
అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు..
భర్తపై ఉన్న వివాదంతో సంబంధం లేని మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసి గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దీనికి అసలు కారణం అంగన్ వాడీ టీచర్ కాదు.. ఆమె భర్త. టీచర్ వసంత కుమారి భర్త పలువురు గ్రామస్థుల దగ్గర ఇన్యూరెన్స్ డబ్బులు తీసుకుని, వాటిని తిరిగి ఇవ్వలేకపోవడంతో సమస్య తలెత్తింది. అతను దొరకకపోవడంతో గ్రామస్థులు ఏకమై అతని భార్య వసంత కుమారిని ఇంటి నుంచి ఈడ్యుకెళ్లి చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత ఆమెను విచక్షణారహితంగా కొట్టారు.
వసంత కుమారి భర్త గ్రామంలోని కొంతమందితో ఇన్సూరెన్స్ డబ్బుల లావాదేవీలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గ్రామస్థుల్లో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. ఈ కోపం క్రమంగా తీవ్రమైంది. భర్తపై ఉన్న ఆగ్రహాన్ని భార్యపై చూపిన గ్రామస్థులు ఆమెను ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసినట్లు తెలిసింది. అనంతరం ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా, జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది.
బాధితురాలు వేడుకున్నప్పటికీ గ్రామస్థులు వినిపించుకోలేదని సమాచారం. దాదాపు గంటసేపు ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. ఈ ఘటన అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత వివాదాలు ఎలా తీవ్రమవుతున్నాయన్న అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

