తెలంగాణ బడ్జెట్ లో ఈసారైనా విద్యకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా!!!
x

తెలంగాణ బడ్జెట్ లో ఈసారైనా విద్యకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా!!!

ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ బడ్జెట్ లో 15 శాతం కేటాయించాలని విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి


*తెలంగాణ ఏర్పడే నాటికి (2014) ప్రభుత్వ పాఠశాలల్లో 32 లక్షలుగా ఉన్న విధ్యార్థుల సంఖ్య నేడు 16 లక్షలకు పడిపోయింది.

*విద్యకు ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ లో 16 శాతం ఉన్న కేటాయింపు బిఆర్ఎస్ పదేళ్ళ పాలనలో 6.57 శాతానికి దిగజారింది.

*2023-24 నాటికి ఏడు సంవత్సరాలు అంతా కంటే ఎక్కువ వయసు ఉన్న అక్షరాస్య విద్యార్థులు 77 శాతం మాత్రమే. కాగా దేశంలో వారి శాతం 81.

*నేటికీ రాష్ట్ర జనాభాలో నాలుగో వంతు నిరక్షరాసులే.

*రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉండిపోవటంతో తమకు సమస్యలు చెప్పుకునే అవకాశం రావటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానానికి అనుగుణంగా విద్యకు తగినన్ని నిధులు కేటాయించాలని విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. రెండవ బడ్జెట్ లోనూ కేవలం 0.8 శాతం మాత్రమే నిధులు పెంచిన ప్రభుత్వం ఇకనైనా తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

అధికారం చేపట్టిన తరువాత మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న సందర్భంలో ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ బడ్జెట్ లో 15 శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 2025-26 కు గాను దేశంలోని వివిధ రాష్ట్రాలు విద్యకు సరాసరి 15 శాతం కేటాయించగా, తెలంగాణ 8.3 శాతమే కేటాయించింది.

“బిఆర్ఎస్ మూసి వేసిన 6,000 స్కూల్స్ ను తెరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరో 1,441 మూసేందుకు సిద్దం అవుతోంది. ఎన్నో ఆశలతో విశ్రాంత ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ కమీషన్ కు స్వాతంత్ర్యం ఇవ్వకుండా రాజకీయ నాయకుడు కేశవ రావు తో మరో కమిటీ పెట్టారు. యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభం, స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం లాంటి అతి పెద్ద నిర్ణయాలలో కమీషన్ పాత్ర లేదు. దాదాపు లక్ష మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలకు మార్కెట్లోకి వస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ సంవత్సరానికి కేవలం 1,000 మందికి శిక్షణ ఇస్తుంది. ఉన్న సంస్థలను స్కూల్స్ ను అభివృద్ది చేయకుండా కొత్త సంస్థలను స్థాపించడం ఎందుకు,” అని ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కె. వేణుగోపాల్ ప్రశ్నించారు.

యంగ్ ఇండియా స్కూల్స్ కు రు. 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు తగినట్టుగా బడ్జెట్ లో నిధులు పెంచలేదు. వాటిలో విధ్యార్థులను ఏ ప్రాతిపదిక మీద చేర్చుకుంటారు. టీచర్ లను కొత్తగా నియమిస్తారా. పాత గురుకుల స్కూల్స్ ను వీటికి మారుస్తారా లాంటి విషయాలపై స్పష్టత లేదు. వాటి నిర్మాణానికి అవసరమైన అప్పులు తెచ్చుకోవటానికి కేంద్రాన్ని అనుమతి కోరారు. లేదా కంపెనీలు ఇచ్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఆహ్వానిస్తున్నారు. విద్యారంగానికి శాశ్వత ప్రాతిపదిక మీద నిధులు కేటాయించాలి, మానవ వనరులను అభివృద్ది చేయటానికి ప్రభుత్వం పెట్టుపడి పెట్టాలి,” అని ఆయన నిధుల కేటాయింపులో ఉన్న సమస్యలను ఎత్తి చూపారు.

