ఖమ్మం సిపిఐ వందేళ్ల సదస్సుకు రేవంత్ రెడ్డిని ఎందుకు పిలుస్తున్నారు?
x

ఖమ్మం సిపిఐ వందేళ్ల సదస్సుకు రేవంత్ రెడ్డిని ఎందుకు పిలుస్తున్నారు?

సిఎంను పిలవటం ద్వారా కాంగ్రెస్ తో మరింత స్నేహానికి సిద్దం అనే సాంకేతాన్ని పార్టీ పంపుతోందా!!!


సిపిఐ పార్టీ వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరుగుతున్న సభకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని పిలవటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూపీఏ కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఆయనను పిలిచామని చెబుతున్నా ఓట్లు సీట్లు మాత్రమే ఈ పిలుపు వెనుక గీటురాయి అనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికలు జరిగి పార్టీలు మున్సిపల్, జిల్లా పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్రం సిద్దం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ తో పొత్తుకు ప్రయత్నించి విఫలం అయిన వామ పక్ష పార్టీలు తరువాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి. పది ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కలిసివచ్చే అన్ని శక్తులను కలుపుకుని పోయే వ్యూహంతో ముందుకు పోవటంతో సిపిఐకి ఒక సీటు యిచ్చింది. రెండు పార్టీలు చెరి ఐదు సీట్లు కోరినా కాంగ్రెస్ కు వాళ్ళు సీట్లు కోరిన ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలమైన నాయకులు వాళ్ల ప్రయోజనాలు ముడిపడి ఉండటంతో సిపిఐ కి కొత్తగూడెం సీటు మాత్రమే దక్కింది. సిపిఎం తో పొత్తు కుదరలేదు.

కాంగ్రెస్, టీడీపీతో పొత్తుల్లో ఉన్న వామపక్ష పార్టీలు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ లు ముఖ్యమంత్రులుగా వున్నా వాళ్ళను రాష్ట్ర, జాతీయ సభలకు పిలవలేదు. మొదటి సరిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవటం ద్వారా తాము కాంగ్రెస్ పార్టీతో స్నేహాన్ని మరింత ముందుకు తీసుకు పోవటానికి సిద్ధంగా ఉన్నామనే సాంకేతాన్ని పంపుతోంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ సభలను పార్టీ వందయేళ్ళ సంబరాలను మొదలుపెట్టి వాటికి ముగింపుగా జరుపుతోంది. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అందించిన ఆహ్వానాన్ని అందుకున్న సిఎం అందుకు సుముఖంగా స్పందించినట్టు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి వామపక్ష పార్టీల పోరాటాల స్పూర్తిని గుర్తు పెట్టేవారు. లెఫ్ట్ పార్టీలతో అధికారాన్ని పంచుకున్నా వాళ్ళు ఎప్పుడూ ప్రశ్నించటాన్ని అపలేదని గుర్తు చేశారు. బిఆర్ఎస్ పాలన దొరల పాలనను తలపిస్తోందని దాన్ని నిజాం నిరంకుశత్వానికి దొరలకు వ్యతిరేక భూపోరాటాలు చేసిన గడ్డ సహించదని గుర్తు చేస్తూ చివరికి నక్సల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇంద్రవెల్లి పోరాటాన్ని సిఎం అనేక సార్లు ఉదహరించారు.

ఈ నేపధ్యంలోనే వందేళ్ల పార్టీ సభల సందర్భంగా సిఎంను పిలవటంలో ఆశ్చర్యం ఏమీలేదని కె. నారాయణ అన్నారు. “అన్ని వామపక్ష పార్టీలు (సిపిఎం, న్యూ డెమొక్రసీ, ఫార్వార్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, లిబరేషన్) సభలకు హాజరు అవుతున్నాయి. . కేంద్రంలో యూపీఏ కూటమిలో భాగంగా ఉన్నాము. సభలు స్థానికంగా జరుగుతున్న రీత్యా ఆయనను పిలిచాము. అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించలేదు కాబట్టే స్టాలిన్, మమతా బనర్జీ లాంటి నాయకులను పిలవలేదు,” అని ఆయన వివరించారు.

ఇటీవల ఖమ్మం జిల్లా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియోజక వర్గంలో జరిగిన సీపీఎం కార్యకర్త హత్యపై స్పందిస్తూ, “వివాద రహితుడైన వ్యక్తిని చంపారు యిది చాలా బాధాకరం. ఎవరు చంపారు లేదా లేదా ఎవరికి ఆ అవసరం ఉంది అనే విషయాన్ని సిపిఎం పార్టీ నాయకులే చెప్పాలి. మా పార్టీ ఎంఎల్ఏ కూనమనేని సాంబశివ రావు ఆ హత్య తరువాత జరిగిన రౌండ్ టేబల్ సమావేశానికి హాజరు అయ్యి త్వరగా విచారణ జరగాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లోను విషయాన్ని లేవనెత్తారు,” అన్నారు.

లౌకిక శక్తులు కలసి బీజేపీ మతోన్మాదన్ని ఎదుర్కోవాలి అనేది ప్రధాన లక్ష్యం అని సీపీఐ ఎంఎల్ఏ కూనమనేని సాంబశివ రావు అన్నారు. “పంచాయతీ ఎన్నికలలో పొత్తు లేదు. మున్సిపల్ ఎన్నికలలో పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఈ విషయం పై రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయానికి రావాల్సిఉంది,” అన్నారు.

తమిళనాడు సిఎం స్టాలిన్ ను పిలవాలనుకున్నాము. దేశంలో ఉన్న అన్నీ ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర శక్తులను ఒక దగ్గరికి తెచ్చిన ఏకం చేయటం ఇప్పుడు తక్షణ అవసరం అని సిపిఐ నాయకురాలు పశ్య పద్మ అన్నారు. “స్థానిక సంస్థలు ఎన్నికల గుర్తులపై జరగవు కాబట్టి క్రింది స్థాయి కమిటీ లు అక్కడి పరిస్థితి కి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పార్టీలు మాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాజ్యాంగాన్ని రక్షించటానికి 37 పార్టీలతో కలిసి యూపీఏ ఏర్పాటు అయ్యింది. బీజేపీ ని అడ్డుకోవడమే మా తక్షణ కర్తవ్యం,” అని అన్నారు.

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నా పార్టీల మధ్య ఘర్షణ లేదని సీనియర్ సిపిఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేరళలో రాబోయే ఎన్నికలలో రెండు పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి పోటీ తప్పదని అయితే జాతీయ స్థాయిలో పరిస్థితుల రీత్యా కలిసి పనిచేస్తామని అన్నారు.

తెలంగాణా ఏర్పాటుకు ముందు టీడీపీ, కాంగ్రెస్ లతో సిపిఐ, సిపిఎం రెండు కలిసి కూటమి కట్టి భాగస్వామిగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ఏర్పాటు తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికలకు విడివిడిగా పోటీచేశాయి. 2018 లో సిపిఐ కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్ ప్రజా కూటమితో ప్రయాణించగా, సిపిఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో భాగమై పోటీచేసింది. అయితే రెండు పార్టీలకు ఒక్క సీటు రాలేదు.

మోడికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునే ఏ పార్టీ కూటమి అయినా కెసిఆర్ ను విస్మరిస్తే అది వాళ్ల డొల్లతనాన్ని తెలియచేస్తుందని, బిఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.

Read More
Next Story