పోలవరం సెగ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను తాకనుందా ..
x

పోలవరం సెగ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను తాకనుందా ..

అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరిపి వివిధ అంశాలు చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి


ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ ఆంధ్ర పోలవరం-నల్లమలసాగర్ ద్వారా నీళ్ళ దోపిడీకి తెరలేపిందని ఆరోపించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. దాని సెగ జనవరి 2 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాకనుంది. మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర పాలకులతో రాజీ పడిందని ఆరోపిస్తూ ప్రభుత్వం జల దోపిడీని ఆపటానికి తగిన చర్యలు చేపట్టలేదన్నారు. అయితే ఈ విషయం పై యిప్పటికే సుప్రీం కోర్టు తలుపుతట్టామని ఎక్కడ రాజీ పడలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసినా ఎవరి వాదనలకు వారు కాగితాలు చూపిస్తుండటంతో సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. నీళ్ళు, నిధులు, నియామకాలలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఏర్పడిన రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఖచ్చితంగా భావోద్వేగాలు పెంచే అంశమే రాజకీయం ఘర్షణ అనివార్యమే.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చర్చలు సంవాదనికి వేదికగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం నిర్వీర్యం అవుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 అధికరణం, ప్రతి ఆరు నెలలకు ఒక సారి అసెంబ్లీ కచ్చితంగా కలవాలని మాత్రమే నిర్దేశిస్తుంది. సభ జరగాల్సిన కాలపరిమితి పైన ఎటువంటి సూచన చేయలేదు. దీనితో అధికారం లో వున్న అన్ని పార్టీలు తూతూ మంత్రంగా మాత్రమే సభలు జరుపుతున్నాయి.

పైపెచ్చు సభలు పరస్పర దూషణలు ఖండనలకు మాత్రం కేంద్రం అవుతున్నాయి. 2002 లో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య ఆధ్వర్యంలో ఏర్పడిన రాజ్యాంగ సమీక్ష కమీషన్ (National Commission to Review the Working of Constitution) ఈ విషయం పై పలు సూచనలు చేసింది. 70 మంది కంటే తక్కువ మంది వున్న రాష్ట్ర శాసనసభ కనీసం 50 రోజులు సమావేశం జరపాలని, 70 లేదా అంత కంటే ఎక్కువ మంది సభ్యులు వున్న సభ 90 రోజులు సమావేశం కావాలని నిర్దేశించింది. అయితే సభ జరపడం అనేది కేవలం ఆరు నెలలకు ఒక సారి జరిగే ఒక ప్రహసనంగా మాత్రమే మారిపోయింది. శాసనసభను గవర్నర్ మంత్రుల సిఫారసుతో సమావేశ పరుస్తారు. సభలో సభ్యులు గందరగోళం సృష్టించటం కూడా సమయం వృధా కావటానికి దారితీస్తోంది.

ఆగస్టులో జరిగిన సమావేశం కేవలం ఒక్క రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమీషన్ యిచ్చిన నివేదిక మీద చర్చ జరిగి ముగిసింది. తరువాత ప్రతిపక్షాలు వివిధ సమస్యలు చర్చించాలని సభాసమయం పొడిగించాలని కోరినా వాయిదా పడ్డాయి. డిసెంబర్ 29 న మొదలైన సమావేశాలు డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర వేడుకల వలన సెలవుతో జనవరి 2 కు వాయిదా పడింది. తదుపరి జరిగిన శాసనసభ బిజినెస్ అడ్వైసరీ కమిటీ సమావేశాలు జనవరి రెండు నుండి ఏడు వరకు జరుగుతాయని నిర్దేశించింది.

సమావేశంలో చర్చ ప్రధానంగా కృష్ణ, గోదావరి జలాలు, సాగునీటి ప్రొజెక్ట్ లు పైన జరుగుతాయని వివిధ వార్తా కథనాలు చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు పైన చర్చ కేంద్రీకృతం అయ్యే అవకాశం వుంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఆంధ్ర నీటి దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించడంతో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నీళ్ళ కేటాయింపులలో జరిగిన వివక్షకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావటంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకోవటం కాకతాళీయమే.

