
కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జ్ పనుల్లో ప్రమాదం
పెద్దవాగుపై నిర్మాణంలో కార్మికులు జారిపడటం. ఇద్దరికి గాయాలు, ఒకరు శిథిలాల్లో చిక్కుకుని తీవ్ర స్థితి.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌పై నుంచి ముగ్గురు కార్మికులు జారి పడిపోయారు. కార్మికులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పెద్దవాగుపై మూడో రైల్వే లైన్ కోసం కొత్త వంతెన నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో కార్మికుడు బ్రిడ్జ్ శిథిలాల కింద ఇరుక్కుపోయాడు. గాయపడిన వారిని స్థానికులు, తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైద్య బృందం ఘటన స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుడికి చికిత్స అందిస్తోంది.
అతనికి తీవ్ర రక్తస్రావం జరిగి శరీర భాగాలు నలిగిపోయినట్లు తెలిసింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని పేర్కొంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

