తెలంగాణ పాలనలో అతివల ఆధిపత్యం
x
తెలంగాణ అటవీశాఖ మహిళాా అధికారిణులే కీలకం

తెలంగాణ పాలనలో అతివల ఆధిపత్యం

రైల్వే, అటవీ, రెవెన్యూ, పోలీస్ సహా కీలక శాఖల్లో మహిళా అధికారిణులే ముందంజ


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో మహిళా శక్తి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రైల్వే నుంచి అటవీ శాఖ, పోలీస్ వ్యవస్థ నుంచి జిల్లా పరిపాలన వరకు పలు కీలక ప్రభుత్వ విభాగాల్లో మహిళా అధికారిణులు ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తూ తమ నాయకత్వాన్ని చాటుకుంటున్నారు. పాలనలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూ రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ శాఖల్లో మార్చి 8వతేదీ...అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏ ప్రభుత్వ శాఖకు ఆ శాఖ తాము మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని ప్రకటిస్తున్నారు. మహిళా అధికారిణులు, మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా ప్రభుత్వ శాఖల వారీగా సమావేశాలు నిర్వహించడంతో పాటు ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులను సైతం ప్రదానం చేశారు. తెలంగాణలో ప్రస్థుతం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కీలక శాఖల్లో మహిళా అధికారిణులకే కీలక బాధ్యతలు అప్పగించడం ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్పెషల్ గా నిలిచింది.

సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలకస్థానాల్లో మహిళా అధికారిణులే...

కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధీనంలోని దక్షిణ మధ్య రైల్వేలో (SCR) ని ఐదు కీలక విభాగాలు మహిళా అధికారిణుల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇది జోన్ చరిత్రలో మొదటిసారి. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజరుగా కె. పద్మజ , ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజరుగా ఇతి పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రైళ్ల నిర్వహణ, సమయపాలన, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, రైల్వే రాబడి పెంపు అంశాల్లో వీరు ముందున్నారు.రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ గా అరోమా సింగ్ ఠాకూర్ ఐజీగా రైళ్లలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ గా నిర్మల నరసింహన్ ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. రైల్వేలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజరుగా హేమ సునీత ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ మహిళా అధికారులు రైల్వే ఆపరేషన్స్, కమర్షియల్, ఫైనాన్స్, సెక్యూరిటీ, మెడికల్ వంటి కీలక విభాగాలను నిర్వహిస్తూ రైల్వే ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయిదు రైల్వేస్టేషన్లలో అందరూ మహిళలే...

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అయిదు రైల్వేస్టేషన్లలో అన్నీ విభాగాల్లో 100 శాతం మహిళలే పనిచేస్తున్నారు. రైళ్ల ఆపరేషన్స్ నుంచి సెక్యూరిటీ దాకా మహిళలే పనిచేస్తుండటం విశేషం. బేగంపేట, చంద్రగిరి, గుండ్ల పోచంపల్లి, విద్యానగర్, రామవరప్పాడ్ రైల్వేస్టేషన్లలో అన్ని విభాగాల్లోనూ అందరూ మహిళలే పనిచేస్తున్నారు.

రైలు ఇంజన్ డ్రైవర్లుగా...

రైల్వేలో నావిగేటింగ్ నుంచి హెవీ లోకోమోటివ్స్ నడపడం దాకా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రైలు ఇంజన్ డ్రైవర్లుగా ప్రయాణికుల భద్రత కోసం మహిళలు సమర్ధంగా పనిచేస్తున్నారు.లోకోమోటివ్‌లను నడపడం నుంచి ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడం వరకు దక్షిణ మధ్య రైల్వే మహిళలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అటవీ సంరక్షణలో అతివలదే ఆధిపత్యం

