జార్ఖండ్‌ సీఎం చంపాయీ సోరెన్‌ విశ్వాస పరీక్ష నెగ్గేనా?
x

జార్ఖండ్‌ సీఎం చంపాయీ సోరెన్‌ విశ్వాస పరీక్ష నెగ్గేనా?

జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపాయి సోరెన్‌ ఈ రోజు (ఫిబ్రవరి 5) తన బలాన్ని నిరూపించుకో బోతున్నారు.


జేఎంఎం నేత చంపాయీ సోరెన్‌ శాసనసభలో నేడు బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. గత ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రూ. 600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డాడని, ఆ వచ్చిన డబ్బును విదేశాలను తరలించాడని ఈడీ అతనిపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న చంపాయీ సోరెన్‌ సీఎం పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ ఫిబ్రవరి 2న ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అలింఘర్‌ ఆలం, ఆర్జేడీ నేత సత్యానంద్‌ కూడా అదే రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా 10 రోజుల్లోగా అసెంబ్లీలో చంపాయీ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలు..

ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు జేఎంఎం తమ 38 మంది ఎమ్మెల్యేలను ఈనెల 2న హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించిన విషయం తెలిసిందే. వారంతా ఆదివారం సాయంత్రం తిరిగి జార్ఖండ్‌ రాజధాని రాంచీకి చేరుకున్నారు. వెంటనే వారిని రెండు బస్సులో నగరంలోని సర్యూట్‌ హౌస్‌కు తరలించారు.

విశ్వాస పరీక్షపై ధీమా..

‘‘మేం బలపరీక్షలో తప్పక నెగ్గుతాం.మాకు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉంది’’ అని మంత్రి అలింగిర్‌ ఆలాం తెలిపారు. జేఎంఎం మరో నేత మిథిలేష్‌ ఠాకూర్‌ కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం మాకు మద్దతు తెలుపుతారని పేర్కొన్నారు.

నమ్మకం లేకనే హైదరాబాద్‌కు తరలింపు..

కాగా బీజేపీ చీఫ్‌ విప్‌ బిరంచి నరేన్‌ జేఎంఎం సంకీర్ణం విశ్వాసపరీక్షను నెగ్గలేదని చెబుతున్నారు. తమ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోవడంతోనే వారిని హైదరాబాద్‌కు తరలించారని గుర్తు చేశారు.

ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ నిన్నటి సాయంత్రం (ఫిబ్రవరి 4న) తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైంది.

‘‘చాంపాయి సోరెన్‌ అధికార పగ్గాలు చేపడితే.. హేమంత్‌ సోరెన్‌ పాలనను తలపిస్తుంది. అవినీతి, కుంభకోణాలను మళ్లీ చూడాల్సి వస్తుంది’’ అని బిరంచి నరేన్‌ పేర్కొన్నారు.

వీడియో విడుదల..

బల నిరూపణకు సిద్ధమంటూ.. జేఎంఎం సంకీర్ణం ఒక వీడియోను విడుదల చేసింది. 81 మంది ఎమ్మెల్యేలలో 43 మందితో విశ్వాసపరీక్ష నెగ్గుతామని అందులో ఉంది.

అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే.. జార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు - 81. మ్యాజిక్‌ ఫిగర్‌ - 41. జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి బలం - 47. బయటి నుంచి సీపీఐఎంఎల్‌ ఎమ్మెల్యే ఒకరు మద్దతు ఇస్తున్నారు.

పార్టీల వారీగా ఎమ్మెల్యేల సంఖ్య..జేఎంఎం - 29, కాంగ్రెస్‌ - 17, ఆర్‌జేడీ -1, బీజేపీ - 26, ఏఎస్‌జేయూ - 3, ఎన్‌సీపీ -1, సీపీఐ (ఎంఎల్‌) - 1, ఇండిపెండెంట్లు - 2 ఉన్నారు.

Read More
Next Story