
Source : X /TelanganaACB : ఏసీబీ వలలో చిక్కిన అవినీతి ఆరోపణలున్న అధికారులు
ఏసీబీ వలలో చిక్కినా....తప్పించు కోవచ్చా?
ఏసీబీకి పట్టుబడితే, పెద్ద చేపలకు ఏమి కాదు, ఎందుకు?
ఇల్లు కట్టాలంటే లంచం…భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం…కేసులో న్యాయం కావాలంటే లంచం…ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అనివార్యంగా మారిందా? ఏసీబీ ట్రాప్ కేసులు పెరుగుతున్నా, ప్రజలకు మాత్రం ఈ అవినీతి నుంచి విముక్తి ఎందుకు దక్కడం లేదు?
దేశంలో అవినీతి ఎక్కువ ఉండే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఎక్కువ ప్రజలు భావిస్తున్నారు. యూత్ ఫర్ యాంటి కరప్షన్ (Youth for anti-corruption) 2022 లో జరిపిన ఒక సర్వేలో తెలంగాణ ప్రభుత్వంలో కరప్షన్ విస్తృతంగా ఉందని 95 శాతం అభిప్రాయపడ్డారు. అందుకే అవినీతి నిరోధక శాఖ వల విసిరితే చాలు అవినీతి చేపలు, తిమింగాలు పట్టుబడుతున్నాయి. 2026 జనవరిలోనే ఏసీబీ అధికారులు రికార్డు స్థాయిలో ట్రాప్ కేసులు నమోదు చేయడం, రోజుకో లంచం కేసు వెలుగులోకి రావడం ఈ పరిస్థితికి నిదర్శనం. కేసులు పెరుగుతున్నా, అవినీతిపై పూర్తి స్థాయి చర్యలు మాత్రం ఎందుకు కనిపించడం లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రికార్డు స్థాయిలో ట్రాప్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 2026వ సంవత్సరంలో అవినీతి, అక్రమాలు పెరిగాయా? అంటే అవునంటోంది తెలంగాణ అవినీతి నిరోధక శాఖ. 2026వ సంవత్సరం జనవరి నెలలో తెలంగాణ ఏసీబీ అధికారులు రికార్డు స్థాయిలో ట్రాప్ కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించారు. రోజుకో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కుతోంది. ప్రతీరోజూ పత్రికలు తెరవగానే అక్రమార్కులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కేసుల వార్తలే కనిపిస్తున్నాయి.ఈ ఏడాది జనవరి నెలలోనే 20కి పైగా ట్రాప్ కేసులు నమోదయ్యాయి.
అవినీతికి అడ్డుకట్ట పడేదెన్నడు?
గత ఏడాది కూడా అత్యధికంగా కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఏసీబీ అప్రమత్తమై వరుస దాడులు చేస్తున్నా సర్కారు కార్యాలయాల్లో అవినీతికి మాత్రం తెర పడటం లేదు. 2025వ సంవత్సరంలో ఏసీబీ 199 కేసులు నమోదు చేయగా 273 మంది అవినీతి అధికారులకు సంకెళ్లు వేసింది. ఇందులో 157 ట్రాప్ కేసుల్లో 224 మందిని జైలుకు పంపించారు. గత ఏడాది రూ.57.17 లక్షల లంచం సొమ్మును ఏసీబీ పట్టుకుంది. ఇందులో రూ.35 లక్షలను ఫిర్యాదు దారులకు వాపసు ఇచ్చింది. గత ఏడాది సంపాదనకు మించిన ఆస్తున్నాయని 15 కేసులను ఏసీబీ నమోదు చేసింది.అక్రమ ఆస్తులకు చెందిన 15 కేసుల్లో రూ.96.13 లక్షలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. గత ఏడాది ఏసీబీ 26 రెగ్యులర్ విచారణలు జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఆర్టీఏ చెక్ పోస్టులు,తహసీల్దారు, సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 2025వ సంవత్సరంలో తాము రికార్డు స్థాయిలో అవినీతి అధికారులపై కేసులు పెట్టామని తెలంగాణ ఏసీబీ డీజీపీ చారుసిన్హా చెప్పారు. తెలంగాణలో గత 14 ఏళ్లలోనే 2025 చివరి త్రైమాసికంలో 78 కేసులు పెట్టామని డీజీపీ తెలిపారు. 2011లో చివరి త్రైమాసికంలో 22 కేసులు పెట్టగా, గత ఏడాది నాలుగు రెట్లు అధికంగా నమోదు చేశామని చారుసిన్హా వివరించారు.
