నరేగా చట్టంలో మార్పుతో పని హక్కు హుళక్కేనా!!!
x

నరేగా చట్టంలో మార్పుతో పని హక్కు హుళక్కేనా!!!

కేంద్రం పని దినాలను పెంచామని చెప్తున్నా, ఆర్థిక భారం భరించలేని రాష్ట్రాలతో పథకం అమలు కష్టమే అని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు


ఉపాధి హామీ చట్టానికి కేంద్రం మార్పులు చేస్తున్న తరుణంలో దానిపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. కొత్త చట్టం వీబీజేఎ రామ్ (VB-G Ram-G) పనిని హక్కుగా కల్పించిన నరేగాను (NREGA) నీరుగార్చే ప్రయత్నం అని అవి ఆక్షేపిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం పని రోజులు 100 నుండి 125 కు పెంచామని చెప్తోంది. రాష్ట్రాలు యిది తమపై భారాన్ని పెంచుతుందని అంటున్నాయి. యిప్పటికే అప్పులలో కూరుకుపోయిన అనేక రాష్ట్రాలు 125 రోజుల పని కలిపించే పరిస్థితిలో లేవని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

నూతన ఆర్థిక విధానాల అమలులో భాగంగా ప్రభుత్వం సామాజిక బాధ్యతలైన విద్య, వైద్యం నుంచి మెల్లగా తన భాధ్యత తగ్గించుకుంటున్న పరిస్థితిలో ప్రజల నుండి వస్తున్న నిరసనలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (United Progressive Alliance) ప్రభుత్వం, నరేగా, ఆర్టీఐ, అటవీ హక్కుల చట్టం (Forest Rights Act), జాతీయ ఆహార భద్రతా చట్టాలను (National Food Security Act) తీసుకొచ్చింది. పాలన పారదర్శకంగా వుండాలని ఆర్టీఐ, గిరిజన హక్కుల కోసం అటవీ హక్కుల చట్టం లాంటి చట్టాలు వచ్చాయి. 2014 తరువాత ఈ చట్టాలకు మార్పులు చేర్పులు చేసింది బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఈ మార్పుల పరంపరలోనే నరేగా చట్టం స్థానంలో వీబీజేఎ రామ్ (VB-G Ram-G) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. యిది నరేగా చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని పని అడిగే ప్రాధమిక హక్కును యిది కాలరాస్తుందని, నిర్దేశిత ప్రాంతాలకు పరిమితం చేయటం ద్వారా రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపేందుకు అవకాశం కలుగుతుందని, పీక్ సీజన్లో పనిని కల్పించకుండా వుండటం వలన వ్యవసాయ కూలీలకు యిన్నిరోజులు వుండిన వేతనాలు పెంచుకునే వెసులుబాటు పోతుందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో నరేగా పై అధ్యయనం చేసిన లిబ్ టెక్ ఇండియా సంస్థ సీనియర్ పరిశోధకులు చక్రధర్ బుద్ధ, ఈ విషయం పై ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడారు:

1. నరేగా (NREGA) పథకం UPA ప్రారంభించిన సమయంలో వున్న పరిస్థితి ఏమిటి?

2005లో చట్టం వచ్చేనాటికి 2004 లో జరిగిన ఎన్నికలలో ఇండియా షైనింగ్ క్యాంపైన్ తో ముందుకు వచ్చిన ఎన్డిఏ యూపీఏ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అలా అధికారంలోకి వచ్చిన యూపీఏ కార్పొరేట్లకు కాకుండా ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తాము అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టైమ్ లోనే పనిని హక్కుగా కల్పించాలని రాజస్థాన్ కేంద్రంగా మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. యిదే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. ఇందులోనుండే ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వచ్చాయి. అయితే చట్టం తెచ్చేముందు కేంద్రంలోని యూపీఏ జాతీయ సలహా మండలి ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చ జరిగింది. యిలా ముందు ఎన్నడు జరగలేదు. ఈ మండలిలో రిటైర్డ్ ఐఎఎస్ అరుణ రాయ్, జీన్ డ్రేజ్ లాంటి ఆర్థికవేత్తలు వున్నారు. వారు యిలాంటి చట్టాల అమలులో ఫీల్డ్ లో వచ్చే సమస్యల గురించి అవగాహన వున్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలోనే ఈ నరేగా చట్టం రాకూడదు అని ఒక లాబీ కోరుకున్నా చట్టం వచ్చింది.

