వచ్చింది. అలాగే చిరంజీవి పార్టీ పెట్టినపుడు మిగిలిన సామాజికవర్గాల సంగతిని వదిలేసినా చివరకు కాపులు కూడా ఓటుబ్యాంకుగా మారలేదు. కేసీఆర్ పార్టీ పెట్టినపుడు కాంగ్రెస్, టీడీపీలను వ్యతిరేకించేవారంతా మద్దతుగా నిలబడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉన్నవారంతా కేసీఆర్ కు మద్దతుగా నిలబడ్డారు. ఇక్కడ సామాజికవర్గాలు అంటే ఓటు బ్యాంకు కన్నా సెంటిమెంటే ఎక్కువగా పనిచేసింది కాబట్టే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.
బీఆర్ఎస్ నుండి చీలిన ఓటుబ్యాంకు
రెండోసారి ఎన్నికలు వచ్చేనాటికి దళితులు, గిరిజనులు, రెడ్డి, వెలమ, బీసీల్లోని మెజారిటి సెక్షన్లు బీఆర్ఎస్ ఓటుబ్యాంకుగా రూపాంతరం చెందాయి. పై సామాజికవర్గాల మద్దతు కారణంగానే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. అయితే 2023 ఎన్నికల నాటికి పై సామాజికవర్గాల్లో చీలికవచ్చి మెజారిటి కాంగ్రెస్ వైపు మళ్ళిన కారణంగానే హస్తంపార్టీ అధికారంలోకి రాగలిగింది. అలాగే బీజేపీకంటు ఒకపుడు పెద్దగా ఓటుబ్యాంకు ఉండేదికాదు. అయితే మారిన పరిస్దితుల్లో నగరాలు, పట్టణాల్లో స్ధిరమైన ఓటుబ్యాంకు ఏర్పడుతోంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో కూడా బీజేపీ మద్దతుదారులు గెలిచారు. దీంతో గ్రామీణ ప్రజల్లో కూడా బీజేపీకి ఓటుబ్యాంకు తయారవుతోంది అనే సంకేతాలు కనబడుతున్నాయి.
ఇప్పుడు పాయింట్ ఏమిటంటే కొత్తపార్టీ పెట్టబోతున్న కవితకు ఓటుబ్యాంకుగా ఏ సామాజికవర్గాలు ఉంటాయి ? ఇప్పటికే వివిధ పార్టీలకు ఓటుబ్యాంకుగా మారిన సామాజికవర్గాలే కవిత పెట్టబోయే పార్టీకి ఓటుబ్యాంకుగా మారాలి. అలాంటి సామాజికవర్గాలు ఏమున్నాయి ? ఏ పార్టీనుండి వస్తాయి ? ఒక అంచనా ప్రకారం కవిత పెట్టబోయే పార్టీకి ఓటుబ్యాంకుగా బీఆర్ఎస్ నుండే చీలిక రావాలి. ఎందుకంటే కవిత రాజకీయ ప్రస్ధానం బీఆర్ఎస్ నుండే మొదలైంది. పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో అపరిమితమైన అధికారాలను అనుభవించారు. చివరకు ఏవో గట్టు తగాదాలతో పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. ఇపుడు జాగృతిలో పనిచేస్తున్న వారంతా ఒకపుడు బీఆర్ఎస్ శ్రేణులే. కాబట్టి కొత్తపార్టీ పెట్టినా బీఆర్ఎస్ నుండే నేతలు రావాలి తప్ప ఇతర పార్టీల నుండి కవితతో చేతులు కలిపేవారు చాలా తక్కువమంది ఉంటారు.
అంటే, కవిత కొత్తపార్టీకి పడే ఓట్లలో ఎక్కువగా బీఆర్ఎస్ నుండే చీలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏపార్టీతో సంబంధంలేకుండా తటస్తంగా ఉండే ఓటర్లలో కొందరు కవిత పార్టీకి ఓట్లేసే అవకాశాలున్నాయి. ఏ కోణంలో చూసినా కవిత కొత్తపార్టీ వల్ల బీఆర్ఎస్ కే నష్టం ఎక్కువగా జరుగుతుందని అనిపిస్తోంది. 2028 ఎన్నికలే కవిత రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయనటంలో సందేహంలేదు. రాబోయే ఎన్నికల్లో కవిత పార్టీ ప్రభావం చూపితే రాజకీయంగా మనుగడ ఉంటుంది లేకపోతే పైన చెప్పుకున్న పార్టీల్లాగే కవిత కొత్తపార్టీ కూడా కాలంలో కలిసిపోతుంది.
కాంగ్రెస్ తో పొత్తు తప్పదు : కూరపాటి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కవిత కొత్తపార్టీ పొత్తు పెట్టుకుంటుందని కూరపాటి జోస్యం చెప్పారు. కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఐదుసీట్లలో కవిత పోటీచేస్తుంది’’ అని చెప్పారు. కల్వకుంట్ల ఫ్యామిలీని జనాలు నమ్మటంలేదు అని కూడా అన్నారు. ‘‘ఆస్తుల తగాదా కాదు ఆత్మగౌరవ తగాదా వల్లే బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చానని ఎన్నిమాటలు చెప్పినా జనాలు ఎవరూ కవితను నమ్మేస్ధితిలో లేరు’’ అని కూరపాటి అన్నారు. ‘‘అబద్ధాలు చెప్పటంలో కేసీఆర్ కు కవిత ఏమీ తీసిపోదు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం ఒకటే కవిత ముందున్న మార్గం’’ అని ప్రొఫెసర్ కూరపాటి విశ్లేషించారు.

