ఈపీఎఫ్ డబ్బు డ్రా ఇక యూపీఐతో సులభం
x

ఈపీఎఫ్ డబ్బు డ్రా ఇక యూపీఐతో సులభం

కొత్త యాప్ త్వరలో అందుబాటులోకి..


Click the Play button to hear this message in audio format

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు త్వరలో మరో సౌలభ్యం అందుబాటులోకి రానుంది. యూపీఐ (UPI) ద్వారా ఈపీఎఫ్ డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. ఇందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తయారుచేయిస్తోంది. ఈ కొత్త యాప్‌ను ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.

ఈపీఎఫ్‌లో కొంత మొత్తాన్ని అలాగే ఉంచి, మిగిలిన మొత్తాన్ని యూపీఐ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే వీలుంటుంది. ఈ కొత్త యాప్ ద్వారా సభ్యులు తమ పాస్‌బుక్, బ్యాలెన్స్ వివరాలు చూడటం, డబ్బు బదిలీ చేయడం వంటి సేవలను ఒకేచోట పొందగలుగుతారు. లావాదేవీలు పూర్తి చేయడానికి లింక్ చేసిన యూపీఐ పిన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. తద్వారా భద్రతతో నిధులు బదిలీ అవుతాయి.

ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి సభ్యులు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) పోర్టల్ లేదా ఉమాంగ్ (UMANG) యాప్‌ను ఉపయోగిస్తున్నారు. కొత్త యాప్ ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం EPFO 100 డమ్మీ ఖాతాలతో ట్రయల్స్ నిర్వహిస్తూ సాంకేతిక లోపాలను సరిచేస్తోంది.

ఇప్పటి వరకు ఈపీఎఫ్ డబ్బు ఉపసంహరించుకోవాలంటే సభ్యులు క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉండేది. ఇది కొంత సమయం పట్టే ప్రక్రియ. అయితే ఆటో సెటిల్మెంట్ విధానంలో ఇప్పుడు మూడు రోజుల్లో క్లెయిమ్‌లు క్లియర్ అవుతాయి. ఈ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఇప్పటికే రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీనివల్ల వైద్యం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి అవసరాల కోసం సభ్యులు త్వరగా డబ్బు పొందగలుగుతున్నారు.

సుమారు ఎనిమిది కోట్ల మంది సభ్యులున్న EPFOలో ప్రతి సంవత్సరం ఐదు కోట్లకు పైగా విత్‌డ్రాలు జరుగుతున్నాయి. EPFOకు బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోవడంతో సభ్యులు నేరుగా ఖాతాల నుంచి డబ్బు తీసుకునే సౌకర్యం ఇప్పటివరకు లేదు. అయితే బ్యాంకుల మాదిరిగానే సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ డిజిటల్ అప్‌గ్రేడ్‌ను తీసుకొస్తోంది. కొత్త యాప్ ప్రారంభమైతే ఈపీఎఫ్ సభ్యులకు డబ్బు విత్‌డ్రా మరింత సులభం కానుంది.

Read More
Next Story