కాంగ్రెస్ నేతల బుజ్జగింపుతో మమత మెట్టు దిగుతుందా?
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన భారత కూటమికి బీటలు వారాయి. ఒక్కొక్క పార్టీ కూటమి నుంచి దూరమవుతున్నాయి.
భారత కూటమిలో ప్రధాన భాగస్వామి టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల ఆమె ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. దీంతో ఆమెను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్.
కాగా సీట్ల పంపకాల్లో నెలకొన్న అసమ్మతిని కాంగ్రెస్ అధిగమిస్తుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘‘భారత కూటమికి ముఖ్యమైన స్తంభాల్లో మమతా జీ ఒకరు. బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆమె అవసరమని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. అసలు బెనర్జీ లేకుండా భారత కూటమిని ఊహించలేం. మా నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు కూడా మమతా జీ అంటే ఎంతో గౌరవం’’ అని అన్నారు.
గురువారం ఉదయం బెంగాల్‌లోకి ప్రవేశించిన రాజీవ్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనాల్సిందిగా బెనర్జీని పార్టీ ఆహ్వానించినటు జైరాం రమేష్ తెలిపారు.
రాహుల్ యాత్ర సమాచారం ముందస్తుగా తెలపకపోవడంపై మమతా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ మిత్రపక్షాలైన సీపీఐ(ఎం), వామపక్ష పార్టీలు, పాదయాత్రలో పాలుపంచుకోనున్నాయి.
మమతా ఆగ్రహానికి కారణాలేంటి?
సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రాకపోవడం, రాహుల్ పాదయాత్ర గురించి ముందస్తు సమాచారం లేకపోవడం కారణంగానే మమతా కూటమి దూరమైనట్లు తెలుస్తోంది.
‘‘మమతా జీతో నాకు మంచి అనుబంధం ఉంది. రెండు పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మా మధ్య దూరాన్ని పెంచలేవు’’ అని రాహూల్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే మమతా ఒంటరిపోరుపై నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
కాగా తాము వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఇటీవల బుర్ద్వాన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.‘‘సీట్ల సర్దుబాటుపై నాతో ఎవరూ చర్చించలేదు. నా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. ఇక మనం ఒంటరిగానే పోరాడుదాం’’ అని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.
తృణమూల్ బాటలోనే ఆమ్‌ఆద్మీ పార్టీ..
టీఎంసీ బాటలోనే ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా అనుసరిస్తుంది. కూటమికి ఆ పార్టీ కూడా దూరమైనట్టే కనపడుతుంది. పంజాజ్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్ మాన్ ప్రకటించారు. పంజాబ్‌లో మొత్తం 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి.
నితీష్ కూడా..
తృణమూల్, ఆమ్‌ఆద్మీ పార్టీల వైఖరి పసిగట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం కూటమి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి ఎన్డీఏతో చేతులు కలుపుతారని సమాచారం.
కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 29న బిహార్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనరని ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇండియా కూటమిలో తనను కన్వీనర్‌గా ప్రకటించకపోవడం నితీష్ కుమార్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తుంది. ప్రధాని అభ్యర్థిని సైతం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.