పట్టాలు తప్పిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్.. ఎందుకు?
x

పట్టాలు తప్పిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్.. ఎందుకు?

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన నరేంద్ర మోదీ సర్కార్ పట్టణాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో స్మార్ట్ సిటీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకం 2025 లో..


నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రకరకాల పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఆ పార్టీకి మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో స్థానిక సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో స్మార్ట్ సిటీస్ పథకాన్ని తీసుకొచ్చింది.

కానీ ప్రస్తుత బడ్జెట్ లో ఈ పథకానికి కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. అంతకుముందు ప్రతిపాదనలతో పోలిస్తే దాదాపు 70 శాతం కోత విధించి కేవలం రూ. 2400 కోట్లు మాత్రమే కేటాయించారు. మార్చి 2025 నాటికి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

బడ్జెట్ లో భారీ కోతకు కారణం దాదాపుగా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది, అయితే విస్తృత సందర్భాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ వివరణ సంతృప్తికరంగా లేదు. మిషన్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 48,000 కోట్లలో చివరి విడతను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, వాస్తవాలను విశ్లేషిస్తే నిరుత్సాహం ఆవరిస్తుంది.

స్మార్ట్ సిటీ పట్టాలు తప్పింది.. ఎందుకు?
పట్టణ భారతదేశాన్ని మార్చడానికి ఒక విప్లవాత్మక చొరవగా భావించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కు అస్థిరమైన నిబద్ధత, పేలవమైన అమలు వ్యూహాత్మక తప్పిదాల కారణంగా విఫలమైనట్లు చెప్పవచ్చు.
ప్రభుత్వం దృష్టి ఇప్పటికే మారినట్లు కనిపిస్తోంది. దేశంలోని 14 నగరాల పునరాభివృద్ధి కోసం ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్ మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇది నగరాలను సృజనాత్మకంగా తీర్చిదిద్దడానికి పెట్టిన ఫ్రేమ్ వర్క్. ఈ కార్యక్రమాలు గత సంవత్సరం ప్రారంభించిన "ఈజ్ ఆఫ్ లివింగ్ ఇన్ సిటీస్" సూచికను అనుసరిస్తాయి. కొత్త కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, అవి ప్రభుత్వ విధానంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
వాగ్దానం - వాస్తవికత
ఇంతకుముందు ఉన్న పథకాన్ని పక్కకు పెట్టి, అర్జంట్ గా ప్రభుత్వం కొత్త పథకం తీసుకురావాల్సిన కారణం ఏంటో కనిపించడంలేదు. స్మార్ట్ సిటీ పథకం అనుకున్న లక్ష్యాలను చేరకుండానే మరో కొత్త పథకం నగరాల కోసం ఎందుకు తీసుకొచ్చారు. ఈ పథకం నగరాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోందనే సందేహం కలిగిస్తుంది.
2015లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించబడిన స్మార్ట్ సిటీస్ పథకం పట్టణ ఆధునీకరణ దిశగా ఒక విప్లవాత్మక అడుగుగా భావించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతికతను ఏకీకృతం చేయడం ద్వారా నగరాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడం, పట్టణ ప్రాంతాలను మరింత సమర్థవంతంగా, స్థిరంగా, జీవించగలిగేలా చేయడం దీని లక్ష్యం. ఈ మిషన్ భారతదేశం అంతటా 100 నగరాలను లక్ష్యంగా చేసుకుంది, ప్రతి ఒక్కటి స్మార్ట్ సిటీ ప్లాన్ (SCP)ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించడానికి వారి ప్రత్యేక దృష్టిని ఇందులో వివరించింది.
అయితే, ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు ఉన్నప్పటికీ, స్మార్ట్ సిటీ పథకం తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోలేకపోయింది. దీని కారణంగానే పట్టణాలు మందగమనంలో జారుకున్నాయి.
నగరాల్లో వైఫల్యాలు
