గుల్బర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
ఖర్గే సొంతగడ్డ గుల్బర్గా నుంచి లోక్ సభకు ఈ సారి ఎవరిని బరిలో దింపుతారన్న దానిపై కర్ణాటకలో ఉత్కంఠ నెలకొంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమాని. ఈయన విద్యాసంస్థల అధినేత. వ్యాపారవేత్త కూడా. లోక్‌సభ ఎన్నికల్లో ఖర్గే ప్రాతినిథ్యం వహిస్తున్న గుల్బర్గా (కలబురగి) నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని చూస్తున్నారు. 81 ఏళ్ల ఖర్గే గుల్బర్గా (కలబురగి) ఇక్కడి నుంచి రెండుసార్లు పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.
గుల్బర్గాలోని చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలోని సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అయితే ఈయన లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ నేపథ్యంలో దొడ్డమణిని పోటీ చేయిస్తే బాగుంటుందని కొందరు పార్టీ నాయకులు ఖర్గేకు సూచించారు. అయితే ఆయనను పోటీ చేయించే అంశం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సంప్రదించిన తర్వాత తెలుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
తొలుత విముఖత చూపిన దొడ్డమణిని రంగంలోకి దింపేందుకు సిద్ధం చేశారు. కలబురగిలో జన్మించిన దొడ్డమణి ఖర్గే ఎన్నికల ప్రచార సమయంలో తెరవెనుక చురుకుగా పనిచేశారు. 1972 నుంచి 2004 వరకు ఖర్గే ప్రాతినిధ్యం వహించిన గుర్మిత్‌కల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల ప్రజాదరణను కూడగట్టుకున్నారు దొడ్డమణి. ఇటీవల కలబురగిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పోల్ మేనేజర్లు దొడ్డమణి అభ్యర్థిత్వంపై చర్చించి ఆయన గెలుపు కోసం వ్యూహరచన కూడా చేశారు.
గుల్బర్గా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2019కి ముందు, 1996, 1998లో లోక్‌సభ ఎన్నికలలో జనతాదళ్, BJP గెలిచినప్పుడు మాత్రమే నియోజకవర్గంపై నియంత్రణ కోల్పోయింది. గుల్బర్గా పార్లమెంటు నియోజకవర్గంలో 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరు చొప్పున బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఉన్నారు.