ఇండియాతో మాల్దీవుల గిల్లికజ్జాలెందుకు?
డ్రాగన్ కంట్రీ చైనా అండ చూసుకుని మాల్దీవ్స్ ఎగిరెగిరి పడుతోందా..? భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకోవాలనుకుంటోందా..?
డ్రాగన్ కంట్రీ చైనా అండ చూసుకుని మాల్దీవ్స్ ఎగిరెగిరి పడుతోందా..? భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకోవాలనుకుంటోందా..? అందుకే మాల్దీవులకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా పావులు కదుపుతోందా..? మాల్దీవులు వర్సెస్ లక్ష ద్వీప్.. ఇప్పుడిదే దేశ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్న అంశం. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను సందర్శించిన తర్వాత మాల్దీవులు నుంచి వస్తున్న పొలిటికల్ రియాక్షన్స్ దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను ఇటీవల సందర్శించారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా అక్కడ ఆయన చేసిన పర్యటన తర్వాత మాల్దీవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధాని మోదీ ఫొటోలపై మాల్దీవుల పోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ట్విట్టర్ ఎక్స్‌లో చేసిన పోస్టులే ఇందుకు కారణం. లక్షద్వీప్ టూరిజానికి పనికిరాదనే భావన కలిగేలా రమీజ్ చేసిన పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాల్దీవులది రెచ్చగొట్టే వైఖరా?
మరోపక్క మాల్దీవుల పర్యాటక మంత్రి మారియమ్ షియునా మోదీ పర్యటనను ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్ట్ కూడా మాల్దీవుల రెచ్చగొట్టే వైఖరికి నిదర్శనంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ చేతిలో మోదీ పప్పెట్‌లా మారారని ఎక్స్‌లో పోట్స్ చేశారు మాల్దీవుల పర్యాటక మంత్రి మారియమ్. బీచ్ టూరిజంలో మాల్దీవులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కానీ.. భారత్‌తో సంబంధాల విషయంలో మాల్దీవులు దుందుడుకు వైఖరిని అవలంబిస్తోంది. ఈ ఐల్యాండ్‌పై చైనా, టర్కీ, పాకిస్తాన్ తమ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్నాయి. ప్రధానంగా చైనా మాల్దీవుల రాజకీయాల్లో జోక్యంతో భారత్‌పై విషం చిమ్మే చర్యలకు, రెచ్చగొట్టే ధోరణికి దిగుతూ వస్తోంది.
ఇండియా అవుట్ అంటే ఏమిటీ?
ఇండియా అవుట్ అనే పాలసీని కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఈమధ్యకాలంలో ముమ్మరంగా అమలుచేస్తూ వస్తున్నారు. మొదట తమ దేశంలో మోహరించిన భారత దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు డిమాండ్ చేసింది. తాజాగా నాలుగేళ్ల కిందట ఇండియాతో కుదుర్చుకున్న హైడోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులను సందర్శించినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి అభ్యర్థనతో హైడోగ్రాఫిక్ సర్వే ఒప్పందం చేసుకుంది ఇండియా. మొహమ్మద్ ముయిజ్జు పోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నుంచి గెలిచి మాల్దీవులకు అధ్యక్షుడయ్యారు. అప్పట్నుంచి.. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చైనా వేలుపెడుతూ వస్తోంది. దీనికి నిదర్శనమే మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పోగ్రెసివ్ పార్టీ ‘ఇండియా అవుట్’ నినాదాన్ని ఎంచుకోవడం. అంతేకాదు.. మాల్దీవుల్లో భారత దళాల ఉనికిని తొలగిస్తామని కూడా ప్రకటించింది.
మాల్దీవుల వైఖరి ఎందుకు మారింది?
అంతకు ముందు మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం సోలీ మాత్రం భారత్‌కు అండగా మాట్లాడుతూ వచ్చారు. ఇండియా ఫస్ట్ నినాదాన్ని ఇచ్చారు. కానీ.. మొయిజ్జు వైఖరి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీంతో భారత్ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు చైనాను, ఇటు మాల్దీవుల్ని చెక్ పెట్టే దిశగా రాజకీయ , దౌత్య వ్యూహాలు రచిస్తోంది. టూరిజం, ఇతర కార్యక్రమాలకు భారత్‌కు మించిన డెస్టినేషన్ మరొకటి లేదని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. తానే లక్షద్వీప్‌ను పర్యటించి అక్కడ టూరిజం ఎంత బాగా అభివృద్ధి చెందుతోందో చూపించారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ విదేశీ టూర్లకు వెళ్లడం ద్వారా మన దేశ పర్యాటకం, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా దెబ్బతింటుందనేది కేంద్రం భావన. అందుకే.. మన దేశ పర్యాటకాభివృద్ధికి తోడ్పాటునందించాలని కేంద్రం కోరుకుంటోంది. తాజాగా మోదీ లక్షద్వీప్ పర్యటన వెనక కూడా ఈ స్ట్రాటజీనే ఉంది.
ఇండియా కౌంటర్ వాదన...
మాల్దీవులు ఇండియా అవుట్ నినాదాన్నిస్తుంటే.. ఇప్పుడు బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనేది ఇండియన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్‌కు వెళ్లాలని నెటిజన్స్ పిలుపునిస్తున్నారు. దీంతో ఎక్స్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. మరోపక్క నిన్న మాల్దీవులకు చెందిన ప్రభుత్వ ప్రధాన వెబ్‌సైట్లు సాంకేతిక సమస్యతో పనిచేయలేదు. ఆ తర్వాత కొన్నిగంటలకు పునరుద్ధరించారు. దీనిపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి