
ప్రధాని మోదీకి తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ( ఫైల్ ఫొటో : సీఎంఓ సౌజన్యంతో)
కేంద్ర బడ్జెట్: తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం దక్కుతుందా?
50 ప్రాజెక్టులు పెండింగే… కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఆశలు
కేంద్ర బడ్జెట్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో అదే ప్రశ్న మళ్లీ మళ్లీ వినిపిస్తోంది… ఈసారి అయినా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం దక్కుతుందా? రైల్వేలు, రోడ్లు, మెట్రో, సాగునీరు, విద్య, పరిశ్రమలు… ఏ రంగాన్ని తీసుకున్నా తెలంగాణకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర కార్యాలయాల్లో ఫైళ్లకే పరిమితమయ్యాయి. 50కి పైగా ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉండగా, 2026–27 కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.
ఫిబ్రవరి 1… దేశ భవిష్యత్తును నిర్ణయించే కేంద్ర బడ్జెట్ రోజు. కానీ తెలంగాణకు మాత్రం అదే రోజు ఆశలూ–నిరాశల మధ్య సమాధానం వచ్చే పరీక్ష. ప్రధానమంత్రి నుంచి కేంద్రమంత్రుల వరకు ఎన్నిసార్లు విన్నవించినా, రాష్ట్రానికి చెందిన 50కు పైగా కీలక ప్రాజెక్టులు ఇంకా కేంద్రం వద్దే మగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026–27 బడ్జెట్‌లో అయినా కేంద్రం తెలంగాణకు న్యాయం చేస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వతేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం మోక్షం కల్పించడం లేదు. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు విదల్చడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలకు చెందిన 50 పెండింగ్ ప్రాజెక్టులు కేంద్రం వద్ద ప్రతిపాదనల్లో మగ్గుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలంగాణ ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం లేదు.
50 ప్రాజెక్టుల ప్రతిపాదనలు పెండింగులోనే...
- తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల 50 ప్రతిపాదనలకు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, వివిధ శాఖల మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులకు పలు సార్లు విన్నపాలు సమర్పించినా వారి నుంచి స్పందన కొరవడింది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదని తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు పలు సార్లు విమర్శల వర్షం కురిపించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు డిప్యూటీ సీఎం వినతి
- కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్రమంత్రిని కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై వినతి పత్రం సమర్పించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు,తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డుకు తక్షణమే అనుమతులివ్వాలని, తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విన్నవించారు. ఈ మేరకు తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై వినతిపత్రాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి సమర్పించారు.
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఏం కోరారంటే...
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వతేదీన ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర వినతిపత్రాలను భట్టి సమర్పించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం, ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల నుంచి మినహాయింపులు, అధిక వడ్డీతో ఉన్న ఆఫ్‌బడ్జెట్ అప్పుల పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని భట్టి కోరారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు, రాష్ట్రంలోని కీలక మౌలిక సదుపాయాలు,అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని భట్టి కోరారు.
పెండింగులోనే మెగా లెదర్ పార్కులు
తెలంగాణలో రెండు మెగా లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కేంద్ర టెక్స్ లైల్స్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రికి 2024 జనవరి 13వతేదీన లేఖ రాసినా కేంద్రం వీటిని మంజూరు చేయలేదు. హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటరును ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరినా దాన్ని కేటాయించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమస్యలు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వద్దే పెండింగులో ఉన్నాయి.
మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించాలి : వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్‌లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్రాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో రవాణా విస్తరణ–రోడ్డు భద్రతపై కేంద్రం పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష... ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తూ ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం రూ.100 ఆదాయమిస్తే అందులో కేవలం రూ.45 మాత్రమే నిధులను రాష్ట్రానికి కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు రూ.100 పన్నుల కింద కడితే రూ.300 నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు.ఢిల్లీ బడ్జెట్ చర్చల్లో రాష్ట్ర హక్కుల కోసం స్పష్టమైన వాదన కేంద్రం ముందు తెలంగాణ అజెండాగా ఈ సారి ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం చెప్పారు.
కేంద్ర బడ్జెట్ కమిటీకి తెలంగాణ విన్నపాలు
‘‘ఈ ప్రీ కేంద్ర బడ్జెట్ కన్సల్టేషన్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవసరాలు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, దేశవ్యాప్తంగా బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్రాల నుంచి ఇవ్వాల్సిన సలహాలు, సూచనలను కమిటీ ముందు ఉంచాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సమగ్ర ప్రతిపాదనను మేం సమర్పించగా, ఆ రిప్రజెంటేషన్‌ను కమిటీ స్వీకరించింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలకు సంబంధించిన అంశాలను మా ప్రతిపాదనలో విస్తృతంగా పొందుపరిచాం.విద్య రంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించాం. వైద్య రంగంలో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.అలాగే మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్, ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్), దానికి అనుబంధంగా ఉండే రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించాం.ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన అనేక కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’’అని భట్టి వివరించారు.
పెండింగులోనే ప్రధాన ప్రాజెక్టులు
ఖమ్మంలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2024 జులై 4వతేదీన సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినా దీనిపై పీఎం నుంచి స్పందన లేదు. 15 వెనుకబడిన జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరినా ఇంకా స్పందన లేదు. హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించినా అదీ అతీ గతీ లేకుండా పోయింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు జాతీయ హోదా కల్పన కేంద్ర జల మంత్రిత్వశాఖ కాగితాలకే పరిమితమైంది.బీహెచ్ఈఎల్- లక్డీకాపూల్, నాగోల్-ఎల్ బినగర్, శంషాబాద్ విమానాశ్రయం-రాయదుర్గ్ మెట్రోరైలు మార్గాల నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదు.
తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు నిధులేవి?
కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినా అది రైల్వేశాఖ వద్ద పెండింగులోనే ఉంది. కల్వకుర్తి నుంచి వంగూరు, దేవరకొండ, చలకుర్తి, తిరుమలగిరి మీదుగా మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదించినా నిధుల జాడ లేదు.వికారాబాద్ నుంచి కృష్ణాకు కొత్త రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదనలు రైల్వే మంత్రిత్వశాఖ వద్దే పెండింగులో ఉన్నాయి. వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్, చిట్లపల్లి, టేకల్ కోడే, రావల్ పల్లి, మేటూరు, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం పట్టాలెక్కడం లేదు. హైదరాబాద్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు ఇంకా కార్యరూపం దాల్చలేదు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కోరినా కేంద్రం నుంచి స్పందన లేదు. తెలంగాణలో జాతీయ క్రీడల నిర్వహణకు అనుమతివ్వాలని, అంతర్జాతీయ క్రీడా మైదానాల నిర్మాణానికి నిధులివ్వాలని కోరినా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ నుంచి చలనం లేదు.
హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయండి : కేంద్రమంత్రికి సీఎం వినతి
టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్ డ్ మాన్యఫ్యాక్చరింగ్ లలో ముందున్న హైదరాబాద్ నగరంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాలని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎంపీల బృందం కోరింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలతో కలిసి ఇటీవల ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్‌లో 200 ఎకరాలను గుర్తించామని, తక్షణమే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందజేస్తుందని సీఎం రేవంత్ కేంద్రమంత్రికి హామీ ఇచ్చారు.పట్టణ, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడడానికి రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.కొమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ లలో కేంద్రీయ విద్యాలయాలు,హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులివ్వండి
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనులు రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ - విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే, జాతీయ రహదారి - 9 విస్తరణతో పాటు ఇతర కీలక రోడ్లు అభివృద్ధి పనులకు నిధులివ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించారు.
ఇన్నేళ్లుగా వినతులు, విజ్ఞప్తులు, ప్రతిపాదనలతోనే సరిపెట్టిన కేంద్రం… ఈసారి అయినా చర్యలు తీసుకుంటుందా అన్నదే తెలంగాణ ప్రజల ఎదుట ఉన్న ప్రశ్న. 2026–27 కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి నిధుల మలుపు అవుతుందా, లేక మళ్లీ పెండింగ్ ఫైళ్ల కథనే కొనసాగిస్తుందా అన్నది ఫిబ్రవరి 1న తేలనుంది.తెలంగాణ అభివృద్ధి అజెండాను ఢిల్లీలో గట్టిగా వినిపించినప్పటికీ, ఆ విజ్ఞప్తులు బడ్జెట్ కాగితాల్లో ప్రతిబింబిస్తాయా అన్నది చూడాలి. రోడ్లు, రైల్వేలు, సాగునీరు, విద్య వంటి కీలక రంగాల్లో కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రగతికి ఆటంకం తప్పదు. అందుకే ఈ బడ్జెట్ తెలంగాణకు కేవలం ఆర్థిక ప్రకటన మాత్రమే కాదు… భవిష్యత్ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది.
Next Story