కొన్ని నివేదికల ప్రకారం, అనేక నగరాలు తమ అనుకున్న ప్రాజెక్ట్‌లలో సగం కూడా పూర్తి చేయలేకపోయాయి. ఇంకా అనేక కార్యక్రమాలు వర్క్ ఆర్డర్ దశలో నిలిచిపోయాయి. మనకు పెద్ద స్థాయి బడ్జెట్ లను నిర్వహించే సామర్థ్యం గణనీయంగా లేదని విషయాన్ని ఇది నిరూపించింది. ప్రత్యేకించి చిన్న లేదా ఈశాన్య నగరాల్లో, సవాళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి.
ఈ స్మార్ట్ సిటీని వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఆర్థిక దుర్వినియోగం ఒకటి. ఈ మిషన్ కేంద్ర ప్రాయోజిత పథకంగా రూపొందించబడింది, కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 48,000 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది, సగటున నగరానికి రూ. 500 కోట్లు అన్నమాట.
ఆర్థిక సహకారాలలో కొరత
అయితే, వాస్తవికత ఆదర్శానికి దూరంగా ఉంది. రాష్ట్ర విరాళాలు తరచుగా కేంద్ర ప్రభుత్వం వాటితో సరిపోవట్లేదు.ఇది నిధుల కొరతను సృష్టించి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం, 2015 - 2022 మధ్య, కేంద్ర ప్రభుత్వం రూ. 36,561.16 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలు ఇందుకోసం రూ. 32,149.14 కోట్లు ఖర్చు చేశాయి. లోటు రూ. 4,481.82 కోట్లు. ఈ ఆర్థిక వైరుధ్యం అనేక ప్రాజెక్టులను నిలిపివేసింది, ప్రత్యేకించి పరిమిత ఆర్థిక స్వయంప్రతిపత్తి, అదనపు ఆదాయాన్ని పెంచుకునే సామర్థ్యం ఉన్న నగరాల్లో ఇది గాడి తప్పింది.
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ స్మార్ట్ సిటీ పురోగతిపై ఫిబ్రవరి 2024లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అనేక స్మార్ట్ సిటీలకు ప్రాజెక్టుల కోసం వేల కోట్లు వెచ్చించే సామర్థ్యం లేదని దాని నివేదిక పేర్కొంది.
స్పెషల్ పర్పస్ వెహికల్స్
డిసెంబర్ 2023 నాటికి, 20 దిగువ ర్యాంక్ నగరాల్లో 47 శాతం ప్రాజెక్ట్‌లు వర్క్ ఆర్డర్ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తన వ్యూహాలను పునఃపరిశీలించాలని, పర్యవేక్షణను మెరుగుపరచాలని కమిటీ సిఫార్సు చేసింది.
స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడం, ఆమోదించడం, నిధులు విడుదల చేయడం, అమలు చేయడం, నిర్వహించడం, పర్యవేక్షించడం, మూల్యాంకనం చేసే బాధ్యత కలిగిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVలు) ద్వారా స్మార్ట్ సిటీని నగర స్థాయిలో అమలు చేయాలి.
ఈ విధానం ప్రతి నగరం తన ప్రాజెక్ట్‌లను దాని స్థానిక సందర్భం, వనరులకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించబడింది. అయితే, బాహ్య కన్సల్టెంట్‌లు, అంతర్జాతీయ సాంకేతికతపై ఆధారపడటం వలన ఖర్చులు పెరిగి ఆలస్యాలు మొదలయ్యాయి. అప్పటికే సమస్యాత్మకమైన మిషన్‌ను ఇది ఇంకా క్లిష్టతరం చేసింది.
స్మార్ట్ సిటీల టాప్-డౌన్ విధానం ప్రయోజనం పొందాల్సిన వ్యక్తుల అవసరాలు, ప్రయోజనాలను పట్టించుకోలేదు. ప్లానర్‌లు, నివాసితుల మధ్య ఈ డిస్‌కనెక్ట్ కారణంగా కమ్యూనిటీ అవసరాలతో సంబంధం లేని ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. ప్రాజెక్ట్ ఎంపిక, నిధుల కేటాయింపులో పారదర్శకత లోపించడం వల్ల అవినీతి, దుర్వినియోగం ఆరోపణలను తీవ్రం చేసింది. ఇవన్నీ స్మార్ట్ ప్రాజెక్ట్ ల ప్రతిష్టను దెబ్బతీసింది. దాని ప్రభావం ఫరిది తగ్గింది.
ముందుకెళ్లే మార్గం ?
పథకాల అమలుకు దృఢ నిబద్దత లేకపోతే ఎలా ఉంటోందో స్మార్ట్ సిటీ పథకం(scm) ఒక ఉదాహారణ. ఇవన్నీ భవిష్యత్ నగరాల సమగ్రమైన ప్రణాళిక, సమాజంతో బలమైన సంబంధాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తుంది. ఇవి లేకుండా, భారతదేశ పట్టణాభివృద్ధి కథలో SCM మరో అసంపూర్తి అధ్యాయంగా మిగిలిపోతుంది.
ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు వెళుతున్నప్పుడు, SCM నుంచి నేర్చుకున్న పాఠాలను మరచిపోకుండా చూసుకోవడం చాలా కీలకం. ఏదైనా పట్టణ అభివృద్ధి కార్యక్రమం విజయం కావాలంటే అది ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించే విధంగా ఉండాలి.
దీనికి టాప్-డౌన్, కన్సల్టెంట్-ఆధారిత విధానం నుంచి స్థానిక అవసరాలు, సామర్థ్యాలు, వనరులకు ప్రాధాన్యతనిచ్చే పద్ధతికి మార్చడం అవసరం. అప్పుడే భారతదేశ నగరాలు నిజంగా స్మార్ట్‌గా, స్థిరంగా అందరూ జీవించగలిగేవిగా మారగలవు.
Read More
Next Story