అవినీతి కేసులపై ప్రాసిక్యూషన్ ఏది?
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమాలపై పలు కేసులు పెడుతున్నా, సమగ్ర విచారణకు కొన్ని కేసులకే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. గత ఏడాది 199 కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 115 కేసుల్లో ప్రాసిక్యూషన్ జరిపి చార్జిషీట్లు సమర్పించాలని అనుమతించింది. అవినీతి అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమను ప్రాసిక్యూషన్ చేయకుండా చూసుకుంటున్నారు. దీంతో పలు కేసుల్లో సమగ్ర దర్యాప్తునకు సర్కారు అనుమతించక పోవడం వల్ల అక్రమార్కులపై ఏసీబీ చర్యలు తీసుకోలేక పోతుంది.
Source : X /TelanganaACB : ఏసీబీ వలలో చిక్కిన అవినీతి ఆరోపణలున్న అధికారులు
రూ.లక్ష లంచం తీసుకుంటూ...ఏసీబీ వలలో చిక్కిన ముగ్గురు అధికారులు
జనవరి 7 : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరుకు ముగ్గురు అధికారులు పొన్న సుమతి (మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి), మండల పంచాయతీ అధికారి వడ్డ్యావత్ తేజ్ సింగ్, ఎదులపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆవుల చెన్నయ్యలు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. నాలుగు ప్లాట్లలో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసి,రుసుమును కూడా చెల్లించినా, అనుమతి మంజూరుకు రూ.2.5లక్షల లంచం ఇవ్వాలని ముగ్గురు అధికారులు డిమాండ్ చేశారు. ఇందులో లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల వలలో చిక్కారు.
Source : X /TelanganaACB : ఏసీబీ వలలో చిక్కిన అవినీతి ఆరోపణలున్న అధికారి
సాదా బైనామా రిజిస్ట్రేషన్ కోసం రూ.2 లక్షల లంచం
జనవరి 23 : ఈ చిత్రం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దారు కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ కటకం విద్యాసాగర్ రెడ్డిది. రైతుకు చెందిన 8.35 ఎకరాల భూమికి సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజు ఇవ్వడానికి రూ. 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ విద్యాసాగర్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు.
త్వరగా చార్జిషీట్ జారీకి రూ.15వేల లంచం
జనవరి 8 : ఈ చిత్రంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కేయూసీ పోలీసుస్టేషనులో ఎస్ఐ పి శ్రీకాంత్, అతని ప్రైవేటు డ్రైవర్ ఎండీ నజీర్ లు ఓ కేసులో త్వరగా చార్జిషీట్ జారీ చేసేందుకు ఫిర్యాదుదారు నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినా, చట్టప్రకారం త్వరగా చర్యలు తీసుకునేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదు దారు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు ట్రాప్ చేసి అవినీతి ఆరోపణలున్న ఎస్ఐ ఆట కట్టించారు.
అదనపు కలెక్టర్ అక్రమార్జన రూ. 7.6 కోట్లు
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎర్రమాడ వెంకట్ రెడ్డి గత నెల 5వతేదీన లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికారు. అవినీతి కేసులో దొరికిన అదనపు కలెక్టరును ప్రభుత్వం సస్పెండ్ చేసి, అతని ఆస్తుల గురించి విచారణ జరపగా పలు అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. వెంకట్ రెడ్డి ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరపగా రూ.7.6 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. విల్లా, ఫ్లాట్, వాణిజ్య దుకాణం, 8 ఖాళీ ప్లాట్లు, 14.25 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు కార్లు, 297 గ్రాముల బంగారం, రూ.30 లక్షల నగదు, రూ.44 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ వెలుగుచూశాయి. సంపాదనకు మించిన ఆస్తులున్నాయని గుర్తించిన ఏసీబీ అతనిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసింది.
