
భారత మూలాలున్నా రామస్వామికి ఎందుకు మద్దతివ్వలేదంటే?
డెమోక్రాట్ అభ్యర్థి అమీ ఆక్టన్నే ఎందుకు ఎంచుకున్నాను?
లతా శ్రీనివాసన్
అమెరికాలో భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామిపై డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ విజయం సాధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒహియో గవర్నర్ ఎన్నికల్లో అమీ ఆక్టన్‌కు 52 శాతం ఓట్లు రాగా, రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామికి 44 శాతం ఓట్లు వచ్చాయి.
అయితే ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. భారతీయ మూలాలున్న వ్యక్తిగా, భారతీయ అమెరికన్లు ఎక్కువగా మద్దతిస్తారని భావించిన వివేక్ రామస్వామికి కాకుండా, తాను అమీ ఆక్టన్‌కు ఎందుకు మద్దతిచ్చానో ఒహియోలో నివసిస్తున్న భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ కార్యకర్త లతా శ్రీనివాసన్ వివరించారు.
వివేక్ రామస్వామి భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో దక్షిణాసియా ఓటర్లను అమీ ఆక్టన్ వైపు మళ్లించడం డెమోక్రటిక్ కార్యకర్తలకు అంత సులభం కాలేదు. ముఖ్యంగా భారతీయ అమెరికన్ల మద్దతు పొందే విషయంలో కొంత సవాలు ఎదురైంది. అయితే కేవలం ఒకే దేశానికి చెందిన మూలాలు ఉన్నంత మాత్రాన రాజకీయంగా ఒకే వైఖరి కలిగి ఉండాల్సిన అవసరం లేదని వారు ఓటర్లకు వివరించారు. వ్యక్తి వారసత్వం కంటే అతడి రాజకీయ విలువలు, విధానాలు ముఖ్యమని ప్రచారం చేశారు.
భారతీయ సమాజం సాధారణంగా విద్య, సైన్స్, పరిశోధన, మెరుగైన వైద్య సదుపాయాలు, హెచ్1బీ వంటి వలస విధానాలు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తుందని లతా శ్రీనివాసన్ పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీ, అమీ ఆక్టన్ ఈ అంశాలకు మద్దతుగా ఉన్నారని, మరోవైపు వివేక్ రామస్వామి మాత్రం ట్రంప్ అనుసరించే MAGA రాజకీయాలకు దగ్గరగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
మొదట్లో అనుమానాలు.. కానీ..
అమీ ఆక్టన్ రాజకీయ ప్రయాణం మొదట్లో అంత సులభంగా సాగలేదు. 2025లో ఆమె గవర్నర్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె ఎక్కువకాలం ప్రచారంలో నిలబడలేరని చాలామంది భావించారు. వైద్యురాలైన అమీ ఆక్టన్ గతంలో ఒహియో రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఆమె ప్రజలకు ఇచ్చిన సూచనలు, భరోసా కల్పించే ప్రసంగాలు విస్తృతంగా గుర్తింపు పొందాయి.
కరోనా సమయంలో భౌతిక దూరం, మాస్కుల నిబంధనలను వ్యతిరేకిస్తూ తీవ్రవాద భావాలున్న కొన్ని వర్గాలు నిరసనలకు దిగాయి. మరోవైపు అప్పటి రిపబ్లికన్ ప్రభుత్వం ఆమెకు కొన్ని ఆదేశాలపై సంతకాలు చేయాలని కోరింది. అయితే తన వైద్య వృత్తి ప్రమాణాలకు, మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించలేనని భావించిన అమీ ఆక్టన్ తన పదవికి రాజీనామా చేశారు.
కానీ ఆమె నిర్ణయాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేక, తనకు, కుటుంబానికి వచ్చిన బెదిరింపులకు భయపడి పదవి నుంచి తప్పుకున్నారని భావించారు. దీంతో ఆమె నాయకత్వ సామర్థ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది డెమోక్రటిక్ పార్టీ నేతలు సైతం ఆమె బలమైన అభ్యర్థి కాదని భావించారు.
అమీ ఆక్టన్ను ప్రత్యక్షంగా కలిసిన తర్వాత ఆమె నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు తనను ఆకట్టుకున్నాయని లతా శ్రీనివాసన్ తెలిపారు. దీంతో ఆమె ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
అందరిని కలుపుకుపోయే తత్వం..
అమీ ఆక్టన్ ప్రచారంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లతో పాటు వివిధ మతాలు, జాతులకు చెందిన ప్రజలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం జరిగింది. దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించారు. ఒహియో డెమోక్రటిక్ పార్టీ, 'దే సీ బ్లూ ఒహియో', 'సౌత్ ఏషియన్స్ ఫర్ అమెరికా' సంస్థలతో కలిసి లతా శ్రీనివాసన్ దక్షిణాసియా ఓటర్లకు ఫోన్ కాల్స్ ద్వారా అమీ ఆక్టన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.