సుప్రీం కోర్టు ఉన్నత విద్యా సంస్థలలో అధ్యాపకులను నియమించాలని సూచించింది, ఆ వైపు ప్రభుత్వ ప్రయత్నాలేవీ అని ఆయన నిలదీశారు. కేంద్రం తెచ్చిన నూతన విద్యా విధానం (New Education Policy) పై కేంద్ర నాయకత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే రాష్ట్రం ఆ విధానంపై నామమాత్రపు వ్యతిరేకత వ్యక్తం చేయటం లేదు. తమిళ నాడు, కేరళ నిరసన తెలపడం తో వాటికి నిధుల కోత విధిస్తున్నారు.

తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గిపోవడంతో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. “మండల, జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు అవసరమైన ఎడ్యుకేషన్ అధికారుల కొరతతో టీచర్ల పైన పర్యవేక్షణ లేదు. సాంకేతికత ఉపయోగించి స్కూల్ లో వాళ్ళ హాజరు తీసుకుంటున్నారు. దీని వలన టీచర్ల స్కూల్ ఎగవేత తగ్గినా సరిగ్గా పాఠాలు చెప్తారనే భరోసా లేదు. ప్రిన్సిపాల్ లకే మండల విద్యాధికారిగా అదనపు భాద్యతలు ఇవ్వటంతో వారికి పై అధికారులు అడిగే సమాచారం ఇవ్వడానికే వారి సమయం సరిపోతోంది,” అని ఆయన తెలియ చేశారు.

2045 స్కూల్స్ లో విద్యార్థులు లేరు, 1,441 పాటశాలల్లో టీచర్లు, విద్యార్థులు లేరు, 1,600 స్కూల్స్ లో ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు లేరు. ఇలా మిగిలిన టీచర్స్ ను వేరే స్కూల్స్ కు సర్దుబాటు చేశారు కానీ పిల్లలు ఎందుకు లేరు అని తగిన చర్యలు లేవు. అవి మూత పడినట్టే, అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సెస్ ఇటీవల జారీచేసిన రిపోర్ట్ లోని ముఖ్యాంశాలు:

20 వ శతాబ్దం మొదట్లో కేవలం మూడు శాతం ఉన్న అక్షరాశ్యత 1951 నాటికి 12 శాతానికి మాత్రమే పెరిగింది. హైదరాబాద్ ను మినహాయిస్తే ఆ శాతం ఎనిమిది మాత్రమే. దీనికి స్థానిక భాషలో విద్య లేకపోవటమే ప్రధాన కారణం. ఈ చారిత్రక అననుకూలత నుండి మొదలై ఉమ్మడి రాష్ట్రంలోనూ 1980, 1990 లలో మాత్రమే అక్షరాశ్యత పెరిగింది. అయినా 2023-24 నాటికి ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అక్షరాస్య విద్యార్థులు 77 శాతం మాత్రమే. నేటికీ రాష్ట్ర జనాభాలో నాలుగో వంతు నిరక్షరాసులే. 51 శాతం వయోజనులు మాత్రమ సెకండరీ విద్య లేదా అంత కంటే ఎక్కువ చదువుకున్నారు. గ్రాడ్యూయేట్లు 18 శాతమే.

అక్షరాస్యత శాతంలో వెనుకబడినా ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డైరెక్టరీ 2025 ప్రకారం తెలంగాణ లో 41 విశ్వవిద్యాలయాలు లేదా ఆ స్థాయి విద్యాసంస్థలు (ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో) ఉన్నాయి. అల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (2021-22) రిపోర్ట్ ప్రకారం ఉన్నత విద్యలో 1.6 మిలియన్ల విద్యార్థులు ఉన్నారు. ప్రతి లక్ష మంది కాలేజీ విద్యార్థులకు సరాసరి అందుబాటులో వుండే ఉన్నత విద్యా సంస్థలలో రాష్ట్రం మూడవ స్థానంలో వుంది. కర్ణాటక, పుదుచ్చేరి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఉన్నత విద్యా సంస్థలలో రాష్ట్రంలో స్థూల నమోదు నిష్పత్తి 40 శాతం. ఇది జాతీయ సగటు 28.4 శాతం కంటే 11.6 శాతం ఎక్కువ. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉంది.

