ఆ ఐదుగురి మరణాలకు బాధ్యులెవరో చెప్పాలి: అస్సాం సీఎం
x

ఆ ఐదుగురి మరణాలకు బాధ్యులెవరో చెప్పాలి: అస్సాం సీఎం

అస్సాంలోని 14 లోక్‌సభ స్థానాలకు 13 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు.


అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) ముఖ్యమైన అంశం కాదన్నారు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. పౌరసత్వం కోసం తమ రాష్ట్రం నుంచే దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తక్కువేనని చెప్పారు.

దేశ పౌరసత్వం కావాలనుకునేవారి కోసం హోం మంత్రిత్వ శాఖ మంగళవారం పోర్టల్‌ను ప్రారంభించింది. పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించడమే దీని లక్ష్యం. ఈ చట్టం ప్రకారం డిసెంబర్ 31, 2014లోపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులు మాత్రమే పౌరసత్వం పొందేందుకు అర్హులు.

‘‘పౌరసత్వం పొందేందుకు NRCని ఉపయోగించి అస్సాంకు 2014 కంటే ముందు వచ్చారని నిరూపించుకోవాలి. ఎన్‌ఆర్‌సికి దరఖాస్తు చేసుకోకపోతే, కటాఫ్ తేదీకి ముందు వారు రాష్ట్రంలో లేరని, పౌరసత్వం పొందలేరని స్పష్టమవుతుంది, ”అని హిమంత బిస్వా శర్మ అన్నారు.

మంగళవారం పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తు లేమీలేవని చెప్పారు. పౌరసత్వం కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుందని, అది రాష్ట్రానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు.

''డిసెంబర్ 2019లో CAAకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఐదుగురు చనిపోయారు. వారి మృతికి చాలా మంది సమాధానం చెప్పవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత మరణాలకు బాధ్యులెవరో సమాధానం కోరుతూ హైకోర్టులో కేసు వేస్తాను' అని శర్మ చెప్పారు.

‘‘ప్రజలు ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి అస్సాం ఒక మార్గంగా పనిచేస్తుంది. అస్సాంకు చెందిన యువకులు గుజరాత్, కర్ణాటకలో పని చేయడానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ వేతనాలు బాగా ఇస్తారు. అందుకే బంగ్లాదేశీయులు అస్సాంలో ఉండే అవకాశం లేదు.

మతమార్పిడి కారణంగా బంగ్లాదేశ్‌లో 1.3 కోట్ల మంది హిందూ జనాభా కోల్పోగా, ముస్లిం జనాభా 3 కోట్లకు పెరిగింది’’ శర్మ పేర్కొన్నారు.

అస్సాంలోని 14 లోక్‌సభ స్థానాలకు 13 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని శర్మ చెప్పారు.

''వారణాసిలో ప్రధానిపై బాలీవుడ్ టాప్ స్టార్ పోటీ చేసినా మోదీజీ గెలుస్తారు.‘‘ అని అన్నారు. బీజేపీ 11 సీట్లు గెలుచుకోవడం ఖాయమని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. నాగావ్, కరీంగంజ్‌లలో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పొరపాట్లు చేసిందని, ఆ తప్పిదాల వల్ల బీజేపీ కనీసం మరో రెండు సీట్లు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి విశ్వసించారు.

కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ పోటీ చేస్తున్న దిబ్రూగఢ్‌ నియోజకవర్గం నుంచి మూడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో తాను సులభంగా విజయం సాధిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read More
Next Story