రాహుల్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు టీఎంసీ జై కొడుతుందా?
x

రాహుల్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు టీఎంసీ జై కొడుతుందా?

భారత కూటమిలో భాగస్వామి అయిన టీఎంసీ పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఆ పార్టీ రాహుల్‌ యాత్రలో పాల్గొంటుందా?


ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేపడుతున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ జనవరి 25న పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ యాత్రలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) నేతలు పాల్గొంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న టీఎంసీకి కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి రాకపోవడమే అందుకు కారణం.

25న పశ్చిమ బెంగాల్‌లోకి..

ప్రస్తుతం అస్సాంలో రాహుల్‌ యాత్ర కొనసాగుతోంది. కూచ్‌ బెహార్‌ జిల్లాలోని బక్షిర్‌హట్‌ మీదుగా ఈనెల 25న పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుంది. తర్వాత జల్‌పైగురి, అలీపుర్‌దువార్‌, ఉత్తర్‌ దినాజ్‌పూర్‌, డార్జిలింగ్‌ మీదుగా 27న బీహార్‌ చేరుకుంటుంది.

ఆహాన్వం అందాక స్పందిస్తాం..

‘‘మేం రాహుల్‌ పాదయాత్రలో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలాగే, మాకు కాంగ్రెస్‌ నుంచి అధికారిక ఆహ్వానం కూడా అందలేదు. మాకు ఆహ్వానం అందిన తర్వాత, మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’’ అని టీఎంసీ సీనియర్‌ నాయకుడు చెప్పారు.

ముర్షిదాబాద్‌ జిల్లాలో టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ సంస్థాగత సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మమతా బెనర్జీ సారధ్యంలో టీఎంసీ నాయకులంతా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని ఆయన తెలిపారు.

మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీ నాయకత్వంలో 2021లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని ఓడిరచిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ గుర్తుచేశారు.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమిలోని కీలక భాగస్వాములైన టీఎంసీ, కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపకాలపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

భారత కూటమికి సానుకూలంగా టీఎంసీ నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ప్రదీప్‌ భట్టాచార్య తెలిపారు.

గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు..

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఎంసీ 22, కాంగ్రెస్‌ 2, బీజేపీ 18 సీట్లు గెలుచుకున్నాయి.

ఆ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్‌కు టీఎంసీ రెండు సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా.. కాంగ్రెస్‌ పార్టీ మరికొన్ని సీట్లకు పట్టుబడుతున్నట్లు సమాచారం.

2001 అసెంబ్లీ ఎన్నికలు, 2009 లోక్‌సభ ఎన్నికలు, 2011 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి 2011 ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని 34 ఏళ్ల లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని గద్దె దించింది.

Read More
Next Story