కర్ణాటక ప్రజలపై మోదీకి ఎందుకంత పగ?
x

కర్ణాటక ప్రజలపై మోదీకి ఎందుకంత పగ?

కర్ణాటక ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండడం బాధాకరమని పేర్కొన్నారు.


కర్ణాటక పట్ల ప్రధాని మోదీ వైఖరిని తప్పుబట్టారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. పక్షపాత ధోరణి మంచిదికాదని హితవు పలికారు. ఇప్పటికే కర్ణాటకలో తొలి విడద పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 స్థానాలకు రెండో విడత పోలింగ్ మే 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మోదీకి కొన్ని ప్రశ్నలు సంధించారు.

‘‘కర్నాటక కరువుతో కొట్టుమిట్టాడుతోంది. 236 తాలూకాలలో 223 కరువు తాలుకాలను కరువు మండలాలుగా గుర్తించారు. 196 తాలూకాల్లో తీవ్ర కరువు ఛాయలు అలుముకున్నాయి. కరువు సాయంగా రూ. 18,171 కోట్లను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం 2023 సెప్టెంబరులో మోడీ ప్రభుత్వాన్ని కోరింది. ఏడు నెలలు గడిచినా కేంద్రం నుంచి స్పందని లేదు. ఇక చేసేదేమీ లేక..కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాత, కేంద్రం చివరకు నిధులు మంజూరు చేసింది. కానీ కేవలం రూ. 3,498 కోట్లు మాత్రమే. ఇది అడిగిన దాంట్లో కంటే 20% కంటే తక్కువ. కర్ణాటక ప్రజల పట్ల మోదీ పక్షపాత వైఖరి మంచిది కాదు.’’ అని జైరాం రమేష్ పేర్కొన్నారు.

భద్రా ఎగువ ప్రాజెక్టుకు నిధులేవీ?

‘‘గత ఏడాది కేంద్ర బడ్జెట్‌లో భద్రా ఎగువ ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్ల గ్రాంట్‌ను మోదీ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. ఏడాది దాటిపోయింది. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మహాదాయి-కలసా బండూరి నాలా ప్రాజెక్ట్‌తో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వలేదు. తీవ్రమైన కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో తాగునీరు, సాగునీటి కల్పించడానికి ఈ ప్రాజెక్టులు చాలా కీలకం. ఈ ముఖ్యమైన ప్రాజెక్టులను మోడీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది? కర్ణాటక ప్రజలపై ప్రధానమంత్రికి ఎందుకంత పగ? ఇకనైనా ఆయన మౌనం వీడాలి. సమాధానం చెప్పి తీరాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు రమేష్.

ఎంపీలు ఉండి ఏం లాభం?

బీజేపీ ఎంపీలపై కూడా జైరాం రమేస్ విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 7 నెలల జాప్యం తర్వాత కేంద్రం 20% కంటే తక్కువ కరువు నిధులను విడుదల చేసింది? దీనిపై బీజేపీ ఎంపీలు ప్రశ్నించరా? ఎగువ భద్ర, మహదాయి ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు ఆపుతోంది? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం కర్ణాటకపై వివక్ష చూపుతున్నా బిజెపి ఎంపీలు తమ బాధ్యతను విస్మరించడం బాధాకరమన్నారు.

"పార్లమెంట్‌లో జాతీయ సగటు హాజరు 79% కాగా, 28 మంది కర్ణాటక ఎంపీల సగటు 71% కంటే తక్కువగా ఉంది. వీరిలో 26 మంది ఎంపీలు ఎన్నడూ కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తలేదు. ఉపాధి హామీ పథకం నిధుల విడుదల, కరువు, వరద సాయం గురించి పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.’’

"ఐదేళ్లలో ముగ్గురు ఎంపీలు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఐదుగురు ఎంపీలు ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. చాలా మంది ఎంపీలు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. ఏడుగురు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైన ఎజెండాలపైనే దృష్టి సారించారు. బాధాకర విషయం ఏమిటంటే..28 మందిలో 14 మంది ఎంపీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారి ప్రాంతాలలో మత హింసను ప్రోత్సహించడంలో పాలుపంచుకున్నారు.’’ అని ఆరోపించారు రమేష్.

Read More
Next Story