వందలకోట్ల రూపాయల అక్రమార్జన
తెలంగాణ నీటిపారుదల శాఖలో ఏఈ నిఖేష్ కుమార్ రూ.500 కోట్లకు పైగా అక్రమార్జనకు పాల్పడ్డాడని ఏసీబీ గుర్తించి కేసు నమోదు చేసింది.హైదరాబాద్ నగర శివార్లలోని చెరువులు కబ్జా బాగోతాలపై చర్యలు తీసుకోకుండా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఏసీబీ విచారణలో తేలింది. కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరాంకు వందలాది కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏసీబీ గుర్తించింది.భూములు, భవనాలు, విల్లాలు, బంగారం, డబ్బును ఏసీబీ సీజ్ చేసింది. నీటిపారుదల శాఖ ఎస్ ఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్, ఏఈఈ రవికిశోర్, ఈఈ అర్రంరెడ్డి అమరనాథ్ రెడ్డి, ఈఈ శ్రీధర్ లకు వందలకోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఏసీబీ విచారణలో వెల్లడైంది.
కాళేశ్వరం అవినీతి తిమింగలం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కూలిన మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు వందలకోట్ల రూపాయల మేర అక్రమార్జనకు పాల్పడ్డాడని తేలింది. ఏసీబీ అధికారుల దాడుల్లో దిమ్మతిరిగిపోయే ఆస్తులను గుర్తించి నివ్వెరపోయారు. మురళీధర్ రావుకు హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఒక విల్లా, నాలుగు ఫ్లాట్లు. నాలుగు ఒపెన్ ప్లాట్లు, వాణిజ్య భవనం, 6,500 చదరపు గజాల భూమి, 11 ఎకరాల వ్యవసాయ భూమి, జహీరాబాద్ లో రెండు కేవీ మెగావాట్ల సామర్ధ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్టు, కరీంనగర్ లో వాణిజ్య భవనం, కోదాడలో అపార్టుమెంట్, వరంగల్ లో అపార్టుమెంట్, బ్యాంకు డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, మూడు కార్లు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది.
రవాణశాఖ డీటీసీ అక్రమార్జన రూ. 12.72 కోట్లు
మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్ పై సంపాదనకు మించిన అక్రమ ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డీటీసీ కిషన్, అతని బంధువులకు చెందిన 11 ప్రదేశాల్లో ఏసీబీ సోదాలు జరపగా అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. ఈ అధికారికి నిజామాబాద్ నగరంలో లహరి ఇంటర్నేషనల్ హోటల్ లో 50 శాతం వాటా, 3వేల చదరపు గజాల రాయల్ ఓక్ ఫర్నిచర్ స్థలం, అశోక టౌన్ షిప్ లో రెండు ఫ్లాట్లు, 10 ఎకరాల వాణిజ్యభూమి, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్, షెడ్ రెండు కార్లు, 1000 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయని ఏసీబీ తనిఖీల్లో తేలింది. డీటీసీ కిషన్ కు దస్తావేజుల ధర ప్రకారం రూ.12.72 కోట్ల ఆస్తులుండగా, మార్కెట్ ధర ప్రకారం చూస్తే అయిదు రెట్లు అధికంగా ఉంటుందని ఏసీబీ డీఎస్పీ ఒకరు చెప్పారు.
అవినీతి ప్రభుత్వ శాఖలివే...
పోలీసు, తహసీల్దారు, తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ, మండల పరిషత్, పౌర సరఫరాల శాఖ,మున్సిపాలిటీ, ఎక్సైజ్, రవాణ, పంచాయతీ విభాగం అధికారులు ఎక్కువగా అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ రికార్డులు వెల్లడించాయి. వివిధ పనులకు లంచాలను ఫిక్స్ డ్ రేట్ల రూపంలో నిర్ణయించి అవినీతి అధికారులు వసూలు చేస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ లో ఓ కేసులో నుంచి పేరును తొలగించడానికి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ ఎం రమేష్ ఏసీబీకి చిక్కారు. ప్రజల నుంచి అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులతో పాటు అక్రమార్కుల ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, ట్రాప్, సంపాదనకు మించిన ఆస్తులున్న వారిపై ఏసీబీ దృష్టి సారించి కేసులను నమోదు చేసింది.
