రాష్ట్ర డీజీపీ నియామకం పై త్వరలో స్పష్టత రానుందా!!!
x

రాష్ట్ర డీజీపీ నియామకం పై త్వరలో స్పష్టత రానుందా!!!

రాష్ట్రాలు 2006 లో సుప్రీం కోర్టు ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్కు అనుగుణంగా వ్యవహరించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.


రాష్ట్ర డీజీపీ నియామకం పై సుప్రీం కోర్టు లో సోమవారం జరిగే విచారణ లో స్పష్టత రానుందా అంటే అవుననే వివిధ అధికారిక వర్గాలు అంటున్నాయి. దేశంలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు పూర్తి కాలం డీజీపీ స్థానంలో తాత్కాలిక నియామకాలు చేయడంపై సుప్రీం కోర్టు ఇదివరకే అసంతృప్తి వ్యక్తం చేసింది.

వెంటనే నాలుగు వారాల్లో పూర్తి కాలం డీజీపీ నియామకం చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ గడువు విధిస్తూ అది ఫిబ్రవరి 5న ఇచ్చిన ఉత్తర్వులలో తాత్కాలిక డీజీపీ నియామకం 20 ఏళ్ల క్రితం సుప్రీం కోర్టు 2006 లో ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్కు అనుగుణంగా లేదని అభిప్రాయ పడింది. డీజీపీలు రాజకీయాలకు అతీతంగా ఒత్తిడులకు తలొగ్గకుండా పరిపాలన చేయాల్సి ఉంటుందని ప్రభుత్వాలు రాజకీయాలను చట్ట అమలును కలపవద్దని హెచ్చరించింది.

ఈ కేసులో కోర్టు రాజ్యాంగం లోని 142 ఆర్టికల్ క్రింద తనకు ఉన్న విశేషాధికారాలు ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆరుగురు అధికారుల పేర్లు సిఫార్సు చేయాలని అందులోంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ సూచిస్తుందని తెలిపింది. ఆ పేర్ల నుండే సీనియర్ మోస్ట్ సమర్ధ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా తాత్కాలిక డీజీపీ నియామకాలను చేపట్టకూడదని చెప్పింది. రాష్ట్ర పోలీస్ బాస్ పదవీకాలం రెండు ఏళ్లు ఉండాలని కూడా 2006 లో ఇచ్చిన ఈ జడ్జ్మెంట్ లో పేర్కొంది.

జులై 2018, మార్చి 2019 లలో సుప్రీం కోర్టు తన తదుపరి ఉత్తర్వులలో ఈ నియామక ప్రక్రియను మరింత క్రమబద్దీకరించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ కి పదవిలో ఉన్న డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందు తన ప్రతిపాదనలను పంపాలి. ఆ పంపిన పేర్ల నుంచి యూపీఎస్సీ ఒక జాబితా తయారు చేస్తుంది. ఇందులో నుంచి రాష్ట్రం ఒకరిని డీజీపీ గా నియామకం చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనురాగ శర్మ తప్ప మిగిలిన అందరు డీజీపీలు తాత్కాలికంగానే నియామకం అయ్యారు. నవంబర్ 2017 నుండి ఉన్న వాళ్ళు అందరూ తాత్కాలిక అధికారులే. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి నియామకం కూడా సీనియార్టీ ని ఉల్లంఘిస్తూ జరిగిందని టి. ధన్ గోపాల్ రావు అనే లాయర్ హై కోర్టులో 38968/2025 రిట్ పిటిషన్ వేశారు.

దీనికి స్పందిస్తూ యూపీఎస్సీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన పేర్లు సరైన సమయంలో ప్రతిపాదించలేదనే ఫిర్యాదుతో అది పై కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు పై స్పందిస్తూ రాష్ట్రాలు తాము నియమించదలచిన వ్యక్తి డీజీపీ గా నియామకం అయ్యే పక్షం లోనే పంపుతున్నాయని చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు.

“చాలా రాష్ట్రాలు రెగ్యులర్ డీజీపీల స్థానంలో తాత్కాలిక అధికారిని నియమించటానికే మొగ్గు చూపుతున్నాయి. ఇది ప్రకాష్ సింగ్ కేసు లో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకం. యూపీఎస్సీ రాష్ట్రాల కుయుక్తులకు లొంగకూడదు. రాష్ట్రాలు సరయిన సమయంలో కమీషన్ కు పేర్లు పంపాలని ఉత్తరాలు రాయమని కోరాలి,” అని సుప్రీం కోర్టు బెంచ్ సూచించింది. రాష్ట్రాలు తన సూచనను పెడచెవిన పెడితే తమ తలుపు తట్టమని కూడా కోర్టు యూపీఎస్సీ కి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం సరయిన సమయంలో యూపీఎస్సీ తగిన పేర్లు సూచించటంలో విఫలం అయ్యిందని అన్నది.

కొత్త డీజీపీ నియామకానికి సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు మార్చి 5 కే ముగిసిందని ధన్ గోపాల్ రావు గుర్తు చేశారు. “నేను 2018 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకం పై జారీ చేసిన ఆర్డినెన్సు ను కూడా కొట్టివేయమని కోరాను. అది చెల్లదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అందుకే రాష్ట్రం డీజీపీ నియామకం విషయంలో ఆ ఆర్డినెన్సు ప్రకారం ఒక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పటం లేదు. యూపీఎస్సీ ఇప్పటికే ముగ్గురితో కూడిన లిస్ట్ రాష్ట్రానికి పంపినట్టు వార్తలు వస్తున్నాయి. సోమవారం తదుపరి విచారణ సుప్రీం కోర్టు లో ఉంది. యూపీఎస్సీ లిస్ట్ పంపి దానిపై రాష్ట్రం తగిన చర్యలు తీసుకోక పోతే వారిపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాను. శివధర్ రెడ్డి ఆ పోస్టులో కొనసాగటానికి లేదు,” అని ఆయన అన్నారు.

అధికార వర్గాల ప్రకారం అధికారులందరిలోకి సీనియర్ అయిన ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ తదుపరి డీజీపి గా నియామకం అవుతారని తెలుస్తోంది.

Read More
Next Story