బీహార్ సీఎం నితీష్ ప్రసంగం బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా?
x

బీహార్ సీఎం నితీష్ ప్రసంగం బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా?

ప్రచారం రక్తి కడితేనే ఓట్లు పడతాయి. లేదంటే జనం నుంచి అటు ప్రత్యర్థుల నుంచి అపహాస్యానికి గురి కావాల్సిందే. బీహార్‌లో నితీష్ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగిస్తారా?


బీహార్‌లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ర్యాలీలు జోరందుకున్నాయి. నేతలు రెచ్చిపోయి ప్రసంగిస్తున్నారు. అయితే నితీష్ ప్రచారం రక్తి కడుతుందా? ఆయన ఓటర్లను ఆకట్టుకునేలా మాట్లాడగలడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన పలు సందర్భాల్లో తడబడ్డారు. ఇటీవల మహాఘట్ బంధన్ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన బీజేపీతో జతకట్టారు. ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడకపోతే అబాసుపాలయ్యే ప్రమాదం ఉంది.

గతంలో నితీష్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) స్టార్ క్యాంపెయినర్‌. బిహార్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించే ముందు బిజెపి నాయకులు అతని అనుమతికి కోరేవారు.

మోదీని నిషేధించినప్పుడు..

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్‌లో ప్రచారం చేయకుండా నితీష్ అడ్డుకున్నారు. బీహార్ డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోదీ ఉండగా.. మరో మోదీ అవసరం లేదని అప్పట్లో అన్నారు. ప్రచారంపై ఒక నిర్ణయం తీసుకుని LK అద్వానీ, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, శత్రుఘ్నసిన్హా, హేమమాలిని వంటి వారిని మాత్రమే రాష్ట్రంలో ప్రచారం చేయడానికి అనుమతించారు.

ముస్లిం ఓటర్లను దూరం చేసుకోకూడదని..2009 లోక్‌సభ ఎన్నికలు, 2010 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ బీహార్ పర్యటనను నితీష్ తీవ్రంగా వ్యతిరేకించారు. బీహార్‌లో మోదీ ప్రచారం చేయడం వల్ల ఆయన హిందుత్వ ఎజెండా కారణంగా ముస్లిం ఓటర్లపై 'ప్రతికూల ప్రభావం' పడే అవకాశం ఉంటుందని బిజెపి నాయకత్వానికి స్పష్టంగా చెప్పారు. ఆ సమయంలో బిజెపికి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న మోదీ గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా 86 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించారు.

మోడీ 2002 గోద్రా అల్లర్ల తర్వాత, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ ఎన్నికల్లోనూ బిజెపి లేదా ఎన్‌డిఎ తరపున ప్రచారం చేయకపోయిన ప్రధాని కాగలిగారు.

పీఎం కావాలనుకున్న నితీష్..

గతంలో నితీష్ ప్రధాని కావాలనుకున్నారు. మోదీ కంటే తనను తాను ఉన్నతంగా భావించారు.వరద బాధితుల కోసం మోదీ రూ.5 కోట్ల సాయం చేసిన సమయంలో నితీశ్ కృతజ్ఞత తెలిపిన ఫొటో ఒకటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా బీహార్ దినపత్రికల్లోని ప్రచురితమైంది.దీంతో కోపోద్రిక్తుడైన నితీష్ బీజేపీ నేతలకు ఇవ్వాల్సిన విందును రద్దు చేసి, ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు.

2010 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ్ గాంధీని బీహార్‌లో ప్రచారం చేయకుండా నితీష్ అడ్డుకున్నారు. 2013లో నితీష్ ఎన్డీయే నుంచి దూరమైన తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాత్రమే మోదీ బీహార్‌లోకి ప్రవేశించగలిగారు.

ఆకట్టుకోని నితీష్ అసంబద్ద ప్రసంగాలు..

ఇప్పుడు నితీష్ ఎన్నికల ప్రసంగాలు పేలవంగా, అసంబద్ధంగా ఉన్నాయి. "గతంలో ఏమీ జరగలేదు.. నేను చాలా పని చేసాను" అని మాట్లాడడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోలేక పోతున్నారు.

నవాడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానితో వేదిక పంచుకున్న నితీష్..4,000 లోక్‌సభ స్థానాల్లో NDA విజయం సాధించాలని నోరుజారారు. చెప్పింది తప్పని తెలుసుకుని చార్ లక్ష (నాలుగు లక్షలు)'అని తడబడ్డాడు. చార్ హజార్ సే భీ జ్యాదా (4,000 కంటే ఎక్కువ)' అని చెప్పడం వినిపించింది.వాస్తవానికి 400లకు పైగా స్థానాలు అని చెప్పుకొస్తున్న ప్రధానికి అసంతృప్తికి గురిచేసింది.

బహిరంగ సభల్లో అతని అసంబద్ధ ప్రసంగాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ప్రత్యర్థులకు అవే విమర్శనాస్త్రాలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో బీజేపీతో చేతులు కలిపే ముందు నుంచే ఆయన అస్థిర ప్రవర్తన స్పష్టంగా కనిపించింది.రాష్ట్ర శాసనసభ ఉభయ సభల్లోనూ పలుమార్లు నోరు జారారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీపై పరుష పదజాలాన్ని వాడి అందరి నోట్లో పడ్డారు.

ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ ఆర్‌జెడితో మహాఘట్‌బంధన్ సంకీర్ణంలో భాగమైనప్పుడు అతను తనను తాను 'మాజీ కేంద్ర హోం మంత్రి' అని పిలిచాడు. ఇది బిజెపి నాయకులను కలవరపరిచింది.

ఇప్పుడు రోడ్‌షోలపైనే దృష్టి..

ఇప్పుడు JD(U)తన ఎన్నికల ప్రచార విధానాన్ని మార్చుకున్కట్లు కనిపిస్తోంది. నితీష్ కొన్ని బహిరంగ సభల్లో మాత్రమే ప్రసంగించనున్నారు. ఎక్కువగా రోడ్‌షోలలో పాల్గొననున్నారు. బహిరంగ సభలో ప్రసంగించాల్సి వస్తే స్క్రిప్ట్‌ను చదువుతున్నారు.

Read More
Next Story