ఏసీబీ కేసులు ఉన్నా అధికారులకు పదోన్నతులు
రాష్ట్రంలో డీసీటీఓగా ఉన్న జి శ్రీనివాస్ పై 2013వ సంవత్సరంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు పెండింగులో ఉండగానే అసిస్టెంట్ కమిషనరుగా పదోన్నతి పొందారు. మరో డీసీటీఓ డి శ్రీనివాసరెడ్డిపై 2018వ సంవత్సరంలో ఏసీబీ కేసు నమోదు చేసినా పదోన్నతి పొందారు. సీటీఓ కె గీతపై విజిలెన్స్ విభాగం కేసు నమోదు చేసినా జాయింట్ కమిషనరుగా పదోన్నతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసులున్న అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోగా, వారు మంచి స్థలాల్లో పోస్టింగులు, పదోన్నతులు పొందుతున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
విచారణలో తీవ్ర జాప్యం...అవినీతి అధికారులపై చర్యలేవి?
తెలంగాణలో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిపై కేసు నమోదు చేస్తున్నారు. అవినీతి అధికారులను అరెస్టు చేసి, రిమాండుకు పంపినా వారు బెయిలుపై విడుదల అవుతున్నారు. అనంతరం వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినా, వారు పైరవీలతో పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఏసీబీ అవినీతి అధికారులపై విచారణ పూర్తి చేసి ఏసీబీ కోర్టులో చార్జిషీట్లు సమర్పించాల్సి ఉండగా, దీనిలో జాప్యం జరుగుతుంది. దీంతో పాటు ఏసీబీ కోర్టుల్లోనూ అవినీతి కేసుల విచారణ మరింత జాప్యానికి దారి తీస్తుంది. గత ఏడాది, అంతకు ముందు ఏసీబీ పలు కేసులు నమోదు చేసినా కేవలం 105 కేసుల్లోనే ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2018వ సంవత్సరంలో నమోదు అయిన ఏసీబీ కేసులో విచారణ ఆరేళ్ల పాటు సాగింది. 2019లో మూడు కేసులు, 2020లో 5 కేసులు, 2022లో 12 కేసులు, 2024లో 26 కేసుల్లోనే ఏసీబీ విచారణ పూర్తి చేసింది. దీంతో ఎక్కువ ఏసీబీ కేసుల్లో అవినీతి అధికారులపై ఛర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ఆరోపించారు.
సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
ఏసీబీ అవినీతి అధికారులపై నమోదు చేస్తున్న కేసుల్లో కేవలం 80 శాతం కేసుల ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర ప్రభుత్వమే అనుమతివ్వడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ కేసులను డిపార్టుమెంట్ విచారణల పేరిట డైల్యూట్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కు అనుమతించిన కేసుల్లో కేవలం 50 శాతం కేసుల్లో అక్రమార్కులకు శిక్షలు పడుతున్నాయని ఆయన తెలిపారు. ఏసీబీ కేసులు పెట్టడం కాకుండా పెట్టిన కేసులను ప్రాసిక్యూషన్ నిర్వహించి వారికి శిక్షలు పడేలా చేయాలని ఆయన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు.
అయిదేళ్లలో 621 ఏసీబీ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడచిన అయిదేళ్లలో 621 కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసుల్లో ఏసీబీ సమగ్ర విచారణ పూర్తి చేసి అవినీతి అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం గడిచినా అనుమతి ఇవ్వడం లేదు. ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో 25 శాతం కేసులకే ప్రాసిక్యూషన్ అనుమతి ఇస్తుంది. మిగతా కేసులు డిపార్టుమెంట్ ఎంక్వేరీలు, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్ పేరిట పంపుతున్నారు. ఈ కేసులు సంవత్సరాల తరబడిగా పెండింగులో ఉంటున్నాయని, ఈ లోగా అవినీతి అధికారులు పదవీ విరమణ కూడా చేస్తున్నారని సమాచారహక్కు చట్టం కింద సేకరించిన సమాచారం ద్వారా వెల్లడైందని పద్మనాభరెడ్డి చెప్పారు.