రాష్ట్రం జీఎస్డీపీలో విద్యపై చేస్తున్న ఖర్చులో, బడ్జెట్ లో శాతంగా విద్య కు కేటాయింపులో, విద్యపై పెట్టే మొత్తం ఖర్చులో ఉన్నత విద్య పై చేసే కేటాయింపులో తెలంగాణ అఖిల భారత సరాసరి కంటే వెనుకబడి వుంది.

తెలంగాణ లో ఉన్నత విద్యపై ప్రైవేట్ వ్యక్తులు పెట్టే ఖర్చు పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం 2017-18 నాటికి అది సరాసరి రు. 30,423 కు చేరింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువే. ఉన్నత విద్య కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తోంది. ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై పెడుతున్న సరాసరి ఖర్చు రు. 33,975. ప్రైవేట్ వ్యక్తులు రు. 4,320 కోట్లు ఖర్చు పెట్టగా ప్రభుత్వం రు. 4,798 కోట్లు వ్యయం చేసింది. ఉన్నత విద్యపై కుటుంబాలు పెడుతున్న ఖర్చు 47.6 శాతం కాగా, ప్రభుత్వం 52.4 శాతం వెచ్చిస్తోంది. ప్రైవేట్ వ్యయంలో 82 శాతం కుటుంబాలు ఖర్చు చేస్తుండగా ప్రభుత్వ స్కాలర్షిప్ ల ద్వారా వారికి 12 శాతం లభిస్తోంది. యిది దేశలోని సగటు కుటుంబ వ్యయం 93 శాతం కంటే తక్కువ.

ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం ఉన్న గ్రాడ్యూయేట్ లలో జాతీయ సగటు 50 శాతం మాత్రమే. తెలంగాణ లోని గ్రాడ్యూయేట్ లు మరింత మెరుగ్గా ఉన్నారని సెస్ లో ప్రొఫెసర్ వెంకటనారాయణ మోటుకురి, సెస్ డైరెక్టర్ ఈ. రేవతి వ్రాసిన రిపోర్ట్ చెప్పింది.

ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల వెతలు:

సంవత్సరానికి రు. 2,500 కోట్లు మా కాలేజీలకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. పేరుకు పోయిన ఈ బకాయీలు దాదాపు రు. 5,000 కోట్ల నుండి రు. 6,000 కోట్ల వరకు ఉంటాయని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణ చెప్పారు.

బకాయిల చెల్లింపుకు ఒక రోడ్డు మ్యాప్ విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఎస్సీ, ఎస్టీ విధ్యార్థుల ఖర్చులు 40 శాతం రాష్ట్రం చెల్లిస్తే కేంద్రం మిగిలిన 60 శాతం విడుదల చేస్తుంది. కేంద్రం నిధులను విద్యార్థుల ఖాతాలలోకి డబ్బు వేయటంతో వాళ్ళు మాకు చెల్లించటం ఆలస్యం అవుతోంది. ఈ నిధులు 2023-24 వరకు పూర్తిగా వచ్చిన 2024-25 కు పాక్షికంగానే చెల్లించారు, అని ఆయన చెప్పారు.

విద్యార్థి సంఘాలు:

“చాలా గురుకులాలు ప్రైవేట్ బిల్డింగ్స్ లో, సరైన వసతులు లేకుండా ఉన్నాయి. గత ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. విద్యా శాఖ ముఖ్యమంత్రి దగ్గరే వుండటంతో సమస్యలు చెప్పటానికి కుదరటంలేదు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేసి స్కాలర్షిప్ రాక పోతే కట్టించుకుంటున్నారు. విశ్వవిద్యాలయాలలో టీచర్ల నియామకాలు జరగటం లేదు,” అని అఖిల భారత్ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ చెప్పారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని బకాయిలతో మాకు సంబంధం లేదు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని లక్ష్మణ్ అన్నారు.

