రేబిస్ నివారణపై ఒక డాక్టర్ హెచ్చరిక
x

రేబిస్ నివారణపై ఒక డాక్టర్ హెచ్చరిక

నేడు ప్రపంచ జూనోసెస్ దినం పాటిస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? జూలై ఆరు నే ఈ దినోత్సం ఎందుకు జరుపుకుంటారు? దీని చరిత్ర ఏమిటి?


నేడు (జూలై 6,2025) ప్రపంచ వ్యాపితంగా జూనోసెస్ దినోత్సవం (World Zoonoses Day) పాటిస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ దినం ఉద్దేశం.

ఈ సందర్భంగా ప్రముఖ వెటర్నరీ ప్రజా వైద్యులు, జంతువుల గురించి ప్రజల అవగాహన పెంచడానికి కృషిచేస్తున్న డా. ఎం. గోవిందరాజ భాస్కర్ జూనోసెస్ దినో త్సం గురించి మాట్లాడారు.

"ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోటిక్ దినోత్సవాన్ని జరుపుకుంటారు . 1885 జూలై 6న ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్త లూయీ పాస్చూ ర్ (Louis Pasteur, 27 December 1822 – 28 September 1895) తొలిసారి రేబిస్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా ఒక బాలుడిపై ప్రయోగించిన రోజు ఇది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలలో అవగాహన కల్పించడానికి జరుపుతున్నారు.
"జూనోటిక్ వ్యాధులు అంటే — జంతువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులు. రాబిస్, కోవిడ్-19, ఎబోలా, లస్సా ఫీవర్, ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, బోవిన్ ట్యూబర్‌క్యులోసిస్, జికా వైరస్, SARS, MERS, వెస్ట్ నైల్ వైరస్, లైమ్ డిసీజ్, ఎల్లో ఫీవర్ వీటిలో ప్రధానమైనవి. ఇవి జంతువులనుంచి నేరుగా మనిషికి సంక్రమించిన జబ్బులు. వీటి కారణంగా ప్రపంచ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతోంది. ఈ వ్యాధులలో అత్యంత ప్రాణాంతకం రేబిస్(Rabies)," అని ఆయన చెప్పారు.

రేబిస్ – మానవ నాడి వ్యవస్థను దెబ్బతీసే వైరస్ అంటూ ఆయన ఆ జబ్బు గురించి ఇలా వివరించారు.
"రేబిస్ అనేది తీవ్రమైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా కుక్కలు, నక్కలు, పిల్లులు, ఎలుకలు మరియు ఇతర పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఒకసారి రోగ లక్షణాలు ప్రారంభమైతే చికిత్స సాద్యంకాకపోవడం వల్ల, మరణం తప్పదు.
"ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 59,000 మంది రేబిస్ కారణంగా మృతి చెందుతున్నారు. ఇందులో ఎక్కువ మంది ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో నివసించే వారు. భారతదేశంలోనే సుమారు 20,000 మరణాలు జరగుతున్నట్టు అంచనా."
వ్యాక్సిన్ కనిపెట్టే ముందు పరిస్థితి
"రేబిస్ వ్యాక్సిన్ కనిపెట్టే ముందు ఈ వ్యాధిని అంచనా వేయడం చాలా కష్టం. కాటు తగిలిన తర్వాత బాధితులలో తీవ్రమైన జ్వరాలు, నీళ్లంటే భయం, ఉబ్బసం, మానసిక ఆందోళన, నీళ్లను తాగలేకపోవడం వంటి లక్షణాలు కనిపించేవి. ఒకసారి లక్షణాలు వచ్చిన తరువాత ఇక మరణం తధ్యం.
1885లో లూయీ పాస్చర్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి, తొలిసారిగా 9 ఏళ్ల జోసెఫ్ మీస్టర్ అనే బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి వ్యాక్సిన్ లభ్యత వల్ల ఈ వ్యాధికి మరణాల శాతం గణనీయంగా తగ్గింది.
రేబిస్ నివారణ మార్గాలు:
1. ప్రతి పెంపుడు కుక్కకు సంవత్సరం లోపల రేబిస్ వ్యాక్సిన్ వేయాలి.
2. కాటు జరిగిన వెంటనే గాయాన్ని సబ్బుతో కనీసం 10 నిమిషాల పాటు కడగాలి.
3. వెంటనే వైద్యుని సంప్రదించి Post Exposure Prophylaxis (PEP) టీకా తీసుకోవాలి.
4. అడవి జంతువులతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించాలి.
5. గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని డాక్టర్ గారు సూచించారు.
"రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుని పురస్కరించుకొని అన్ని పశువైద్యశాలలో ఉచితంగా అంటి-రేబిస్ టీకాలను వేస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించాలి" అని డాక్టర్ అన్నారు.
నివారణే రక్షణ
"రేబిస్ అనేది పూర్తిగా నివారించదగిన వ్యాధి.
ఒక చిన్న టీకా — ఒక ప్రాణాన్ని రక్షించగలదు. ప్రతి కుటుంబం, ప్రతి పశువు యజమాని ఇది గుర్తించి, సకాలంలో వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అవగాహనే ఆయుధం. మనుషుల ప్రాణాలను కాపాడాలంటే జంతువుల ఆరోగ్యాన్ని కాపాడాలి," అని డాక్టర్ గోవిందరాజ భాస్కర్ హెచ్చరించారు


Read More
Next Story