తమిళనాడులో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుస్తారా?
x

తమిళనాడులో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుస్తారా?

కాంగ్రెస్ అభ్యర్థుల ఆశలు సన్నగిల్లుతున్నాయా? అంతర్గత కుమ్ములాటలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు సహకరించకపోవడం అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నాయా?


తమిళనాట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలు, అభ్యర్థులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు సహకరించకపోవడం, పార్టీ సీనియర్ నేతలు ఎన్నికల బరికి దూరంగా ఉండడం కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో మోదీ విస్తృత ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థులను కలవరపెడుతోంది. గెలుస్తామా? అన్న అనుమానం వారి మనసుల్ని తొలుస్తోంది.

ఎవరు, ఎక్కడ పోటీ చేస్తున్నారు?..

తమిళనాడులోని తిరువళ్లూరు, కృష్ణగిరి, కరూర్, కడలూరు, మైలదుత్తురై, శివగంగై, విరుదునగర్, తిరునెల్వేలి, కన్నియాకుమారి - తొమ్మిది నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌, పొత్తులో భాగంగా పుదుచ్చేరిలోని ఒక నియోజకవర్గం నుంచి డీఎంకే పోటీ చేస్తోంది.

శివగంగ నుంచి కార్తీ చిదంబరం, కరూర్‌ నుంచి ఎస్‌ జోతిమణి, కన్నియాకుమారి నుంచి విజయ్‌ వసంత్‌, విరుదునగర్‌ నుంచి మాణికం ఠాగూర్‌, పుదుచ్చేరి నుంచి వీ వైతిలింగం సహా రాష్ట్రానికి చెందిన ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీలను పార్టీ బరిలోకి దింపింది. తిరువళ్లూరు నియోజకవర్గంలో మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్, కడలూరు నుంచి ఎంకే విష్ణుప్రసాద్, మైలాడుతురై నుంచి ఆర్ సుధ, తిరునల్వేలి నుంచి రాబర్ట్ బ్రూస్, కృష్ణగిరి నుంచి కే గోపీనాథ్ ఉన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాల్లో విజయం సాధించి 33 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ విషయానికొస్తే, అది పోటీ చేసిన తొమ్మిది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి 12 శాతం ఓట్లను సాధించింది.

కష్టాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు..

అయితే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అంత సులభం కాదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ప్రచారం నుంచి వెనక్కు వెళ్లేలా చేసిన పరిస్థితులున్నాయి.

ఉదాహరణకు.. కరూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జోతిమణి దిండిగల్‌లో కొందరు వ్యక్తులు ఆమె కారును ఆపడంతో ప్రచారం నుంచి వెళ్లిపోయిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈసారి అత్యధిక సంఖ్యలో పోటీదారులు ఉన్న నియోజకవర్గం కరూర్ . ఇక్కడి నుంచి ఈసారి 54 మంది బరిలో ఉన్నారు .

కార్తీ చిదంబరాన్ని రెండోసారి పోటీకి దింపడంపై కాంగ్రెస్ పార్టీ శివగంగ యూనిట్ చేసిన తీర్మానం కూడా ఈ నియోజకవర్గంలో బురదజల్లింది.

ఉత్తర భారతదేశంలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు ఆయన తండ్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. తిరునెల్వేలి నియోజకవర్గ విషయానికొస్తే పార్టీ సభ్యులలో పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత రాబర్ట్ బ్రూస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో సొంత పార్టీ సభ్యుల మద్దతు పొందేందుకు ఆయన కష్టపడుతున్నాడు.

ఇటీవల విరుదునగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మాణికం ఠాగూర్ ఎన్నికల ప్రచారంలో డబ్బు పంచుతున్నవీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీన్ని బిజెపి ప్రచారాస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌ను బీజేపీ పోటీకి దింపింది.

కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని కాపాడుకోవడంతోపాటు అన్ని సీట్లను గెలుచుకోవడంపై చాలా సీరియస్‌గా వ్యవహరించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు అందించడంలో విఫలమైందని డీఎంకే ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు డీఎంకే ప్రభుత్వం మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సాయం చేస్తుందని, నీట్ CAA సమస్యల గురించి ఓటర్ల దగ్గర ప్రస్తావిస్తున్నారు.

జె జయలలిత, కె కరుణానిధి మరణానంతరం తమిళనాడుకు మోదీయే ఏకైక నాయకుడని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇతర ప్రాంతాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆ పార్టీ నాయకులు, అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.

పునర్నిర్మాణం అవసరం..

కాంగ్రెస్ యువతను సమీకరించడంలో విఫలమైందనే చెప్పాలి. కార్తీ చిదంబరం ఇదే విషయాన్ని బహిరంగంగా మాట్లాడారు. యువ ఓటర్లను ప్రధాని మోదీ ఆకర్షించే విధానం, మోదీ సోషల్ మీడియా వ్యూహాలను ఆయన ప్రశంసించారు. కార్తీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తనను తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి.

ఎన్నికల ప్రచార సమయంలో అంతర్గత పార్టీల కుమ్ములాటలు, కాంగ్రెస్ అభ్యర్థులను ఓటర్లు దూరంగా ఉంచడంపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శ్రీనివాసన్‌ ఫెడరల్‌తో మాట్లాడుతూ.. డీఎంకే-కాంగ్రెస్‌ కలయికలో అత్యధిక స్థానాలు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి జోతిమణి ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బాగా రిసీవ్ చేసుకుంటున్నారని తెలిపారు. తన ప్రత్యర్థులు కొన్ని చోట్ల తనకు వ్యతిరేకంగా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారని, తనను ఫాలో అవ్వడం, రెండు చోట్ల తన సమావేశాలకు అంతరాయం కలిగించడాన్ని గమనించానని చెప్పారు. "వారి ప్రవర్తనపై మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. నేను ప్రజల కోసం పనిచేశాను. గెలుస్తానని నమ్మకం ఉంది. నేను ఎంపీగానే కాకుండా, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే కాంగ్రెస్ కార్యకర్తగా కూడా తెలుసు.’’ అని జోతిమణి చెప్పారు.

Read More
Next Story