ఉత్తర కర్ణాటకలో ఈ సారి గెలుపెవరిది?
x

ఉత్తర కర్ణాటకలో ఈ సారి గెలుపెవరిది?

ఉత్తర కర్ణాటకలో వొక్కలిగ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న పాత మైసూరు, కోస్టల్ కర్ణాటక నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.


ఉత్తర కర్ణాటకలో వొక్కలిగ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న పాత మైసూరు, కోస్టల్ కర్ణాటక నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు.

ప్రస్తుతం ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని 14 స్థానాలకు మే 7న ఎన్నికలు జరగునున్నాయి. గత ఫలితాలను పరిశీలిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలోని మొత్తం 14 స్థానాలను కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కూడా తన సొంతగడ్డ గుల్బర్గా లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు.

అయితే ప్రస్తుతం పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు మారాయంటున్నకాంగ్రెస్ నేతలు..ఈ సారి అధిక స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖర్గే ఆ దిశగా తీవ్రంగా శ్రమిస్తున్నారు కూడా.

హిందుత్వ వర్సెస్ కాంగ్రెస్ హామీలు..

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఐదు హామీలే తమ వారికి గెలిపిస్తాయంటున్నారు. “బీజేపీకి వ్యతిరేకంగా గాలి వీస్తోంది. కాంగ్రెస్ 'ఐదు హామీలు' బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తాయి’’ అని పేర్కొన్నారు. అయితే ఉత్తర కర్ణాటకలో కులాలు, పార్టీలతో అనుబంధాలు ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

బీజేపీ కంచుకోట..

ఉత్తర కర్నాటకలో లింగాయత్ కమ్యూనిటీ ఎక్కువ. ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమిని చవిచూసింది. దీంతో ఈ ప్రాంతంలో తిరిగి పట్టు సాధించేందుకు రాష్ట్ర నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కర్నాటక జనాభాలో లింగాయత్‌లు దాదాపు 17 శాతం ఉండగా, వొక్కలిగాలు దాదాపు 15 శాతం ఉన్నారు. దాదాపు 35 శాతం OBCలు, 18 శాతం SC/ST, 13 శాతం ముస్లింలు ఉండగా 3 శాతం బ్రాహ్మణులున్నారు.

2023 ఫలితాల్లో..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లింగాయత్ కంచుకోటలో కాంగ్రెస్ పాగా వేసింది. కిత్తూరు కర్నాటక, సెంట్రల్ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ 44.9 శాతం ఓట్లతో 62 స్థానాలకు గాను 44 స్థానాలను గెలుచుకుంది. లింగాయత్‌లను గెలిపించడంలో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపే ఈ గణాంకాలు బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట..

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. చారిత్రకంగా లింగాయత్‌లు బీజేపీ మద్దతుదారులు కాదు. గతంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. 1990లో దివంగత కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ వీరేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారు. దాంతో లింగాయత్ లు కాంగ్రెస్ కు దూరమయ్యారు.

లింగాయత్‌లను ఆకర్షించే పనిలో సిద్ధరామయ్య..

వీరశైవ-లింగాయత్ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు సిద్ధరామయ్య అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 160 మందికి పైగా లింగాయత్ మఠాధిపతులు ఇటీవల సిద్ధరామయ్యను సత్కరించారు. బసవన్నను సాంస్కృతిక అంబాసిడర్‌గా ప్రకటించారు కూడా. అలాగే వచ్చే ఏడాది వచన యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది.

సంపద 'పునర్విభజన'..

కాంగ్రెస్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు బీజేపీ తన ప్రచారంలో 'ముస్లిం' అంశాన్ని తెరమీదకు తెచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచుతారంటూ బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రసంగాల్లో గట్టిగా చెబుతున్నారు. అయినా కూడా కర్ణాటక బీజేపీ నేతల్లో గెలుపుపై ఆందోళన నెలకొంది. యడ్యూరప్ప సొంతగడ్డ అయిన శివమొగ్గలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప యడియూరప్పకు, ఆయన కుమారులకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

Read More
Next Story