ఇలా ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో వివేక్ రామస్వామి ఒక వివాదాస్పద ప్రకటనను విడుదల చేశారు. అమీ ఆక్టన్ వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా ఆమె తల్లితో ఉన్న సంబంధాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రకటన రూపొందించారు. దశాబ్దాలుగా తల్లితో సంబంధాలు లేని అమీ ఆక్టన్ను ఆ ప్రకటనలో అబద్ధాలకోరుగా చిత్రీకరించారు.
మాట వినని రామస్వామి..
కోర్టు పత్రాల ప్రకారం, అమీ ఆక్టన్ చిన్నతనంలో ఉన్నప్పుడే ఆమెపై సవతి తండ్రి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెను, ఆమె సోదరుడిని తల్లి సంరక్షణ నుంచి తొలగించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ రూపొందించిన ప్రకటన కోసం వివేక్ రామస్వామి ప్రచార బృందం నాలుగు మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ఈ ప్రకటనపై రిపబ్లికన్ పార్టీలో కూడా విమర్శలు వచ్చాయి. ఒహియో రిపబ్లికన్ గవర్నర్ మైక్ డివైన్ సైతం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమీ ఆక్టన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వివాదాస్పదంగా మారడంతో, రామస్వామి ప్రచారానికి మేలు చేయాల్సిన ఈ ప్రకటన చివరకు ఆయనకే ఎదురుదెబ్బగా మారింది.
దీనికి భిన్నంగా అమీ ఆక్టన్‌కు దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఒహియోతో పాటు అమెరికాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆమె ప్రచారానికి భారీగా విరాళాలు వచ్చాయి. అయితే ఆమెకు మద్దతు పెరగడానికి ప్రకటన వివాదం ఒక్కటే కారణం కాదని లతా శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో అమీ ఆక్టన్ ప్రసంగాలు విన్న ఓటర్లు ఆమె తెలివితేటలు, ప్రజల పట్ల చూపే శ్రద్ధను గుర్తించారని తెలిపారు.
అమీ ఆక్టన్ జీవితం కూడా సాధారణ పరిస్థితుల్లో సాగలేదు. పేదరికంలో పెరిగిన ఆమె ఒక దశలో తన తమ్ముడితో కలిసి గుడారంలో నివసించాల్సి వచ్చింది. చిన్నతనంలో ఎదుర్కొన్న కుటుంబపరమైన కష్టాలు ఆమెను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలను అర్థం చేసుకునేలా చేశాయని లతా శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
చివరకు ఒహియో గవర్నర్ ఎన్నికల్లో అమీ ఆక్టన్ 52 శాతం ఓట్లతో విజయం సాధించగా, వివేక్ రామస్వామికి 44 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఒహియో చరిత్రలో గవర్నర్‌గా ఎన్నికైన తొలి మహిళగా అమీ ఆక్టన్ నిలిచారు. అయితే 1998-99లో అప్పటి గవర్నర్ జార్జ్ వోయినోవిచ్ రాజీనామా చేసి సెనేట్‌కు వెళ్లినప్పుడు, నాన్సీ హొల్లిస్టర్ 11 రోజుల పాటు గవర్నర్‌గా వ్యవహరించిన విషయం మినహాయింపు.
డెమోక్రాటిక్ విధానాలే..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన పరాజయానికి ఇరాన్ యుద్ధం సహా పలు అంశాలు కారణమయ్యాయని లతా శ్రీనివాసన్ పేర్కొన్నారు. అయినప్పటికీ డెమోక్రటిక్ పార్టీకి ప్రజల్లో మద్దతు పెరగడానికి ఆ పార్టీ విధానాలు కూడా కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
అన్ని జాతులు, వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు, మహిళల పునరుత్పత్తి స్వేచ్ఛ, మతం-ప్రభుత్వ వ్యవస్థల మధ్య స్పష్టమైన విభజన, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, పేదలకు సామాజిక భద్రత, ప్రభుత్వ పాఠశాలలకు నిధులు, చట్టబద్ధమైన వలసదారులకు స్వాగతం, సైన్స్, పరిశోధనలకు ప్రాధాన్యం వంటి అంశాలు తన రాజకీయ విలువలకు దగ్గరగా ఉన్నాయని ఆమె వివరించారు.
రాజకీయాల్లో ఓటు వేయడం అనేది వ్యక్తిగత సంబంధాన్ని ఎంచుకోవడం లాంటిది కాదని, తాము కోరుకునే సమాజ నిర్మాణానికి అనుగుణంగా తీసుకునే నిర్ణయమని లతా శ్రీనివాసన్ పేర్కొన్నారు. భారతీయ మూలాలున్న వ్యక్తి కావడం ఒక్కటే ఓటు వేయడానికి ప్రాతిపదిక కాకూడదని, అభ్యర్థి విధానాలు, విలువలు, ప్రజల పట్ల ఆయన లేదా ఆమె వైఖరిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయం ఈ ఎన్నికల సందర్భంగా మరోసారి చర్చకు వచ్చింది.
Next Story
