బెంగళూరులో సగం మంది ఎందుకు ఓటు వేయలేదు?
ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించినా.. ఎందుకు ఓటర్లు ఓటు వేయలేదు. అసలు పోలింగ్ శాతం తగ్గడానికి కారణమేంటి?
బెంగళూరులో శుక్రవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు సగం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.
కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగగా, 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. నగరంలోని మూడు అర్బన్ నియోజకవర్గాలు - బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్‌లో చాలా తక్కువ మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారట.
బెంగళూరు సెంట్రల్‌లో సుమారుగా 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది.
2019లో..
2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌లో 54.32 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.76 శాతం, బెంగళూరు సౌత్‌లో 53.70 శాతం పోలింగ్ నమోదైంది.
అయితే ఇప్పుడు బెంగళూరు రూరల్‌లో సుమారు 67.29 శాతం ఓటింగ్ నమోదైంది. మండ్యలో 81.48 శాతం, కోలార్‌లో 78.07 శాతం పోలింగ్ నమోదైంది.
నిరాశకు లోనైన ఈసీ..
ఓటింగ్ శాతం తక్కువగా నమోదవడం ఎలక్షన్ కమిషన్‌ను నిరాశకు గురిచేసింది. కర్నాటకలోని ఎన్నికల సంఘం పట్టణ నియోజకవర్గాలలో పోలింగ్ శాతాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని భారీగా ప్రచారం కూడా చేసింది.
నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రజలు రాకపోవడానికి వేసవి తాపం కూడా ఒక కారణమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.