ముంబాయి ఎన్‌కౌంటర్: పంజాబ్ మాజీ మోడల్ హంతకుడెవరు?
ముంబాయిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పంజాజ్‌కు చెందిన మాజీ మోడల్ ప్రధాన సాక్షి. ఇటీవల హత్యకు గురైంది. ఆమెను హతమార్చింది ఎవరు? పోలీసులు, కుటుంబసభ్యులు ఏమంటున్నారు.
దివ్య పహుజా. వయసు 27. పంజాబ్‌లోని గురుగ్రామ్‌కు చెందిన మాజీ మోడల్. ముంబాయిలో జరిగిన గురుగ్రామ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గొడాలి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన సాక్షి. ఇటీవల హత్యకు గురైంది. దివ్య మర్డర్ కేసుకు సంబంధించి మంగళవారం (జనవరి 2) రాత్రి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిని హిసార్‌లోని మోడల్ టౌన్‌కు చెందిన అభిజీత్ సింగ్(56), అతని వద్ద పనిచేసే ఉద్యోగులు నేపాల్‌కు చెందిన హేమ్‌రాజ్(28), పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓంప్రకాష్(23)గా గుర్తించారు. దివ్య మృతదేహాన్ని పడేయడానికి తీసుకెళ్తుండగా వీరిని అరెస్టు చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
దివ్యను ఎందుకు చంపారు..
‘‘దివ్య తన వద్ద ఉన్న సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజీత్ సింగ్‌కు సంబంధించిన అసభ్యకర చిత్రాలతో ఆయనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేసేది. దాంతో అభిజీత్ సింగ్ దివ్యను హత్య చేశాడు. మంగళవారం రాత్రి దివ్యను ఐదుగురు వ్యక్తులు హోటల్ గదికి తీసుకెళ్లి ఆమె తలపై కాల్చి చంపారు.’’ అని పోలీసులు చెప్పారు. అయితే వారి వాదనను దివ్య కుటుంబ సభ్యులు ఖండిరచారు.
దివ్య హత్యకు డబ్బులిచ్చారు..
హత్యకు గురైన గడోలీ సోదరి సుదేష్ కటారియా, సోదరుగు బ్రహ్మ ప్రకాష్ కటారియా దివ్యను హత్య చేసేందుకు అభిజిత్ సింగ్‌కు డబ్బులిచ్చారని దివ్య సోదరి నైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్టార్ 14 పోలీస్ స్టేషన్‌లో భారత శిక్షాస్మృతిలోని 302, 201, 120బి, 34 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఎవరీ గడోలి..
గురుగ్రామ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలి. ఇతను ఫిబ్రవరి 6, 2016న ముంబైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. గడోలీని అతని ప్రియురాలు దివ్య సహాయంతో ఉచ్చులో పడేసి బూటకపు ఎన్‌కౌంటర్ చేసినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు.
దివ్య నన్ను బ్లాక్‌మెయిల్ చేసేది..
‘‘హోటల్ సిటీ పాయింట్ నాదే. దాన్ని లీజుకు ఇచ్చా. నా అశ్లీల చిత్రాలతో నన్ను బ్లాక్ మెయిల్ చేసి దివ్య డబ్బు వసూలు చేసేది. ఈసారి భారీగా డబ్బు డిమాండ్ చేసింది’’ అని ప్రాథమిక విచారణలో అభిజీత్ సింగ్ పోలీసులకు చెప్పాడు.
‘‘జనవరి 2న నేను దివ్యతో కలిసి హోటల్ సిటీ పాయింట్‌కి వచ్చా. ఆమె ఫోన్‌లోని నా అశ్లీల ఫోటోలను తొలగించాలని చెప్పా. ఫోన్ లాకై ఉండడంతో పాస్‌వర్డ్ చెప్పమని కోరా. కాని దివ్య చెప్పలేదు.’’ అని అభిజీత్ తమతో చెప్పాడని పోలీస్ ప్రతినిధి సుభాష్ బోకెన్ పేర్కొన్నారు.