స్కాలర్షిప్ ల జారీ లో జాప్యం తదితర సమస్యలతో వాటికోసం ధరఖాస్తు చేసే వారి సంఖ్య 12 లక్షల నుంచి 6,75,000 కు పడిపోయిందని విద్యార్థి జేఏసీ ఛైర్మన్, వేముల రామకృష్ణ చెప్పారు. "కాలేజీలు ఫీజు గురించి అందరి ముందు ప్రశ్నించటంతో విద్యార్థులు హాజరు తగ్గి పరీక్షలను రాయలేకపోతున్నారు. కాలేజీలు ఫీజు చెల్లించని వారికి గ్రేస్ మార్కులు, ప్రాక్టికల్స్ లో మార్కులకు లింక్ చేసి వివక్ష చూపి ఫీజులు వసూలుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో స్కాలర్‌షిప్ జారీపై నమ్మకం లేక ఈ సారి గడువు తేదీ లేపు కేవలం సగం మంది విద్యార్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకున్నారు,” అని రామకృష్ణ వివరించారు.

బకాయిలు రు. పది నుండి రు. పన్నెండు వేల కోట్లు వరకు ఉంటాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్వంత బిల్డింగ్స్ లోకి మారుస్తాము అంటున్న ప్రభుత్వం గురుకుల, సంక్షేమ హాస్టల్స్ లకు స్వంత బిల్డింగ్స్ కట్టాలి, అని డిమాండ్ చేశారు.

మేధావుల అభిప్రాయం:

“విద్యకు బడ్జెట్లో 15 కేటాయించి తగిన ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో లో పెట్టింది. రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కొఠారి కమీషన్ 30 శాతం కేటాయించాలని 1960 లలోనే చెప్పింది. చదువుకున్న నైపుణ్యం ఉన్న మానవ వనరుల వలన జీడీపీ రెండు శాతం అదనంగా పెరుగుతుంది. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ తరపున మేము 20 మంది సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి కేటాయింపులు పెంచమని కోరాం. ఆయన స్పందన చూసి 10 శాతం అయిన కేటాయిస్తారని ఆశించాము. కేవలం 0.7 శాతం మాత్రమే పెంచారు,” అని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ జనరల్ సెక్రెటరీ జీ. హరగోపాల్ చెప్పారు.

స్కూల్ లేదా కాలేజీలు ప్రారంభించటం కంటే ప్రజల చేతికి డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయి అని నాయకులు ఆలోచిస్తున్నారు. మన ప్రాధాన్యతలు అభివృద్ది నమూనా మారాలి. సంపద కొంత మంది దగ్గర పొగుపడితే సమాజంలో అశాంతి పెరుగుతుంది, అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“బీమారు (BIMARU) రాష్ట్రాలుగా పేరు పడ్డ బీహార్ కూడా బడ్జెట్ లో 18 శాతం విద్యకు కేటాయిస్తోంది. తెలంగాణ లో లెర్నింగ్ లెవెల్స్ పడిపోతున్నాయి. స్కిల్ యూనివర్సిటీ పెట్టి దానికి పారిశ్రామిక వేత్తను ఇన్‌ఛార్జ్ చేశారు. అభివృద్ది అంటే తలసరి ఆదాయం పెరగటం కాదు. మానవ వనరులు అభివృద్ది కాకుండా ఏ దేశం అభివృద్ది కాదు. విద్య సామాజిక మార్పుకు తోడ్పడాలి,” అని విశ్రాంత హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు.

విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకానికి ఎటువంటి ప్రయత్నాలు జరగటం లేదు. బిఆర్ఎస్ హయాంలో ఐఎఎస్ లను వీసీ లుగా నియమిస్తే వీళ్ళు వచ్చి విద్యావేత్తలను నియమించారు, అని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు, బి. మనోహర్ వివరించారు. “నియామకాలు జరగాలంటే విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఏర్పాటు కావాలి. అవి లేకుండా ఆ ప్రక్రియ చేయడానికి వీలు లేదు. రిక్రూట్మెంట్ కు ముందు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలి. అందుకు తగిన ప్రయత్నాలు లేవు,” అని ఆయన చెప్పారు.

కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ చార్జీల పరిస్థితి:

రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో ఆర్భాటంగా ప్రకటించిన డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీల పెరుగుదల వలన పరిస్థితి లో పెద్దగా మార్పు లేదని మధ్యాన్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర నాయకురాలు ప్రేమ్ పావని చెప్పారు.