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24 శాతం అటవీ భూభాగానికి మహిళా మంత్రి కొండా సురేఖతోపాటు మహిళా ఐఎఫ్ఎస్ అధికారిణి డాక్టర్ సి.సువర్ణ ప్రిన్సిపల్ సీసీఎఫ్ గా పనిచేస్తున్నారు.రాష్ట్రంలో పచ్చని చెట్ల సంర‌క్షకులుగా మహిళా ఐఎఫ్ఎస్ అధికారిణులు ఉన్నారు. అడవుల పరిరక్షణే కాకుండా వాటి అభివృద్ధి, వన్యప్రాణుల భ‌ద్ర‌త‌ బాధ్యతలను మహిళలు మోస్తున్నారు. ఆకుపచ్చని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో అటవీ శాఖలో మహిళలు నిబద్ధతతో పని చేస్తున్నారు.

అన్ని శాఖల్లోనూ అతివలే ముందంజ

దేశంలో ఇండియన్ ఫారెస్టు సర్వీసు లో మహిళలు 1980వ సంవత్సరం నుంచే ఎంపికవుతూ వస్తున్నారు. యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ద్వారా ఎంపికైన మహిళా అధికారులు అడవుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. నేడు మహిళలు క్షేత్ర స్థాయి నుంచి అత్యున్నత పదవుల వరకు ఎదిగి అటవీ శాఖకు నాయకత్వం వహిస్తూ ప్రకృతి పరిరక్షణలో కీలక భాగస్వాములుగా నిలుస్తున్నారు.తెలంగాణ అటవీ శాఖలో అత్యున్నత స్థాయి అధికారుల్లో ఒకరిద్దరు మినహాయించి ఎక్కువమంది మహిళలే ఉండటం విశేషం. మహిళల నాయకత్వంలోనే అటవీ శాఖ ముందుకు సాగుతోంది.

కీలక స్థానాల్లో మహిళా అధికారిణులు

అటవీ శాఖకు మంత్రి గా కొండా సురేఖ, అటవీ దళాల అధిపతిగా డాక్టర్ సి.సువర్ణ (IFS), తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా సునీత ఎం.భగవత్ (IFS), అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారిణిగా ఎస్.జె.ఆశ (IFS), తెలంగాణ CAMPA సీఈఓగా క్షితిజ (IFS), దేశంలోనే పేరొందిన శిక్షణా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్‌గా ప్రియాంక వర్గీస్ (IFS), ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డీన్‌గా ప్రవీణ (IFS), భారత దేశంలోనే అతిపెద్ద జూ పార్క్ లలో ఒకటిగా నిలిచిన నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ గా వసంత IFS వీరితో పాటు వివిధ జిల్లాల అటవీ శాఖాధికారిణులుగా మహిళలు తమదైన ప్రతిభను చాటుతూ అటవీ శాఖను సమర్థంగా నడిపిస్తున్నారు.

ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా మహిళలు

అడవుల సంరక్షణలో మహిళలు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు.మహిళలే బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లుగా క్షేత్ర స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,115 మంది మహిళా అధికారులు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తూ అడవుల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దట్టమైన అడవుల్లో పోడు భూముల ఆక్రమణల సమస్య ఒకవైపు, వన్యప్రాణుల దాడుల ముప్పు మరోవైపు ఉన్నప్పటికీ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు ధైర్యంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ అడవులను కాపాడుతున్నారు. కింది స్థాయిలో బీట్ ఆఫీసర్లుగా చేరిన కొంతమంది పురుషులు వివిధ కారణాలతో ఉద్యోగాలను వదిలిపెట్టే సందర్భాలు కనిపిస్తాయి. అయితే మహిళల విషయంలో ఇది చాలా తక్కువగా ఉంది.మహిళలు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందే వరకు అదే శాఖలో నిబద్ధతతో పనిచేస్తూ తమ సేవలను అందిస్తున్నారు.