ఏసీబీ కోర్టుల విచారణలో జాప్యం
ఏసీబీ కేసుల విచారణ కోర్టుల్లో అంతులేని జాప్యం జరుగుతుంది. విచారణ పేరిట సాగదీసి ఏడాదికి కేవలం 20 కేసుల్లోనే తీర్పులు వెలువడుతున్నాయని తాజా సమాచారం ప్రకారం తేలింది. 2023-24 సంవత్సరంలో 19 ఏసీబీ పాత కేసుల్లో తీర్పు రాగా అందులో కేవలం 9 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి. పది కేసులను ఏసీబీ కోర్టులు కొట్టివేశాయి. లంచం తీసుకుంటూ అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా పలు కేసులు కోర్టుల్లో నిలవలేదు. 2024-25 సంవత్సరంలో 22 కేసుల్లో ఏసీబీ కోర్టులు తీర్పులు వెలువరించగా ఇందుల్లో 12 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. మరో పది కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఏసీబీ కేసుల్లో నిందితులకు శిక్షలు మాత్రం నామమాత్రంగానే పడుతున్నాయి.
బట్టబయలైన అవినీతి అధికారి బాగోతం
తెలంగాణలోని రవాణశాఖకు చెందిన మోటారు వెహికల్ ఇన్ స్పెక్టరు బి బద్రునాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించి ఏసీబీ 2008 డిసెంబరు 2వతేదీన కేసు నమోదు చేసింది. ఈయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచిఅనుమతి అడగ్గా 16 నెలలు గడచినా క్లియరెన్స్ రాలేదు.ఏసీబీ కేసులున్నా బద్రూనాయక్ ను విధుల్లోకి తీసుకోవడంతో పాటు డీటీసీగా పదోన్నతి కూడా కల్పించారు.2011వ సంవత్సరంలో ఇతనిపై ఏసీబీ కోర్టులో చార్జి షీట్ వేయగా 15 సంవత్సరాలుగా కోర్టు విచారణ పెండింగులోనే ఉంది. గత ఏడాది ఆగస్టు నెలాఖరున పదవీ విరమణ చేయబోతుండగా జగిత్యాల రవాణ శాఖ అధికారిగా ఉన్న బద్రూనాయక్ రూ.22 వేలు లంచం తీసుకుంటూ మరోసారి ఏసీబీ అధికారులకు చిక్కారు. కోరుట్లలో ఓ ఎక్స్ వేటరును పట్టుకొని దాన్ని సీజ్ చేయకుండా ఉండేందుకు రూ.35వేలు లంచం డిమాండ్ చేసి తన డ్రైవర్ అరవింద్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ రెండోసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇతనిపై నమోదైన కేసు కోర్టులో తేలకపోగా, పదవీ విరమణ నెలలోనే మరో సారి ఏసీబీకి చిక్కారు. యాక్షన్ లేకుండా పదవీ విరమణ కూడా చేశారు.
Source : X /TelanganaACB :తెలంగాణ ఏసీబీ డీజీపీ చారుసిన్హా
టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి
ఒక వేళ ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ తమ అవినీతినిరోధకశాఖకు చెందిన టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలంగాణ ఏసీబీ డీజీపీ చారుసిన్హా కోరారు. వివిధ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్ సైట్ (http://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అవినీతి నిరోధకశాఖ ను సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. అక్రమాలపై ఫిర్యాదు చేసే వారి పేర్లు, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని డీజీపీ వివరించారు.
ఏసీబీ కేసులు పెరుగుతున్నాయన్న గణాంకాలు ఆశ చూపుతున్నా, ప్రాసిక్యూషన్ అనుమతులు, కోర్టుల జాప్యం అవినీతి అధికారులకు రక్షణ కవచంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి మారేదెప్పుడో… అవినీతిపై నిజమైన భయం పుట్టేదెప్పుడో అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు.
Next Story

