ప్రియాంక రాకతో బీజేపీకి ఇక నుంచి నిద్రలేని రాత్రులే: పైలట్
వాయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా భారీ మెజార్టీతో గెలుస్తారని, సభలో అడుగుపెట్టడంతో బీజేపీకి ఇక నుంచి నిద్రలేని రాత్రులు ఉంటాయని కాంగ్రెస్..
ప్రియాంక గాంధీ వాద్రా వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తారని, సభ లో అడుగు పెట్టినప్పటి నుంచి రాహుల్ గాంధీతో కలిసి బీజేపీకి నిద్రలేని రాత్రులు మిగులుస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ ఫైలట్ అన్నారు.
ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. "వయనాడ్ నుంచి ప్రియాంక జీకి చారిత్రాత్మక విజయం సాధించాలని మేము చూస్తున్నాం" అని అన్నారు. "ఆమె చాలా సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నారు. ఒక సమయంలో రాహుల్ జీ, సోనియా జీ, రాజీవ్ జీ కోసం కూడా విస్తృతంగా ప్రచారం చేశారు.
కాబట్టి ఆమె దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలతో బాగా కనెక్ట్ అయ్యారు" అని మాజీ కేంద్ర మంత్రి అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, క్యాడర్‌ను చైతన్యవంతం చేయడంలో ఆమె తన సత్తా చూపారని పైలట్ చెప్పారు. ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందిన ముఖం, కేరళలోని ప్రజల కోసం మాత్రమే కాకుండా పార్లమెంట్‌లో మహిళలు, యువకుల కోసం అండగా నిలబడుతారని అన్నారు.
" రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై దృష్టి సారించారు. వారు మరింత జవాబుదారీగా ఉండవలసిందిగా ప్రజలు తీర్పునిచ్చారు. ప్రియాంక జీ పార్లమెంట్ లో అడుగుపెట్టడంతో బీజేపీకి కష్టకాలం మొదలవుతుంది. లోక్‌సభలో వన్ ప్లస్ వన్ 11 అవుతుంది. ఆమె పార్లమెంట్‌లో రాహుల్‌తో జతకట్టడం వల్ల బీజేపీకి, ఎన్‌డీఏకి నిద్రలేని రాత్రులు వస్తాయి’’ అని పైలట్ అన్నారు.
వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి నవంబర్ 13న పోలింగ్ జరగగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి కూడా గెలుపొందారు.
అయితే వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ప్రియాంక బరిలోకి దిగారు. ఈ స్థానానికి 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రియాంక గాంధీతో పాటు సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరి, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అభ్యర్థి నవ్య హరిదాస్‌లు పోటీలో ఉన్నారు.
Next Story