గుజరాత్‌లో హస్తంపార్టీ వాళ్లు బీజేపీపై ఎందుకు ఫిర్యాదు చేశారు?
x

గుజరాత్‌లో హస్తంపార్టీ వాళ్లు బీజేపీపై ఎందుకు ఫిర్యాదు చేశారు?

గాంధీనగర్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో ఏజంట్లు బీజేపీ పార్టీ గుర్తు (కమలం) ఉన్న పెన్నులు, నోట్‌బుక్‌లు ఉపయోగించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.


గుజరాత్‌లో 25 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించిన సామగ్రిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాంధీనగర్ నియోజకవర్గం సెక్టార్ 9లోని పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారులు బీజేపీ పార్టీ గుర్తు (కమలం) ఉన్న పెన్నులు, నోట్‌బుక్‌లు, ప్రధాని మోదీ ఫొటోలను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జీపీసీపీ) అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్ ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

బీజేపీ గుర్తుతో కూడిన స్టేషనరీ..

“నేను ఓటు వేయడానికి సెక్టార్ 19 పోలింగ్ కేంద్రానికి వెళ్లాను. పోలింగ్ ఏజంట్లు బిజెపి పార్టీ గుర్తుతో ఉన్న స్టేషనరీని ఉపయోగించడం చూశాను. ఓ పోలింగ్ ఏజెంట్ కమలం గుర్తు ఉన్న పెన్నుతో లోపల కూర్చున్నాడు. ఎన్నికల గుర్తుతో పోలింగ్ బూత్ లోపల ఎవరైనా కూర్చోవడం చట్ట విరుద్ధం.” అని గోహిల్ ది ఫెడరల్‌తో అన్నారు. "ఓటమి భయంతో" అధికార పార్టీ " ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

GPCC ఫిర్యాదు..

ఇదే విషయాన్నిగుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ECకి లేఖ రాసింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న పోలింగ్ ఏజెంట్లు, అధికారులు కమలం పార్టీ గుర్తు ఉన్న నోట్ బుక్కులు, పెన్నులను ఉపయోగించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్నికాషాయ తోరణాలతో అలంకరించారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుంది.” అని ఫిర్యాదులో పేర్కొంది.

ఓటర్లకు బెదిరింపులు..

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈసీకి రాసిన మరో ఫిర్యాదులో.. "గాంధీనగర్ సీటులోని 42-వేజల్‌పూర్ అసెంబ్లీ స్థానం భాటా స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో మైనారిటీ ఓటర్లు ఓటు వేయకుండా కొంతమంది అడ్డుకున్నారు. మోర్బిలోని రోటరీ నగర్‌లో మైనారిటీ ఓటర్లను బెదిరించారు.’’ అని లేఖలో పేర్కొన్నారు.

బనస్కాంతలో, దంతా తాలూకాలోని సియావాడ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వెలుపల కొంతమంది యువకులు బీజేపీకి ఓటు వేయాలని వాహనాలపై చక్కర్లు కొడుతూ కనిపించారు. ‘‘బిజెపికి ఓటు వేయకపోతే కేసుల్లో ఇరికిస్తామని కొంతమంది పోలీసులు బెదిరించారని మా పార్టీ కార్యకర్తలు నాకు ఫోన్ చేసారు. నేను ఫిర్యాదు చేయడానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళితే.. ఆ వ్యక్తులు నిజమైన పోలీసులు కాదని తెలిసింది.” అని కాంగ్రెస్ నాయకుడు ఠాకోర్ చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా అరెస్టులు జరగలేదు.

ఓటర్ల పేర్లు గల్లంతు..

వడోదరలో, రావ్‌పురా, వడోదర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన చాలా మంది తమ పేర్లు ఓటరు జాబితాలో లేవని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పేష్ పటేల్ జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశారు.

“144-రావుపురా అసెంబ్లీలోని దలియావాడి పోలింగ్ స్టేషన్, 141 వడోదర సిటీ అసెంబ్లీలోని ఆదర్శ్ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల పేర్లు కనిపించడం లేదు. ఓటరు కార్డులు ఉన్నా ఓటు వేయలేకపోయారు. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు' అని పటేల్ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కాకుండా జిగురును ఉపయోగించి కాంగ్రెస్ గుర్తు బటన్‌ను పనిచేయకుండా చేశారని కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులపై స్పందించిన గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఇఒ) పి భారతి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలపై విచారించి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

Read More
Next Story