
హైదరాబాద్ మెట్రోలో పెరిగిపోతున్న రద్దీ
మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకులసంఖ్య రోజుకు 30వేలు పెరిగింది
హైదరాబాద్ మెట్రోలో గడచిన వారంరోజులుగా రద్దీ పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితంవరకు మెట్రోలో రోజుకు సగటున 4.5 లక్షలమంది ప్రయాణించేవారు. అలాంటిది వారంరోజులుగా రోజూ 4.8 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. అంటే మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకులసంఖ్య రోజుకు 30వేలమంది పెరిగింది. ఈసంఖ్య మరింతగా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రోలో ప్రయాణిస్తున్న వారిసంఖ్య ఒక్కసారిగా రోజుకు 30 వేలమంది ఎందుకు పెరిగారు ?
దీనికి రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటి కారణం పశ్చిమాసియాలో రోజురోజుకు పెరిగిపోతున్న యుద్ధ ప్రభావం. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రత పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజల్ కు డిమాండ్ పెరిగిపోతోంది. అలాగే సీఎన్జీకి కొరత పెరిగిపోతోంది. హైదరాబాద్ లో సీఎన్జీతో నడిచే వాహనాలు వేలల్లో ఉన్నాయి. సీఎన్జీ, పెట్రోల్, డీజల్ కొరత కారణంగా ఎందుకొచ్చిన అవస్తలని చాలామంది వాహనాల యజమానులు తమ సొంత వాహనాలను ఇళ్ళల్లోనే వదిలేసి మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
ఇక, రెండో కారణం ఏమిటంటే పెరిగిపోతున్న ఎండలు. వాతావరణంలో సడెన్ గా వస్తున్న మార్పుల కారణంగా కొంతసేపు ఎండ మండిపోతుంటే మరికొంతసేపు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణంలోని తీవ్రమైన అనిశ్చితి వల్ల వాహనాల యజమానులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకనే సొంత వాహనాల్లో ప్రయాణిస్తు ఇబ్బందులు పడేకన్నా ఎంచక్కా మెట్రోలో ప్రయాణిస్తే చాలా సమస్యలకు పరిష్కారంగా ఉంటాయని వాహనాల యజమానులు భావిస్తున్నట్లున్నారు. అందుకనే సొంతవాహనాలను వదిలేసి మెట్రో బాట పడుతున్నారు.
ఉద్యోగులు, విద్యార్ధులు, సీనియర్ సిటిజన్లు, ఐటి ఉద్యోగులు ప్రతిరోజు లక్షలాదిమంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. నాగోల్ నుండి అమీర్ పేట్ వరకు ఎల్బీ నగర్ నుండి మియాపూర్ వరకు అలాగే జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ క్యారిడార్ల మధ్య ప్రయాణీకుల రద్దీ పెరిగిపోతోంది. రాబోయే రోజుల్లో మరింత రద్ది పెరిగిపోయే అవకాశాలున్నాయని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చేనెలలలో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజుకు 5 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యంలేదని లెక్కలేస్తున్నారు.
మెట్రోకు ఇంత డిమాండ్ పెరిగిపోతున్నా కోచ్ ల సంఖ్య మాత్రం పెరగటంలేదు. ప్రస్తుతం పైనచెప్పిన మూడు క్యారిడార్లలో ప్రతిరోజు మెట్రో రైళ్ళు సుమారు వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి స్టేషన్ నుండి 3 లేదా 5 నిముషాల వ్యవధిలో ఒక మెట్రో ప్రయాణిస్తున్నది. మెట్రోలో ఇంతమంది ప్రయాణిస్తున్నా, ప్రతి 4 నిముషాలకు ఒక మెట్రో బయలుదేరుతున్నా వందలాదిమంది ప్రయాణికులు స్టేషన్లలో ఇంకా పడిగాపులు కాస్తున్నారు. ఇపుడున్న నాలుగు కోచ్ లకు అదనంగా మరో రెండు కోచ్ లను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే మెట్రో యాజమాన్యం ఎల్ అండ్ టి నుండి ప్రభుత్వం చేతిలోకి మారుతున్న కారణంగా అదనపు కోచ్ ల ఏర్పాటు ఆలోచన అటకెక్కింది. మరి ప్రభుత్వం చేతిలోకి యాజమాన్యం వచ్చిన తర్వాతైనా అదనపు కోచ్ ల ఏర్పాటు ప్రయత్నం సాకారమవుతుందేమో చూడాలి.