2. అధి సాధించిన విజయాలు ఏమిటి?

ఈ చట్టం మౌలికంగా పనిని హక్కుగా యిచ్చి పని కోరిన 15 రోజులలోపు కల్పించకపోతే నిరుద్యోగ భృతిని చెల్లించే బాధ్యతను కేంద్రంపై పెట్టింది. పని చేసిన 15 రోజులలో పనికి వేతనం చెల్లించాలి, ఆలస్యం అయితే పరిహారం చెల్లించాలి. దాని అమలులో కూడా సోషల్ ఆడిట్ ద్వారా ప్రజలకు భాగస్వామ్యం కల్పించారు. ఈ ప్రక్రియలో పౌరులు ఈ చట్టం అమలును ప్రత్యక్షంగా పర్యవేక్షించే హక్కుతో పాటు పురుషులకు స్త్రీలకు సమాన వేతనాలు కల్పించారు. ఆర్థిక స్తోమత, లింగం తో సంబంధం లేకుండా 100 రోజుల పనిని కోరవచ్చు. యిది వరకు ఏ పథకంలోనూ లేనట్టు అర్హుల ఏ పత్రాలు కొరకుండా పనిని కల్పించాలని నిర్ణయించారు. చాలా పథకాలలో పత్రాలను చూపలేక పేదలు వాటిని పొందటంలో యిబ్బందులు ఎదుర్కునేవారు. అందువలన పత్రాలకు సంబంధం లేకుండా పని చేసిన వారికే డబ్బు చెల్లిస్తారు కాబట్టి అర్హత తో సంబంధం లేకుండా అందరికీ పని హక్కు కల్పించారు.

పనిని హక్కుగా కల్పించటంతో పాటు వలసలను ఆపటంలో ఈ చట్టం ముఖ్య భూమిక పోషించింది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కోవిడ్ సమయంలో ఉపాధి కల్పించటంలో ఈ పథకం పాత్రను కాదనరు. దాని ద్వారా కొన్ని వేలకోట్ల రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళి దానికి జవాసత్వాలు యిచ్చింది. పని హక్కు అవడంతో గౌరవం వచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (National Council of Applied Economic Research), యూనివర్సిటీ ఆఫ్ మేరిల్యాండ్ (University of Maryland) సంయుక్తంగా చట్టం వచ్చినప్పటి నుంచి 2012 వరకు చేసిన అధ్యయనంలో 32 శాతం గ్రామీణ పేదరికం తగ్గటానికి అది ఉపయోగ పడిందని తేల్చాయి.

3. Nrega బిజేపి టైమ్ లో ఎలా అమలు అయ్యింది?

బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక అనేక మార్పులు చేసింది. వాటికి బీజం ఆ చట్టంలోనే వున్నాయి. యూపీఏ ఈ చట్టం అమలుకు తన పరిపాలన చివరి రోజులలో తగిన ఉత్సాహం చూపలేదు. మోడి ప్రధాని అయ్యాక నరేగాను కాంగ్రెస్ వైఫ్యల్యాలకు చిహ్నంగా దానిని రద్దు చేయకుండా వుంచుతామని పార్లమెంటు సాక్షిగా అన్నారు. ఆయనకు పని హక్కు పై ఎటువంటి విశ్వాసం లేదు అని తేలిపోయింది. తరువాత దాన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసే ప్రయత్నం చేసినా వారి పార్టీ ముఖ్యమంత్రులు వ్యతిరేకించటంతో వెనక్కి తగ్గారు.

దాని పూర్తి అమలుకు మూడు లక్షల కోట్లు అవసరం అయితే బడ్జెట్ లను కుదించారు. 15 రోజులు లోపు వేతనాలు చెల్లించక పోతే ఇవ్వాల్సిన పరిహారం చెల్లించలేదు. కొత్త చట్టంలో ఈ భాద్యత నుండి కేంద్రం పూర్తిగా తప్పుకుంది. టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా తొమ్మిది కోట్ల మంది కార్మికులు తొలగించ బడ్డారని మేము చెప్పిన విషయాన్ని కేంద్రం కూడా ఒప్పుకుంది.