ప్రతిపక్ష బిజెపి శాసనసభ పక్ష నాయకుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి సభను రెండు మూడు రోజులలో ముగించకుండా ఎక్కువ రోజులు జరపాలని కోరారు. ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకమండళ్లను రద్దు చేసి రాజకీయ నియామకాలు చేయడం ఒక కుట్ర అని అన్నారు.

బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ ‘ఫెడరల్ తెలంగాణతో’ మాట్లాడుతూ రాష్ట్ర ప్రబుత్వం ఆదాయ సముపార్జన చేతకాక బిఆర్ఎస్ చేసిన అప్పుల పై లక్ష కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. “రాష్ట్రం వడ్డీ గా కేవలం నెలకు సుమారు రు. 2,000 కొట్లు మాత్రమే చెల్లిస్తోంది. విద్య, వైద్యం సంక్షోభంలో వున్నాయి. పెట్టుబడులు ఆకర్షించి రెవెన్యూ పెంచాల్సింది పోయి కేవలం ప్రభుత్వ భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్ నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో తల్లిదండ్రులు దోపిడీకి గురి అవుతున్నారు. సాధారణ పౌరులకు ఆరోగ్యశ్రీ సేవలు సరిగ్గా అందటం లేదు. తమ మనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో జాబ్ కాలెండర్ విడుదల చేయలేదు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు యిస్తామని చెప్పిన కాంగ్రెసు పార్టీ కెసిఆర్ నోటిఫికేషన్ యిచ్చి, పరీక్షలు నిర్వహించిన వాటిని తాము యిచ్చిన ఉద్యోగాలుగా చెప్పుకుంటోంది,” వీటి పైన కౌన్సిల్ లో చర్చ కోరతాను అన్నారు.

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కు మరమత్తులు చేయకపోవటం, 90 శాతం పైనే పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి పనులు చేపట్టక పోవటం పైన నిలదీస్తాము అని పేర్కొన్నారు.

సమావేశాలు జరిగే సమయం క్రమేణా తగ్గిపోవటం పై వ్యాఖ్యానిస్తూ, “శాసనసభలకు వుండాల్సిన ప్రాధాన్యత పోయింది. ముఖ్యమైన బిల్లులు ఆర్డినెన్సు లుగా వస్తున్నాయి. ప్రజాస్వామ్య స్పూర్తి లేదు. లోతైన చర్చలు జరగటం లేదు. ఒకరిని ఒకరు నిందించుకోవటం దూషించుకోవటం సాధారణం అయిపోవటంతో ప్రజలకు ఆసక్తి తగ్గిపోయింది,” అన్నారు.

సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సభలో చర్చకు బిఎ

సి పరిశీలనకు తన ఎజెండా యిచ్చారు. “ప్రస్తుత శీతాకాల సమావేశాలను కనీసం పది పనిదినాల పాటు నిర్వహించాలి, సభ ఎజెండాను ముందు రోజు రాత్రి కాకుండా ముందే అందించాలని తద్వారా సభ్యులు ప్రిపేర్‌ అయ్యేందుకు వీలు కలుగుతుంది కోరాను. శాసన సభకు సంబంధించి అన్ని కమిటీ నియామకాలు చేయాలి. కేంద్రం ఉపాధి హామీ చట్టానికి చేస్తున్న మార్పులు రాష్ట్రం పై చూపే ప్రభావం, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌ల అమలు నోటిఫికేషన్‌ను, ఎల్‌ఐసిలో 100 శాతం ఎఫ్‌డిఐలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానం, నదీ జలాలు, ప్రాజెక్టుల తాజా స్థితి, అసంఘటిత కార్మికులు, కనీస వేతనాలు, సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన, సింగరేణి కార్మికుల సమస్యలు, ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యలు వారి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ల అమలుపై కార్యాచరణల గురించి చర్చించాలని శాసనసభ బిజినెస్ అడ్వైసరీ కమిటీ లో ప్రతిపాదించాను,” అన్నారు.

జరగబోయే సమావేశాలు మరి ఏ విషయాలను చర్చిస్తాయి అనేది ఎజెండా యింకా వెల్లడి కాకపోవటంతో యింకా స్పష్టత లేదు.

Read More
Next Story