పచ్చదనం కోసం ఆడపడుచుల ఆరాటం

తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం భూభాగాన్ని పచ్చని చెట్లతో నింపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం వనమహోత్సవాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని అటవీ శాఖ ముందుకు సాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని మరింత ఆకుపచ్చగా మార్చాలనే పట్టుదలతో మహిళా అటవీ అధికారిణులు కృషి చేస్తున్నారు.అడవుల్లో పనిచేయడం సులభం కాదు. ప్రమాదాలు, సవాళ్లు, ఒంటరితనం...ఇవన్నీ ఉన్నా బాధ్యతను ముందుంచి మహిళలు పురుషులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నారు.తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో దూలపల్లి అటవీ అకాడమీలో గ్రీన్ క్వీన్స్ (హరిత రాణులు) పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వరంగల్ లో మహిళలే కీలకం

కాకతీయుల కాలం నాటి మహిళా నాయకత్వానికి గుర్తుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ కడియం కావ్య కొనసాగుతున్నారు. వరంగల్ మేయరుగా గుండు సుధారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా కలెక్టరుగా సత్య శారదాదేవి, హనుమకొండ కలెక్టరుగా చాహత్ బాజ్ పాయ్, మహబూబాబాద్ కలెక్టరుగా స్నేహ శబరీష్ పనిచేస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత ఉన్నారు.

13 జిల్లాల్లో మహిళా కలెక్టర్లు

తెలంగాణలో మహిళా నాయకత్వానికి మరింత బలం చేకూరింది. 33 జిల్లాల్లో 13 జిల్లాలకు మహిళా ఐఎఎస్ అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనలో సమగ్రత, జవాబుదారీతనం, ప్రజా సేవలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం మహిళా ప్రాతినిధ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో 33 జిల్లాలుండగా, ఇందులో 13 జిల్లాలకు మహిళా ఐఎఎస్ అధికారులను జిల్లా కలెక్టర్లుగా ఎ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నియమించింది. రాష్ట్రంలో జిల్లా పరిపాలనను బలోపేతం చేయడంలో 13 మంది మహిళా కలెక్టర్లు ముందున్నారు. మహిళా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లాలు ఇవీ : నిజామాబాద్ - ఇలా త్రిపాఠి,హైదరాబాద్ - హరి చందన,నిర్మల్ - అభిలాష అభినవ్,మహబూబ్ నగర్ - ఖుష్బూ గుప్తా,కరీంనగర్ - చిత్ర మిశ్రా,మహబూబాబాద్ - స్నేహ శబరీష్,మెదక్ - ప్రతిమా సింగ్,రాజన్న సిరిసిల్ల - గరిమా అగర్వాల్,సిద్దిపేట - హైమావతి,వరంగల్ - సత్య శారధ,సంగారెడ్డి - ప్రవీణ్య,హన్మకొండ - చాహత్ బాజ్‌పాయ్,కుమురం భీమ్ ఆసిఫాబాద్ - హరిత.

తెలంగాణలో 32 మంది మహిళా ఐపీఎస్ లు

తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా అధికారిణుల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ప్రస్తుతం 32 మంది ఐపీఎస్ (IPS) అధికారిణులు, ఇతర ర్యాంకుల్లో వేలాదిమంది మహిళలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. షీ టీమ్స్ (SHE Teams), మహిళా భద్రతా విభాగం, సిఐడి (CID) వంటి విభాగాల్లో వీరు విశేష సేవలు అందిస్తున్నారు. అదనపు డీజీపీలుగా శిఖా గోయెల్ (సీఐడీ) , చారు సిన్హా (ఏసీబీ),స్వాతి లక్రా,డాక్టర్ సౌమ్య మిశ్రా, సుమతి ఎస్ఐబీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ దళంలో డీఎస్పీగా నియమితులయ్యారు.
మహిళల అంకితభావం, ధైర్యం, నాయకత్వం సమాజ అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థలో మహిళల పెరుగుతున్న ప్రాతినిధ్యం సమానత్వానికి నిదర్శనం.అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Read More
Next Story