తెలంగాణలో చికెన్ షాపులు ఏప్రిల్ ఒకటి నుంచి బంద్ కానున్నాయా!!!
x

తెలంగాణలో చికెన్ షాపులు ఏప్రిల్ ఒకటి నుంచి బంద్ కానున్నాయా!!!

పౌల్ట్రీ రంగంలో పెద్ద కంపెనీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తమ మార్జిన్ తగ్గించటంతో షాప్ లు నడపలేక పోతున్నామని రిటైల్ ఓనర్స్ అంటున్నారు.


రాష్ట్రంలోని పౌల్ట్రీ రంగాన్ని 24 కంపెనీలు తమ గుప్పిట్లో పెట్టుకుని ధరలను తమ ఇష్టా రీతిన నిర్ణయిస్తున్నాయని రాష్ట్ర చికెన్ షాపుల ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. దీని వలన వినియోగదారులకు అధిక ధరలతో పాటు తమకు మార్జిన్ తగ్గి వ్యాపారాలు చేయలేక ఏప్రిల్ 1 నుంచి బంద్ కు పిలుపు ఇచ్చామని తెలిపారు.

చికెన్ షాపులకు ఇస్తున్న మార్జిన్ పెంచాలని ఎన్ని సార్లు పౌల్ట్రీ కంపెనీలకు చెప్పినా పట్టించుకోవడం అసోసియేషన్ చెప్పింది. ఈ పరిస్థితిలో షాపుల నిర్వహణ చేయలేకపోతున్నామని చెప్పారు.

“పెరిగిన చికెన్ రేట్ల వలన మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మార్జిన్ పెంచే వరకు స్వచ్ఛందంగా బంద్ లో రాష్ట్రంలోని షాపుల యజమానులు పాల్గొంటారు. మా ప్రకటన తరువాత గత మూడు రోజుల్లో చికెన్ రేట్ రు. 80 ఎలా తగ్గింది. ఈ లోపు ఉత్పత్తి ఖర్చులలో మార్పులు వచ్చాయా. ఇది పెద్ద కంపెనీలు చేస్తున్న దోపిడీ,” అని రాష్ట్ర చికెన్ షాపుల ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లుట్ల శేఖర్ ఆరోపించారు.

కోళ్ళ ఉత్పత్తి తగ్గేంత ఎండలు రాలేదని ఆ పరిస్థితి మే, జూన్ ఎండలకు వస్తుందని ఆయన అన్నారు. మార్జిన్ తగ్గించక ముందు కేజీకి రు. 35 నుండి రు. 45 వరకు మిగిలేది. అది ఇప్పుడు రు. 17 పడిపోయింది. దీని వలన షాప్ ల అద్దె, కరెంట్ బిల్లు, నిర్వహణ ఖర్చులు భరించడం కష్టంగా ఉంది. ఆరు నెలల నుంచి ఇబ్బందులు పెరిగాయి. పెద్ద కంపెనీలు ఎవరినీ సంప్రదించరు. వాళ్ళపై ప్రభుత్వ నియంత్రణ లేదు, అని శేఖర్ అన్నారు.

పదేళ్ళ క్రితం ఉండే మార్జిన్ లతో సరి పోలిస్తే ఇప్పుడు కేజీకి రు. 90 తమకు రావాల్సిందని, తమ ఖర్చులు పోను షాప్ యజమానికి జీవించడానికి సరిపడా వచ్చేదని ‘ఫెడరల్’ తో మాట్లాడిన వివిధ చికెన్ షాప్ ఓనర్లు పేర్కొన్నారు.

పౌల్ట్రీలో రాష్ట్రం ఐదవ స్థానంలో ఉండగా, 942 కోట్ల గుడ్ల ఉత్పత్తితో మూడవ స్థాయిలో ఉంది. దేశంలోని ప్రతి ఎనిమిదవ గుడ్డు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోంది. సంవత్సరానికి 20 కోట్ల కోళ్ళను ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ హైదరాబాద్ చుట్టూ ప్రధానంగా కేంద్రీకృతమైంది.

అయితే పౌల్ట్రీ షాపులకు ఎటువంటి నష్టాలు ఉండవని కొంత మార్జిన్ తగ్గి ఉండవచ్చని సొంతంగా కోళ్ళు పెంచి రిటైల్ గా అమ్మే సిద్దిపేట వ్యాపారి భూసాని సుధాకర్ అన్నారు.

1995లో తాను ఈ రంగంలోకి వచ్చేనాటికి ఉత్పత్తి రైతుల ఆధ్వర్యంలో జరిగేదని కాలక్రమంలో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిందని తెలంగాణా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్ అయిన డా. ఐ. బాలసుందరం చెప్పారు.