4. NREGA కు VB G RAM G కి మధ్య వున్న వ్యత్యాసం ఏమి? పనిదినాలను 100 నుండి 125 కు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.

నరేగా చట్టంలో 100 రోజుల పని హక్కుగా వుండేది. ప్రభుత్వాలు ఎప్పుడు సగటున 50 రోజులకు మించి కోవిడ్ లో తప్ప ఎప్పుడు యివ్వలేదు. అలాంటప్పుడు 125 రోజులు పని యిస్తాము అంటే ఎలా నమ్మాలి. కొత్త చట్టంలో 40 శాతం నిధులు రాష్ట్రాలు కల్పించాల్సి వుంటుంది. 125 రోజుల పని హామీ కేంద్రం యిస్తుంది దానికి నిధులు మాత్రం రాష్ట్రాలు ఖర్చు చేయాలి. కొత్త చట్టంలో పని హక్కు హామీ లేదు, హక్కు కాదు, ఎక్కడ అమలు కావాలి అనేది కేంద్రం నిర్ణయిస్తుంది కాబట్టి యునివర్సల్ కూడా కాదు. నిధుల భాద్యత తగ్గించు కుంది. పెత్తనం కేంద్రానిది అయితే బరువు రాష్ట్రాలపైన పెరిగింది. పనికల్పించలేక పోతే నష్టపరిహారం కూడా రాష్ట్రాలు చెల్లించాలి.

5. ఉపాధి హామీ పథకం అమలు కేంద్రం నిర్దేశించిన కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయటం వలన రాష్ట్రాల మధ్య వివక్ష వుండే అవకాశం వుందా?

వాళ్ళకు అనుకూలంగా వుండే రాష్ట్రాలకు నిధులు యిస్తూ వివక్ష చూపటానికి కొత్త చట్టంలో ఎక్కువ అవకాశం వుంది. తమ పరిపాలనలో వుండే వాటికి ఎక్కువ నిధులు ఇవ్వచ్చు.

6. వ్యవసాయ పీక్ సీజన్ పేరుతో ఉపాధిని నిలిపివేయటం వలన వచ్చే నష్టం ఏమిటి? వరి కోతల సమయంలో కూలీల కొరత లేకుండా వుంటుంది కదా? అప్పుడు పథకాన్ని అమలు చేయకుండా తరువాత రోజులలో ఆములు చేస్తే వచ్చే నష్టం ఏమి?

ఉపాధి హామీ పథకం వలన కార్మికులకు వేతనాలు పెరిగాయి వాటికోసం బేరం చేసే పరిస్థితి పెరిగింది. దీనివలన మధ్య తరగతిలో కూలీలు దొరకటం లేదు అనే అసంతృప్తి వుంది. తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయ పనులు వున్న సమయంలో ప్రభుత్వం పనులు కల్పించదు. కూలీలు వాటికి పోవటానికి ఇష్టపడరు. కాబట్టి కూలీలు దొరకరు అనేది తప్పు. యిప్పుడు జరుగుతున్న పనుల్లో 60 శాతం వ్యవసాయానికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి. భూములు బాగుచేసుకోవటం, హర్టీకల్చర్ చెట్లు పెట్టడం లాంటివి యిప్పటికే వున్నాయి.

7. యిప్పటికే అప్పుల్లో వున్నామని చెప్పే తెలుగు రాష్ట్రాలు 40 శాతం ఖర్చు భరించి పథకాన్ని మునుపటిలా అమలు చేస్తాయా? మహిళల పై ప్రత్యేకంగా పడే ప్రభావం ఏమిటి?

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపాధి పనుల్లో మహిళలు 50 శాతం పైనే భాగం అవుతున్నారు. 2024 లో జరిగినట్టు పనులు జరిగితే రు. 3,000 కొట్లు రెండు రాష్ట్రాలు చెల్లించాలి. 125 రోజులు పని కల్పిస్తే యింకా ఎక్కువే అవసరం అవుతాయి. ఈ రాష్ట్రాలు యిప్పటికే సంక్షేమం పై ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని చెప్తున్న పెరిస్థితిలో నామమాత్రంగా నిధులు కేటాయించే పరిస్థితి వుంటుంది.

8. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసిన కేంద్రం పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చే అవకాశం వుందా? CII లాంటి సంస్థలు అలాంటి పథకాన్ని అమలుచేయమని ఎందుకు కోరుతున్నాయి?

సీఐఐ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీన పడి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన పరిస్థితి లో వేతనాలు పెంచమని కోరింది. వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకం ఉపయోగాన్ని గుర్తించారు. ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. పట్టణాలకు వలసలు పెరుగుతున్న రీత్యా సోషల్ సైంటిస్టులు చాలా రోజుల నుండి పట్టణాలలో పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. కోవిడ్ సమయంలో పల్లెల్లో కార్మికులు నరేగా వలన జీవించగలిగారు. పట్టణాలలో కార్మికులు యిబ్బంది పడ్డారు. అందుకే పట్టణాలలో కూడా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ వచ్చింది.

9. 2011 జనాభా లెక్క ప్రకారం 6.7 శాతం వున్న తెలుగు రాష్ట్రాలు మొత్తం నిధులలో 15 శాతం వాడుకున్నాయి. దీనికి కారణం ఏమి?

ఉపాధి హామీ పథకాన్ని సాపేక్షికంగా అభివృద్ది అయిన రాష్ట్రాలు మెరుగ్గా ఉపయోగించు కున్నాయి. వైఎస్ఆర్ లాంటి నాయకులు అధికారులు కూడా చొరవ చూపటం వలన తెలుగు రాష్ట్రాలలో పథకం మెరుగ్గా అమలు అయ్యింది.

10. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కేంద్రం నిధులు విడుదల చేయటం లేదు అని ఫిర్యాదు చేస్తుంటాయి. దీని వెనుక కారణాలు ఏమి? NREGA నిధుల విడుదల లో జరిగే ప్రక్రియ ఏమిటి?

ఉపాధి హామీ పథకం వేతనాలు చెల్లించటంలో రెండు దశలు వుంటాయి. పనిచేసిన వాళ్ళ వివరాలు నమోదు చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ లను రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తాయి. అవి కేంద్రానికి పంపితే కేంద్రం రాష్ట్రాలకు చెల్లిస్తుంది. కేంద్రం పశ్చిమ బెంగాల్ నిధులను దుర్వినియోగం చేసిందని అభియోగం మోపింది. అనుమతి లేని పనులకు వాడుకున్నారని అన్నది. విషయం హై కోర్టుకు వెళ్తే కోర్టు ప్రభుత్వం తప్పు చేస్తే పనిచేసిన వాళ్ళకు వేతనం పొందే హక్కు వుండి కాబట్టి వెంటనే చెల్లించమని చెప్పింది. కేంద్రం చట్టంలో ఒక సెక్షన్ ను ఉపయోగించి నిధులు ఆపింది. తెలంగాణ కూడా యిలాంటి పరిస్థితిలో పెనాల్టీ కట్టి నిధులను విడుదల చేయించుకుంది.

11. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమి చేయాలంటారు? వాళ్ళ తక్షణ కర్తవ్యం ఏమిటి?

తెలంగాణ అసెంబ్లీలో ఈ కొత్త చట్టం గురించి చర్చించ బోతున్నారు. ఇది ఆహ్వానించ దగ్గ విషయం. ఆంధ్రలో ముఖ్యమంత్రి కానీ గ్రామీణ శాఖ మంత్రిగా వున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని యింతవరకు ఏమి మాట్లాడలేదు. అయితే ఒక సర్క్యులర్ యిచ్చి కొత్త చట్టానికి మద్దతుగా సభలు పెడుతున్నారు. యిది చాలా నిరాశాజనకమైన పరిస్థితి. ప్రతిపక్షం కూడా ఎన్డిఏ వైపే వున్నారు. పౌర సమాజం నుండి స్పందన వుంది. దేశ వ్యాప్తంగా నరేగా పై పని చేస్తున్న సంఘాలు జనవరి 7, 8 తేదీల్లో ఢిల్లీలో సమావేశం అవుతున్నాయి. ప్రజలు దేశ వ్యాప్తంగా చట్టంలో మార్పుకు వ్యతిరేకంగా వున్నారు కదులుతున్నారు.

Read More
Next Story