వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ.. ఎందుకు రాశారు? ఎవరికి రాశారు.
x

వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ.. ఎందుకు రాశారు? ఎవరికి రాశారు.

మేనక గాంధీ తనయుడు వరుణ్ గాంధీ రాసిన భావోద్వేగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో నా తుది శ్వాస వరకు మీతో నా బంధం కొనసాగుతుందని ఆయన రాశారు.


బీజేపీ పెద్దలు ఈ సారి వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మాజీ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాదకు టికెట్ కేటాయించింది అధిష్టానం. జితిన్ 2021లో కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపి వరుణ్ భావోద్వేగానికి గురై నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు..
జీవితాంతం సేవ చేస్తా..
"మీ ప్రతినిధిగా ఉండటం నాకు లభించిన వరం. గౌరవం కూడా. సామాన్యుల గొంతును వినిపించాలని రాజకీయాల్లోకి వచ్చాను. మీ అభిరుచులను అనుగుణంగా పనిచేశా. పదవీకాలం ముగుస్తున్నా. నా బంధం మీతో నా చివరి శ్వాస వరకు ఉంటుంది. ఎంపీగా కాకపోయినా, కొడుకుగా నా జీవితాంతం మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. 1983లో తన తల్లి మేనకా గాంధీతో కలిసి నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు తన వయసు మూడేళ్లని, తొలిసారిగా పిలిభిత్‌కు వచ్చిన తనను తన తల్లి చేయి పట్టుకుని నడిపించడం నాకు గుర్తుందని లేఖలో పేర్కొన్నారు వరుణ్ గాంధీ.
మేనక కుటుంబానికి కంచుకోట..
వరుణ్ రెండు పర్యాయాలు పిలిభిత్ పార్లమెంటు సభ్యుడు. 1980 చివరి నుంచి 1989లో తన తల్లి మేనక ఎన్నికయినప్పటి ఈ నియోజకవర్గం మేనకాగాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా రెండు వరుస విజయాలతో సహా ఆమె ఆరుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్‌గాంధీ రెండోసార్లు గెలుపొందారు.
2019 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన హేమ్‌రాజ్‌ వర్మపై వరుణ్‌ 2.55 లక్షల ఓట్లతో విజయం సాధించారు. అయితే, ఈసారి ఆయనను బిజెపి వదులుకోవాలనుకుంది. ఆయన స్థానంలో మాజీ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాదకు టికెట్ కేటాయించింది.
దూరం చేసుకోకూడదని..
మేనక కుటుంబాన్ని దూరం చేసుకోకూడదన్న భావించిన బీజేపీ మేనకా గాంధీ కొడుకును పోటీ చేయించకుండా ఆమెను బరిలోకి దించింది. కాకపోతే పిలిభిత్ నుంచి కాకుండా సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేయాలని సూచించింది. పిలిభిత్ నియోజకవర్గం నుంచి మేనకా గాంధీ, వరుణ్ గాంధీ గత మూడు దశాబ్దాలుగా పోటీ చేస్తున్నారు. ఈ సారి మాత్రం మరో చోటి నుంచి పోటీ చేస్తున్నారు.
యోగి ప్రభుత్వాన్ని విమర్శించాడని..
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బిజెపి నాయకత్వం ఆయనను ఈ సారి దూరం పెట్టినట్లు సమాచారం. ఆఫ్రికా నుంచి చిరుతలను దిగుమతి చేసుకోవడంపై గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రంలోని బీజేపీ పాలనపై మండిపడ్డారు. 2021లో లఖింపూర్ ఖేరీ హింసపై చేసిన ట్వీట్ల కారణంగా బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి వరుణ్, మేనకా గాంధీని తొలగించారు.
Read More
Next Story