‘‘అభిజీత్ సింగ్ తన హోటల్‌లో క్లీనింగ్ విభాగం, రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న హేమ్‌రాజ్, ఓం ప్రకాష్‌లతో కలిసి దివ్యను కాల్చి చంపాడు. ‘తెల్లటి బట్టతో ఆమె శవాన్ని చుట్టేసి, హోటల్ లాబీలోంచి లాకెళ్లారు. మృతదేహాన్ని హోటల్‌లాబీ లోంచి ఈడ్చుకెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. తర్వాత మృతదేహాన్ని అభిజీత్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారులోకి ఎక్కించారు. అనంతరం డెడ్‌బాడీని పడేయడానికి హేమ్‌రాజ్, ఓం ప్రకాష్ తీసుకెళ్లారు. దివ్య మృతదేహాన్ని వెలికితీసేందుకు మా బృందాలు గాలిస్తున్నాయి.’’ అని పోలీసు అధికారి చెప్పారు.
దివ్య నుంచి రెస్పాన్స్ లేదు..
‘‘దివ్య చివరిసారిగా జనవరి 1న అభిజిత్ సింగ్‌ను కలవడానికి వెళ్లింది. మర్నాడు ఉదయం 11:50 గంటలకు ఆమెతో మాట్లాడాం. ఆ తర్వాత మా కుటుంబసభ్యులు ఫోన్ చేసినా దివ్య నుంచి రెస్పాన్స్ లేదు. దీంతో ఆందోళనకు గురై న్యూ ఢల్లీిలోని సౌత్ ఎక్స్‌ట్‌లోని అభిజిత్ సింగ్ ఇంటికి వెళ్లాం. అక్కడ దివ్య ఫోన్ అభిజిత్ సింగ్ స్నేహితుడైన బాలరాజ్ దగ్గర ఉండడాన్ని గుర్తించాం’’ అని దివ్య సోదరి నైనా పోలీసులకు వివరించింది.
‘‘నేను బాల్‌రాజ్ దగ్గరి నుంచి దివ్య ఫోన్ తీసుకుని, నేరుగా అభిజీత్ హోటల్‌కు వెళ్లా. సీసీ ఫుటేజీని చూడాలని కోరాను. అందుకు అభిజీత్ నిరాకరించి, నాతో వాగ్వాదానికి దిగాడు. అభిజీత్ హోటల్‌లోనే నా సోదరి వేసుకునే బ్లేజర్‌ను గుర్తించాను. హోటల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు.. దివ్య డెబిట్ కార్డ్, పాన్‌కార్డ్‌ని తన వద్ద వదిలివేసిందని చెప్పి అభిజీత్ నాకు ఇచ్చాడు’’ అని పోలీసులకు చెప్పింది నైనా.
బలపడిన అనుమానం..
హోటల్ గదిలో నేలపై రక్తపు మరకలు కనిపించడంతో పాటు హోటల్ స్టోర్ రూమ్‌లో తన సోదరి ఉంగరం, బూట్లు, ఇతర వస్తువులు కనిపించడంతో నైనా అనుమానం బలపడిరది.
‘‘దివ్య మృతదేహాన్ని పారవేయడంలో అభిజిత్ సింగ్ తన హోటల్ సిబ్బంది హేమ్‌రాజ్, ప్రకాష్ సాయం కోరాడు. వారు ఆయనకు సహకరించారు. అనూప్, అతని స్నేహితుడు కూడా మృతదేహాన్ని డంప్ చేయడంలో సాయపడ్డారు’’ అని దివ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సందీప్ గడోలీ హత్యకు కుట్ర..
వీరేంద్ర కుమార్ అలియాస్ బైందర్ గుజ్జర్ మరో ముఠా నడుపుతున్నాడు. సందీప్ గడోలీ హత్యకు హర్యానా పోలీసు అధికారులతో కలిసి కుట్ర పన్నాడన్న విమర్శలున్నాయి. ఎన్‌కౌంటర్ సమయంలో గుజ్జర్ జైలులో ఉన్నాడు. కానీ వీరేంద్ర సోదరుడు మనోజ్ సహాయంతో దివ్యను హనీట్రాప్‌గా వాడేందుకు కుట్ర పన్నాడు. సందీప్ గోడాలి ఎన్‌కౌంటర్ కేసులో అప్పట్లో ఐదుగురు పోలీసులు, దివ్య, ఆమె తల్లి ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసు విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు దివ్యకు ఏడేళ్ల తర్వాత గతేడాది జూన్‌లో బెయిల్ మంజూరు చేసింది.