2017 నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పెంచకపోవటంతో పెరిగిన ధరలకు అనుగుణంగా పెరుగుదల లేదని ఆమె అన్నారు. “మార్కెట్ లో గుడ్డు ధర ఎనిమిది రూపాయలు ఉంటే ఆరు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ సమస్యవలన మాకు అంగన్వాడీ సెంటర్ లకు పంపినట్టే సరఫరా చేయాలని కోరాము. గుడ్డు డబ్బులు చాలా జిల్లాలలో నెలల తరబడి చెల్లించాల్సి ఉంది. ప్రాథమిక స్కూల్ విద్యార్థుల మధ్యాన్న భోజనానికి రోజుకు పెట్టె ఖర్చు రు. 6.78, అప్పర్ ప్రైమరీ స్కూల్ లకు రు. 10.17. వీరికి వారానికి ఇచ్చే మూడు గుడ్లకు రు. 18 ఇస్తారు. తొమ్మిది, పది తరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే వారానికి మూడు గుడ్ల ఖర్చుతో సహ రు. 13.17 ఇస్తుంది. ఒకటి నుండి ఎనిమిది తరగతుల విద్యార్థులకు అయ్యే ఖర్చులో 40 శాతం కేంద్రం భరిస్తుంది. 60 శాతం ఉన్న కేంద్ర వాటాను తగ్గించారు,” అని పావని వివరించారు.

వీరికి ఈఎస్ఐ కార్డు లేకపోవటంతో వంట చేసే సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగినా ఎటువంటి వైద్య సహాయం అందదు. కొడంగల్ లాంటి కొన్ని చోట్ల అక్షయ ఫౌండేషన్ లాంటి వారికి భోజనం సప్లయ్ చేసే కాంట్రాక్ట్ ఇచ్చి వీరిని తీసివేస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఇదే పని చేసే వారు కూడా పని కోల్పోయారు.

ఏప్రిల్ 2024 వరకు ఈ కార్మికుల జీతం కేవలం రు. 1,000 మాత్రమే. జూన్ 2024 లో బిఆర్ఎస్ ప్రభుత్వం వారి జీతం రు. 3,000 చేసింది. కాంగ్రెస్ వాళ్ల జీతాన్ని రు. 10,000 చేస్తామని ఎన్నికలలో వాగ్దానం చేసింది. వీరికి సంవత్సరానికి 10 నెలలు మాత్రమే జీతాలు ఇస్తారు. మిగిలిన రెండు నెలలు రాష్ట్రం, కేంద్రం రెండు ఇవ్వవు.

“శిలా విగ్రహాలకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలకు వీరికి ఇచ్చేందుకు మనసు ఒప్పదు. వాళ్ళకు మేలు చేయాలనే రాజకీయ సంకల్పం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పెట్టాలంటే రోజుకు రు. 25 ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. గ్రీన్ చానెల్ లో కార్మికులకు జీతాలు ఇస్తామని చెప్పారు కానీ ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితి ఉంది. కేంద్రం జారీ చేసిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 జరిగే సమ్మెలో వంట కార్మికులు పాల్గొంటారు,” అని పావని చెప్పారు.

“రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40 శాతం పెంచినా ఈ పెంపు సరిపోదు. 2017 నుండి 2024 మధ్య ఈ ఛార్జీలను పెంచలేదు. ఈ కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 50 శాతం పైబడి ఉన్నందున ఈ పెంపు సరిపోదు. పౌర సరఫరాల శాఖ వీరికి బియ్యం మాత్రమే ఇస్తుంది. మిగిలిన కూరగాయలు ఆహార ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయినా వాటిని వంట కార్మికులు కొనక తప్పదు. పప్పు ధర 2017 లో రు. 3,500 నుండి 2024 లో రు. 8,000 కు పెరిగింది,” అని సెస్ లో ప్రొఫెసర్ అయిన వెంకటనారాయణ మోటుకురి అభిప్రాయపడ్డారు.

Read More
Next Story