‘‘బ్లాక్ డీడ్స్’’ పుస్తకంలో ఎవరి గురించి రాశారు? ఆవిష్కరించిందెవరు?
x
NCP (SP) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్

‘‘బ్లాక్ డీడ్స్’’ పుస్తకంలో ఎవరి గురించి రాశారు? ఆవిష్కరించిందెవరు?

‘‘లడ్కీ బహిన్ యోజన’’ పథకానికి బదులుగా.. 'లడ్కీ కుర్చీ యోజన' ప్రారంభించాలన్నారు NCP (SP) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్.


శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ నేతలు శుక్రవారం ‘‘బ్లాక్ డీడ్స్’’ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించి శాసన సభా ఎన్నికలకు నగారా మోగించారు. దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని పార్టీ కార్యాలయంలో షిరూర్ ఎంపీ అమోల్ కోల్హే, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్‌పర్సన్‌, మాజీ రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సునీల్ గవానేతో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపిస్తూ.. 10 ప్రభుత్వ వైఫల్యాల గురించి పుస్తకంలో రాసుకొచ్చారు. పుస్తకావిష్కరణ సందర్భంగా జయంత్ అధికార కూటమి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు.

నిరుపేద మహిళలకు ప్రతినెలా రూ. 1500 చెల్లిస్తామన్న ‘‘లడ్కీ బహిన్ యోజన’’ పథకానికి బదులుగా.. సీఎం కావాలనుకునే వారందరి డిమాండ్లను తీర్చడానికి 'లడ్కీ కుర్చీ యోజన' ప్రారంభించాలన్నారు.

శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సిపి గత ఏడాది రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తనకు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంలో చేరిపోయారు. తర్వాత ఆయన పార్టీ పేరు, దానికి గడియారం గుర్తును పొందిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని అధికార కూటమి (మహాయుతి)లో బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఉండగా.. ప్రతిపక్షా మహా వికాస్ అఘాడి కూటమిలో NCP (SP), కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సేన (UBT) భాగస్వాములుగా ఉన్నాయి.

ముఖ్యమంత్రి షిండేనుద్దేశించి పాటిల్.. “ముఖ్యమంత్రి దావోస్‌కు వెళ్లి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడతారు. అవన్నీ కల్పితాలే..ఆ పెట్టుబడిలో మహారాష్ట్రకు ఎంత వచ్చింది? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

పుస్తకావిష్కరణతో పాటు తమ పార్టీ మేనిఫెస్టో కోసం ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకులు "క్రౌడ్‌సోర్స్" ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. 'మై డ్రీమ్ మహారాష్ట్ర' పేరున జూలై 19 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే ప్రచార కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పౌరుల నుంచి సలహాలను సేకరిస్తారు.

రాష్ట్రంలో తన మేనిఫెస్టో ప్రచారాన్ని ప్రారంభించిన మొదటి పార్టీ ఎన్‌సిపి (ఎస్‌పి) అని ఓటర్లను, ముఖ్యంగా యువతను తమవైపు ఆకర్షించడానికి వినూత్న క్రౌడ్‌సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చామని పాటిల్ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 10 సీట్లలో 8 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో ఎన్‌సీపీ (ఎస్పీ) ఆవిర్భవించిందని, ఈ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించిందని ఆయన చెప్పారు.

పార్టీ ఇప్పటికే 'నిష్టవన్ సంవద్ దౌరా' (లాయల్ ఔట్‌రీచ్ టూర్) పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించిందని, రానున్న రోజుల్లో శరద్ పవార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలేతో సహా ఇతర సీనియర్ నాయకులు కూడా ఇలాంటి పర్యటనలను చేపడతారని ఎంపీ అమోల్ కోల్హే చెప్పారు.

'మహారాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం కలవారు. వారు ఎప్పుడూ అణచివేతకు వ్యతిరేకంగా నిలుస్తారు. గత రెండేళ్లుగా మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన చీకటి మరకను మేము తొలగిస్తాం.” అని పేర్కొన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా .. 2019 రాష్ట్ర ఎన్నికలలో అవిభక్త NCP 54 స్థానాలను గెలుచుకుంది.

Read More
Next Story