ప్రస్తుతం ఈ రంగంలో రైతుల స్థానంలో కంపెనీలు స్వయంగా కోళ్ళు పెంచే విధానం ఉనికిలోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఈ వ్యాపారంలో ఉన్న రిస్క్ తో పాటు లాభంలో మార్జిన్ పెంచుకోవాలంటే ఉత్పత్తి అయ్యే కోళ్ళు కంపెనీ వాళ్ళే అమ్ముకోవాలి. దీంతో స్వతంత్రంగా కోళ్ళు పెంచి అమ్ముకునే రైతులు తగ్గారు. ఆ స్థానంలో కంపెనీలు ఇచ్చిన కోడి పిల్లలు, ఫీడ్, తీసుకుని కేజీకి ఇంత అని ముందు నిర్ణయించుకున్న ధర ప్రకారం వాటిని పెంచే కాంట్రాక్ట్ రైతులు ఉనికిలోకి వచ్చారు. దీన్నే పౌల్ట్రీ రంగ పరిభాషలో ఇంటెగ్రేషన్ పద్ధతి అంటున్నారు.

కొత్త రేట్లు గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మొదలైనాయని రిటైల్ యజమానులు వాళ్ళ మధ్య పోటీ వలన ధరలు తగ్గించి అమ్మి మార్జిన్ రావటం లేదంటున్నారని ఇంటిగ్రేటర్ కిషన్ రెడ్డి అన్నారు. “లాభాలు లేకపోతే ఇన్ని నెలలు వ్యాపారం ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు. రిటైల్ వ్యాపారులు సంఘటితం అయ్యి లేరు ఎక్కువ కాలం సమ్మె కొనసాగదు,” అని ఆయన అన్నారు.

ఇందులో రైతుకు రిస్క్ తక్కువ. కోళ్ళు జబ్బులు పడి చనిపోయినా రైతు పెట్టుబడి పెట్టనందున వారి నష్టం లేదు. పైగా సాధారణంగా అయ్యే ఖర్చులు అన్నీ ఇస్తారని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డా. ఎస్. రవీందర్ రెడ్డి అన్నారు.

పరిశ్రమ కన్సాలిడేషన్ అవుతోందని దీనికి ప్రధాన కారణం ఈ రంగంలో లాభాలు ఆర్జించిన వాళ్ళు తిరిగి ఇదే రంగంలో పెట్టడమే అని ఆయన అన్నారు. తమిళనాడు లో 90 నుండి 95 శాతం వ్యాపారం పరిశ్రమగా ఎదిగింది. తెలంగాణ లో 80 శాతం, ఉత్తర భారత దేశంలో 65 నుండి 70 శాతం పౌల్ట్రీ కంపెనీల చేతిలో ఉంది.

ఈ రంగం గత ముప్పై నలభై ఏళ్లుగా ఏటా ఐదు లేదా ఆరు శాతం పెరుగుతోందని రవీందర్ రెడ్డి చెప్పారు. “పౌల్ట్రీ పెరిగిన తరువాతే మొక్కజొన్న రైతులకు లాభాలు వస్తున్నాయి. రైతులకు మద్దతు ఇచ్చేందుకు ధరను ప్రభుత్వాలు పెంచుతుండటంతో ఫీడ్ ధర ఏటా 10 శాతం పెరుగుతోంది. పశ్చిమాసియా లో యుద్ధం వలన గుడ్డు ధర రు. 3.40 కి పడిపోయింది. వాటి ఉత్పత్తి ధర రు. 4.60 నుండి రు. 5. నెల క్రితం వరకు రైతు దగ్గర రు. 6 నుండి రు. 6.5 ఉండగా రిటైల్ లో వినియోగదారులకు రు. 8 కి చేరింది.”

“గుడ్ల వ్యాపారంలో రైతు నుండి వినియోగదారులకు చేరే వరకు వీరి మధ్య ఉండే వ్యాపారస్తులు, హోల్ సేల్, టోకు వ్యాపారులు లాభాలను పంచుకుంటున్నారు. రైతుకు గుడ్డుకు పది పైసలు మాత్రమే వస్తోంది,” అని ఆయన చెప్పారు.

రత్నదీప్ లాంటి స్టోర్లు 25 నుంచి 30 శాతం లాభం పెట్టుకుని గుడ్లు అమ్ముతాయి. రైతుకు రెండు శాతం మార్జిన్ మాత్రమే వస్తోంది. వీటి ఉత్పత్తి లో 60 శాతం కన్సాలిడేషన్ జరిగి కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. అయితే మన ఉత్పత్తిలో ఎగుమతి అయ్యేది కేవలం రెండు లేదా 2.5 శాతం మాత్రమే.

అయినా మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కుంటోందని రవీందర్ అన్నారు.

దేశంలో చికెన్, గుడ్ల వాడకం ఇప్పటికీ తక్కువగా ఉందని చాలా మందికి రోజుకు అవసరమైన 60 గ్రాముల ప్రోటీన్ అందటం లేదు. గుడ్లు అతి చౌక అయిన ప్రోటీన్ ఆహారం. తరువాత బెస్ట్ చికెన్. ఉత్పత్తి పెరిగినట్టు వాడకం పెరగటం లేదని అందు కొరకు వాటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నామని రవీందర్ రెడ్డి అన్నారు.

Read More
Next Story