
విడాకులకు భర్త చెప్పిన కారణంతో ఆశ్చర్యపోయిన జడ్జీలు
విడాకుల దరఖాస్తులో భర్త చెప్పిన కారణం చూసిన జిల్లా కోర్టు కేసును కొట్టేసింది
విడాకులకు ఈమధ్య పెద్దకారణాలు ఉండటంలేదు. పిల్లలు పుట్టడంలేదని, సంసారానికి సహకరించటంలేదని కారణాలతో పాటు, ప్రతిరోజు మద్యం తీసుకుంటున్నారని, గురకపెడుతున్నారనే కారణాలతో కూడా విడాకులు కావాలని భార్య, భర్తలు కోర్టులో కేసులు దాఖలు చేస్తున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే భార్యకు వంటచేయటం రాదనే కారణంగా ఒక భర్త విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. బుధవారం విడాకుల కేసు విచారణకు వచ్చినపుడు భర్త చెప్పిన కారణం విన్న జడ్జీలే ఆశ్చర్యపోయారు. ఎల్ఎల్బీ చదవిన ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని 2015లో వివాహం చేసుకున్నాడు.
2017లో వైద్య సంబంధిత కారణాలతో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలై పెద్దవైపోవటంతో 2018 నుండి విడిగానే ఉంటున్నారు. ఎలాగూ సంవత్సరాల తరబడి విడిగా ఉంటున్నాము కాబట్టి విడాకులు తీసుకోవాలని అనుకున్న భర్త మల్కాజ్ గిరి జిల్లా కోర్టులో విడాకులకు దావావేశాడు. విడాకుల దరఖాస్తులో భర్త చెప్పిన కారణం చూసిన జిల్లా కోర్టు కేసును కొట్టేసింది. జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తు భర్త హైకోర్టులో రివిజన్ పిటీషన్ వేశాడు. ఆ పిటీషన్ పైన ఈరోజు జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ నగేష్ భీమపాక విచారణ జరిపారు. విచారణ సందర్భంగా భర్త తరపు లాయర్ చెప్పిన కారణం విన్న భీమపాక ఆశ్చర్యపోయారు.
ఇంతకీ విడాకులకు భర్తచెప్పిన కారణాలు ఏమిటంటే తన భార్యకు వంట రాదట. అలాగే తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించటంలేదట. రెండు కారణాలను విన్న జడ్జీలిద్దరూ భర్తనే తప్పుపట్టారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాబట్టి విభిన్న పనివేళల దృష్ట్యా భార్య వంటచేయలేకపోవటాన్ని తీవ్రమైననేరంగా పరిగణించలేమన్నారు. వంటచేయలేకపోవటాన్ని, తల్లికి ఇంటిపనుల్లో సహకరించకపోవటాన్ని భార్య క్రూరత్వంగా పరిగణించలేమని జడ్జీలు భర్త దాఖలుచేసిన కేసును కొట్టేశారు. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్ళవద్దని భర్తకు జడ్జీలు సూచించారు. మరి హైకోర్టు జడ్జీల సూచనతో భర్త విడాకుల ప్రయత్నాన్ని ఆపుతాడా లేకపోతే సుప్రింకోర్టుకు వెళతాడా అన్నది చూడాలి.

